యాదగిరిగుట్టలో ‘కార్తీక’ రద్దీ

యాదగిరిగుట్టలో ‘కార్తీక’ రద్దీ

యాదగిరిగుట్ట, వెలుగు :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి కార్తీక రద్దీ మొదలైంది. కార్తీకమాసానికి తోడు ఆదివారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. రద్దీ కారణంగా నారసింహుడి ధర్మదర్శనానికి నాలుగు, ప్రత్యేక దర్శనానికి గంటన్నరకుపైగా సమయం పట్టిందని భక్తులు తెలిపారు. భక్తులు ఎక్కువ శాతం సొంత వెహికల్స్‌‌లో రావడంతో పార్కింగ్ ప్రదేశం పూర్తిగా నిండింది. దీంతో వాహనాలను హెలీప్యాడ్, వాహన పూజల ప్రాంగణానికి డైవర్షన్‌‌ చేశారు. భక్తులు ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, విష్ణుపుష్కరిణి, లక్ష్మీపుష్కరిణి, పాతగుట్ట, వ్రత మండపాల్లో కార్తీక దీపాలు వెలిగించి, శివకేశవులకు రుద్రాభిషేకం, బిల్వార్చన జరిపించారు. 

ఒక్కరోజే 1,372 సత్యనారాయణ స్వామి వ్రతాలు

యాదగిరిగుట్టలో ఆదివారం నిర్వహించిన సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం ఒక్కరోజే 1,372 వ్రతాలు జరిగాయి. కార్తీకమాసంలో ప్రతి రోజు ఆరు బ్యాచ్‌‌లలో వ్రతాలు నిర్వహిస్తుండగా.. రద్దీ కారణంగా ఆదివారం ఏడు బ్యాచ్‌‌లు నిర్వహించారు. ఇందులో మొదటి బ్యాచ్‌‌లో 275, రెండో బ్యాచ్‌‌లో 259, మూడో బ్యాచ్‌‌లో 254, నాలుగో బ్యాచ్‌‌లో 266, ఐదో బ్యాచ్‌‌లో 227, ఆరో బ్యాచ్‌‌లో 53, ఏడో బ్యాచ్‌‌లో 38 జంటలు వ్రతాలు నిర్వహించుకున్నాయి. వ్రతాల నిర్వహణ ద్వారానే ఆలయానికి రూ.13.72 లక్షల ఆదాయం సమకూరింది.

కొండపైన కొబ్బరికాయ రూ.100

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొబ్బరికాయల వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆఫీసర్ల పర్యవేక్షణ కొరవడడంతో తమ ఇష్టం వచ్చినట్లు వసూలు చేస్తూ భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. కార్తీకమాసానికి తోడు ఆదివారం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ఒక్కో కొబ్బరికాయకు రూ.100 వసూలు చేశారు. ఇంత రేటు ఎందుకు అని ప్రశ్నించిన భక్తులతో ‘అది అంతే’ అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. ఈ విషయం మొత్తాన్ని సెల్‌‌ఫోన్‌‌లో రికార్డు చేసిన భక్తులు సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేయడంతో వైరల్‌‌గా మారింది. ఆలయానికి సంబంధించిన ఉన్నతాధికారులంతా విదేశాల్లో ఉండడం, కింది స్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఈవో వెంకట్‌‌రావు సెలవు పేరుతో అమెరికాలో పర్యటిస్తుండగా, కల్యాణం పేరుతో చైర్మన్ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌శర్మ, ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధానార్చకులు నరసింహమూర్తి, ముఖ్య అర్చకులు కిరణ్‌‌ యూకేలో ఉన్నారు. ఇక ఇన్‌‌చార్జి ఈవోగా బాధ్యతలు చేపట్టిన రవినాయక్‌‌ సైతం సెలవుపై వెళ్లడంతో ఎండోమెంట్ కమిషనర్ హరీశ్‌‌ ఇన్‌‌చార్జి ఈవోగా వ్యవహరిస్తున్నారు. దీంతో కింది స్థాయి సిబ్బంది అండదండలతోనే వ్యాపారులు రేట్లు పెంచి భక్తులను దోచుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.