లీడర్ల భూముల కోసం రాంగ్​ రూట్

లీడర్ల భూముల కోసం రాంగ్​ రూట్
  • మాస్టర్​ ప్లాన్లు, అలైన్​మెంట్లలో ఇష్టమొచ్చినట్లు మార్పులు
  • నిండా మునుగుతున్న సామాన్యులు, రైతులు
  • మంత్రులు, ఎమ్మెల్యేల కోసం మారిన ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్​
  • ఇండస్ట్రియల్​ పార్కులు, హైవేలు మెట్రో కారిడార్​లోనూ ఇదే తంతు
  • 74 మున్సిపాలిటీల పాత మాస్టర్​ ప్లాన్లలో కొత్తగా మార్పులు

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్ర సర్కార్​ తీసుకొస్తున్న మాస్టర్ ప్లాన్లు, అలైన్​మెంట్లు, డీపీఆర్​లు లీడర్లకు లాభంగా.. రైతులకు శాపంగా మారుతున్నాయి. డ్రాఫ్ట్​ దశ కంటే ముందే ఎక్కడ ఏముంటుందో తెలుసుకుని, పలుకుబడిని ఉపయోగించుకొని తమకు అనుకూలంగా రూట్లను నాయకులు మార్పించుకుంటున్నారు. ఆ తర్వాత డ్రాఫ్ట్  నోటిఫికేషన్​నే ఫైనల్​ చేయించుకుంటున్నారు. కొన్నిసార్లు అంతా ఫైనల్​ అయిన తర్వాత కూడా భూసేకరణ సమయంలో మార్పులు చేయించుకుంటున్నారు. లేదంటే ఆ ప్రాజెక్టులను ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంటున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మాస్టర్​ప్లాన్లతోపాటు రింగ్​ రోడ్లు, నేషనల్​ హైవేలు, స్టేట్​ హైవేలు, మెట్రో కారిడార్ల అలైన్​మెంట్లలో ఇదే  తంతు జరుగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కామారెడ్డి మాస్టర్​ ప్లాన్​కు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చాలా చోట్ల ఇలాంటి నిరసనలే కొనసాగుతున్నాయి. పంటలు పండే భూములను కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

రీజినల్​ రింగు రోడ్డులో..! 

ఓ మంత్రి బంధువులు, అనుచరుల భూములకు లాభం చేకూరేలా మెదక్​ జిల్లాలో రీజినల్​ రింగ్​ రోడ్డు (ఆర్​ఆర్​ఆర్) ​అలైన్​మెంట్​ మార్చారు. ముందు అనుకున్న సర్వే ప్రకారం 30 మంది రైతుల భూములు పోవాల్సి ఉండగా.. అలైన్​మెంట్​ మార్పుతో 115 మంది రైతులు భూములు కోల్పోతున్నారు. ఆర్ఆర్ఆర్​ ఫస్ట్​ ఫేజ్​ మెదక్ ​జిల్లాలోని నర్సాపూర్​, శివ్వంపేట, వెల్దుర్తి, మాసాయిపేట, తూప్రాన్​ మండలాల మీదుగా వెళ్లనుంది. ఇందుకు సంబంధించి తొలుత ఫీల్డ్ సర్వే చేసి రూట్​లో మార్కింగ్ ​ఇచ్చి హద్దురాళ్లు పాతారు. అయితే మార్కింగ్ నుంచి కాకుండా వేరే భూముల్లో రింగ్​రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సర్వే చేస్తున్నారు.ఆ మార్కింగ్​ ప్రాంతాల్లో అధికార పార్టీ లీడర్ల భూములు ఉండటంతో అవి పోకుండా రింగ్ రోడ్డు అలైన్​మెంట్​లో మార్పులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

ఆర్‌ఆర్‌ఆర్​ సెకండ్​ ఫేజ్​కు సంబంధించి రంగారెడ్డి, వికారాబాద్​, మహబూబ్​నగర్​ జిల్లాల్లోనూ ఇష్టారీతిన అలైన్​మెంట్​ మార్పులు వస్తున్నాయి. ఈ జిల్లాల్లోని లీడర్లు ప్రగతి భవన్​ నుంచే వ్యవహారాలు నడుపుతూ తమ భూములను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, పూడూర్‌, చేవెళ్ల, శంషాబాద్, షాబాద్, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, మంచాల మండలాల్లో వారి ల్యాండ్స్​ భూసేకరణలో పోకుండా  అలైన్​మెంట్​లో మార్పులు చేయించినట్లు స్థానిక రైతులు అంటున్నారు.  

