గ్లోబల్ టెర్రరిస్టుగా మసూద్!: డిమాండ్ పై చైనా ఎటు?

గ్లోబల్ టెర్రరిస్టుగా మసూద్!: డిమాండ్ పై చైనా ఎటు?

భారత దౌత్యం ఈసారైనా ఫలించేనా? జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న లక్ష్యం నెరవేరుతుందా? ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లోని శాశ్వత సభ్య దేశాల్లో మెజారిటీ మద్దతు మనకే ఉన్నా మూడుసార్లు ఆ ప్రతిపాదన వీగిపోయింది. మరోసారి బుధవారం బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ దేశాలు మనకు అండగా ముందుకొచ్చాయి. మసూద్ అజార్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని యూఎన్ భద్రతా మండలిలో ప్రతిపాదించాయి.

బ్లాక్ లిస్ట్.. ఆస్తులు, ఆయుదాల సీజ్

15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఆంక్షల కమిటీలో మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని ప్రతిపాదన పెట్టాయి. భారత్ లో పుల్వామా దాడి చేసి, తామే బాధ్యులమని ప్రకటించుకున్న జైషే చీఫ్ ను బ్లాక్ లిస్టులో చేర్చాలని డిమాండ్ చేశాయి యూకే, యూఎస్, ఫ్రాన్స్. జైషేకు ఉన్న ఆస్తులను, దాని ఆయుధాగారాలను సీజ్ చేయాలని కోరారు. అంతర్జాతీయ ప్రయాణాలపై బ్యాన్ విధించాలని డిమాండ్ చేశాయి. ఈ ప్రతిపాదనను కమిటీ 10 రోజుల్లోగా పరిశీలించి యాక్షన్ తీసుకునే చాన్స్ ఉంది.

చైనా ఇటా.. అటా..?

జైషే చీఫ్ మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని భారత్ 2009 నుంచే ప్రయత్నిస్తోంది. ఇప్పటికి ఇది నాలుగో ప్రయత్నం. 2009, 2016, 2017ల్లో యూఎన్ భద్రతా మండలిలో ఈ ప్రతిపాదన తెచ్చి.. చివరి అంచుదాకా వచ్చి విఫలమైంది. అగ్రదేశాలన్నీ మనకే మద్దతు తెలుపుతున్నా ప్రతిసారీ చైనా వల్లే బ్రేక్ పడుతోంది. పాక్ కు వత్తాసు పలుకుతూ తన వీటో అధికారంతో మసూద్ ను కాపాడుతూ వచ్చింది.

మసూద్ పై దెబ్బ తప్పదు

అయితే ఈ సారి మాత్రం పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు అమరులవ్వడం, తాజాగా భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ను ఏకాకిని చేయడంలో భారత్ సక్సెస్ అయింది. ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావడంతో చైనాపై కూడా ఒత్తిడి పెరిగింది. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించడం మానాలని పొరుగు దేశం హెచ్చరించింది. నిన్న జరిగిన భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలోనూ మసూద్ అంశాన్ని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రస్తావించారు. చైనా మంత్రితో ప్రత్యేకంగా భటీ అయ్యారు. మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించడంలో సహకరించాలని కోరారు. అయితే చైనా ఎలా వ్యవహరిస్తుందో చూడాలి. పుల్వామా దాడి తర్వాత ఉన్న ఒత్తిడితో భారత్ కే మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విదేశాంగ శాఖ వర్గాలు అంటున్నాయి.