శంషాబాద్​లో దాదాపు 50 ఎకరాల భూమి ఓ మంత్రి భూమిలో నుంచి వెళ్లాల్సి ఉండగా, దానిని మార్చి పక్క నుంచి తీసుకెళ్తున్నారు. ఇక మరో మంత్రికి సంబంధించిన 450 ఎకరాల భూమి కోసం ఉమ్మడి మహబూబ్​నగర్​లో ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్​ లో మార్పులు చేయించారు. 

నిరుడు వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్‌ పూలింగ్‌  పద్ధతిలో భూమి సేకరించేలా డీపీఆర్​ తేవడంతో.. అక్కడి రైతులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి చివరికి ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది. 

హైవేలు, మెట్రో అలైన్​మెంట్లు మార్చేస్తున్నరు

కరీంనగర్ లోని అధికార పార్టీ కీలక నేతకు చెందిన ఒక మెడికల్​ కాలేజీ కోసం ఎన్ హెచ్ 563 రోడ్డు అలైన్ మెంట్ మార్చినట్లు తెలిసింది. కరీంనగర్​ చుట్టూ ఇప్పటికే  ఒక రింగు రోడ్డు ఉంది. దానికి అనుబంధంగా ఎన్​హెచ్​ 563 అలైన్​మెంట్​ ఉండాలి. కానీ, మార్చేశారు. హైవేను కాస్తా రింగు రోడ్డుకు 30 కిలోమీటర్లు అదనంగా తిప్పుకుంటూ కాలేజీ పక్కగా తీసుకెళ్తున్నారు. గతంలో నిర్ణయించిన అలైన్ మెంట్ ను వదిలి కరీంనగర్ మీదుగా ఇరుకుళ్ల రోడ్డు,  రామగుండం బైపాస్ రోడ్డు గుండా జాతీయ రహదారి నిర్మాణం చేపడుతుండటంతో వందలాది మంది రైతులు పచ్చని పొలాలను కోల్పోతున్నారు. 

ఖమ్మం– విజయవాడ మధ్య నిర్మిస్తున్న నేషనల్​ హైవేకు ఖమ్మం శివారులో భూసేకరణ జరగకుండా అధికార పార్టీకి చెందిన కీలక నేత అడ్డుపడుతున్నారు. తనకు చెందిన భూములతో పాటు, తన అనుచరగణం భూముల కోసం హైవే అలైన్​మెంట్​ మార్చాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. 

సీఎం కేసీఆర్​ శంకుస్థాపన చేసిన రాయదుర్గం–ఎయిర్​పోర్ట్​ మెట్రో రూట్​ కూడా లీడర్ల భూములకు అనుకూలంగా మారిందనే  విమర్శలున్నాయి. ఆ ప్రాంతంలో లీడర్ల భూములకు ధరలు పెంచేందుకే ఎక్కువ డిస్టెన్స్​ ఉన్న రూట్​ వచ్చేలా మార్పులు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. 

ఇండస్ట్రియల్​ పార్కుల్లోనూ అదే తంతు

రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్​ పార్క్​ల విషయంలోనూ ప్రభుత్వం లీడర్లు చెప్పినట్లే చేస్తోందనే ఆరోపణలు న్నాయి. దండు మల్కాపురం ఇండస్ట్రియల్​ పార్క్, ముచ్చెర్లలోని ఫార్మాసిటీలోనూ 19 వేల ఎకరాల రైతుల భూములు తీసుకున్నారు. లీడర్ల భూములు మాత్రం చుట్టు పక్కల సేఫ్​గా ఉన్నాయి.  

మాస్టర్​ ప్లాన్ల​లో ఇష్టారాజ్యం

ఏండ్ల తరబడి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన మాస్టర్​ ప్లాన్లను నాన్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల ముంగిట హడావుడి చేస్తున్నది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు మాస్టర్​ ప్లాన్లు ఫైనల్​ చేసుకుని, అందుకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆరేండ్ల కిందట్నే  ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వాటిని ఇంతవరకు అమల్లోకి తీసుకురాలేదు. ఇప్పుడు తాజాగా మాస్టర్​ ప్లాన్లు రెడీ అంటూ డ్రాఫ్ట్​ నోటిఫికేషన్లు ఇస్తున్నది. దీనిపై రైతుల నుంచి, సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అయితే మాస్టర్​ ప్లాన్లు ఆలస్యం కావడానికి కారణం.. వాటి ప్లాన్​ డిజైన్లు, డెవలప్​మెంట్​ ఏరియాలను మార్చాలని అధికార పార్టీ లీడర్లు ఒత్తిడి తేవడమేనన్న ఆరోపణలు ఉన్నాయి.  ఇప్పటికే 74 మున్సిపాలిటీల మాస్టర్​ ప్లాన్లు రెడీగా ఉండగా.. వాటిలోనూ లీడర్లకు అనుకూలంగా మార్పులు చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో 68 చోట్ల కొత్త మాస్టర్​ ప్లాన్లు రెడీ చేస్తున్నారు. చెరువులు, వాగులు, కాల్వలతోపాటు రైలు, రోడ్డు మార్గాలు, పారిశ్రామిక వాడలు మొదలైనవి బఫర్‌ జోన్లుగా మాస్టర్​ ప్లాన్లలో నిర్దేశిస్తారు. పట్టణాల్లో కనీసం పదిశాతానికి తగ్గకుండా గ్రీన్‌జోన్లు పెడుతున్నారు. బఫర్​ జోన్లు, గ్రీన్​ జోన్లలో తమ భూములు వెళ్లకుండా, డెవలప్​మెంట్​ యాక్టివిటీస్​ మాత్రమే తమ భూముల పరిధిలో జరిగేలా  లీడర్లు మార్పులు చేయించుకుంటున్నారని, ఫలితంగా రైతుల భూములు ఆ జోన్లలోకి వెళ్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బఫర్​ జోన్లు, గ్రీన్​ జోన్లలోకి భూములు వెళ్తే, ఆ భూముల ధర పడిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయంపైనే కామారెడ్డి జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా చోట్ల చెరువుల ఎఫ్ టీఎల్, వరద కాలువల ప్రాంతాలను కబ్జా చేసి వాటిని డెవలప్​మెంట్​  ఏరియాలుగా ప్రపోజ్ చేయాలని లీడర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఈ లిస్ట్​లో వరంగల్​, నిజామాబాద్​, కరీంనగర్​, మంచిర్యాల, మేడ్చల్​, మిర్యాలగూడ, నల్గొండ, నిర్మల్​, పెద్దపల్లి, ఆర్మూర్​, సిరిసిల్ల, అమీన్​పూర్​, సంగారెడ్డి, జహీరాబాద్  ఉన్నాయి.  

కలెక్టరేట్ల నిర్మాణంలోనూ..

సూర్యాపేట కలెక్టరేట్ నిర్మాణ స్థల విషయంలో 2018లో వివాదం తలెత్తింది. ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నా కొందరు వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రైవేట్ స్థలంలో కలెక్టరేట్ భవన నిర్మాణం చేపట్టారని కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు.  
  
నిర్మల్ జిల్లాలో కొత్త కలెక్టరేట్ మీదుగా వెళ్లే ప్రధానరోడ్డు నిర్మాణం అలైన్​మెంట్​ను మార్చారు. నేషనల్ హైవే నంబర్ 61, రెడ్డి ఫంక్షన్​హాల్ ఎదురు నుంచి ఎల్లపెల్లి మీదు గా బంగల్​పేట్​ వరకు ఈ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 28 కోట్లు మంజూరు చేసింది. నాలుగు వరుసలుగా నిర్మించే ఈ రోడ్డుకు ఇరువైపులా విలువైన భూములు ఉండడంతో అధికార పార్టీ నేతలు ఆ భూముల యజమానులతో సెటిల్మెంట్లు చేసుకొని వారి భూముల నుంచి రోడ్డు నిర్మాణం జరగకుండా అలైన్మెంట్లను మార్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట టెంపుల్​ పునర్నిర్మాణంతో రియల్​ ఎస్టేట్​ బూమ్​ అందుకుంది. ఈ ఏరియాలో ముందస్తుగా అధికార పార్టీకి చెందిన కీలక  నేతలు తమతోపాటు  బంధువుల పేర్ల మీద వందల ఎకరాల భూములు కొన్నారు. ఇదే ప్రాంతంలో ఆర్​ఆర్​ఆర్​ వెళ్తున్నది. అయితే.. రీజినల్​ రింగ్​ రోడ్డులో నేతల  భూములు పోకుండా ఇతర రైతుల భూముల్లోకి వెళ్లేలా అలైన్​మెంట్​లో మార్పులు చేశారని స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రీజినల్​ రింగ్​ రోడ్డు ఫస్ట్​ ఫేజ్​లోని యాదాద్రి భువనగిరి, మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డితోపాటు సెకండ్​ ఫేజ్​లోని రంగారెడ్డి, వికారాబాద్​, మహబూబ్​నగర్​లోనూ ఇట్లనే రూట్లు మారుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.