ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ప్రకంపనలు సృష్టిస్తున్న సుడా డ్రాఫ్ట్ ప్లాన్

మరో రింగు రోడ్డు నిర్మాణంతో రైతుల్లో ఆందోళన

విలువైన జాగాలు కోల్పోతామని రైతుల ఆవేదన

సిద్దిపేట, వెలుగుః సిద్దిపేట అర్బన్ డెవలప్ మెంట్  అధారిటీ (సూడా)  డ్రాఫ్ట్  మాస్టర్ ప్లాన్  పట్టణ ప్రజలను.. సుడా పరిధిలో చేర్చిన 26 గ్రామాల రైతులను కలవరపెడెతోంది. వచ్చే 40 ఏండ్ల  అవసరాలకు తగ్గట్టు   రోడ్డు నెట్ వర్క్ ,  గ్రోత్ కారిడార్, ట్రాఫిక్,   రైల్వే లైన్ వెంట సౌకర్యాలను  మాస్టర్ ప్లాన్ లో పొందుపరుస్తున్నారు.  ప్రతిపాదిత ప్లాన్ పై ​సెప్టెంబరు 5  వరకు సలహాలు,  సూచనలు, అభ్యంతరాలను   స్వీకరించింది.  వాటిని పరిశీలించిన అనంతరం ఇటీవలే డ్రాఫ్ట్ ప్లాన్  విడుదల చేశారు.

సుడా పరిధిలో చేర్చిన గ్రామాల్లోని  సర్వే నెంబర్ల ను సూచిస్తూ మాస్టర్ ప్లాన్ ఎలా అమలు చేయనున్నారోనని పేర్కొనడం  రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక్కసారి మాస్టర్ ప్లాన్ ను ఖరారు చేస్తే దాన్ని మార్చే వీలుండదని వారు ఆందోళన చెందుతున్నారు. మాస్టర్ ప్లాన్  వల్ల కొన్ని ప్రాంతాల్లో తమ విలువైన భూములు కోల్పోతామన్న ఆందోళనతో  సిద్దిపేట మండలం చిన్నగుండవెల్లి రైతులు  ఏకంగా వంటా వార్పు నిర్వహించారు.  గతంలో మల్లన్న సాగర్ రిజర్వాయర్ కు  థర్డ్ టీఎంసీ నీటి తరలింపు విషయంలో తాము భూములు కోల్పోవలసివచ్చిందని వాపోతున్నారు. 

మరో రింగ్ రోడ్డుతోనే ఆందోళన

సుడా పరిధిలో 150 ఫీట్ల వెడల్పుతో మరో రింగ్ రోడ్డును నిర్మించాలనే ప్రతిపాదన ఇప్పుడు  రైతులను కలవర పెడుతోంది. డ్రాఫ్ట్ ప్లాన్ లో భాగంగా సుడా పరిధిలో  రింగ్ రోడ్డు వెల్లే మార్గాన్ని  సూచిస్తూ సర్వే నెంబర్లను పేర్కొన్నారు.   సిద్దిపేట పట్టణ శివార్లలో భూముల ధరలు కోట్ల రూపాయలకు చేరడంతో  సుడా రింగ్ రోడ్డు  పేరిట తమ భూములను ఎక్కడ  సేకరిస్తుందోనని  పలువురు భయపడుతున్నారు. రింగ్ రోడ్డు నిర్మాణం విషయం తమకు తెలియక పోవడం వల్ల తాము అభ్యంతరాలు ఇవ్వలేక పోయామంటున్నారు.

మాస్టర్ ప్లాన్ ను ఫైనల్ కాక  ముందే తమ సమస్యను అధికారులకు తెలియజేయడానికే ఆందోళన చేసినట్టుగా రైతులు పేర్కొంటున్నారు. సుడా పరిధిలోని 26 గ్రామ పంచాయతీ ల్లోని  327 కిలో మీటర్ల లో చేపట్టే పనుల విషయంపై తమకు ఏమైనా సమస్యలు వస్తాయా అన్న ఆందోళనలో రైతుల్లో వ్యక్తం అవుతోంది.

ప్రజల నుంచి 256 దరఖాస్తులు

సుడా మాస్టర్ ప్లాన్ రూపకల్పనపై 256 ధరఖాస్తులు వచ్చాయి. వీటిలో  దాదాపు 130  కోమటి చెరువు పరిసర ప్రాంతాన్ని రిక్రియేషన్ జోన్ నుంచి తొలగించి రెసిడెన్షియల్ జోన్ లోకి  మార్చాలని కోరుతూ వచ్చాయి. రంగనాయక సాగర్ పరిసరాల్ని సైతం రిక్రియేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని దాదాపు 30 దరఖాస్తులు అందాయి. మందపల్లి, డీఎక్స్ ఎన్ కంపెనీ పరిసరాలను ఇండస్ట్రీయల్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని 50 కి పైగా,   మైత్రి వనం నుంచి ఇందూరు కాలేజీ వరకు రెండు రోడ్లను 60 నుంచి 30 ఫీట్లకు తగ్గించాలని కోరుతూ మిగతా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించడానికి మరికొంత కాలం పట్టే అవకాశం వుంది. అయితే మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్న  రింగ్ రోడ్డు ప్రతిపాదనపైనే అందరిలో  టెన్షన్​నెలకొంది. 

మాస్టర్ ప్లాన్ వాయిదాకు అవకాశం?

సుడా మాస్టర్ ప్లాన్ అమలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదలతోనే  రింగ్ రోడ్డు తో పాటు ఇతర అంశాల్లో అందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కొంత కాలం పాటు సుడా  మాస్టర్ ప్లాన్ ను వాయిదా పడనున్నట్టు  తెలుస్తోంది. సిద్దిపేట పట్టణ శివార్ల నుంచి రెండు నేషనల్​  హై వేల తోపాటు దుద్దెడ నుంచి  88 కిలో మీటర్ల మేర కేసీఆర్ మార్గ్ పేరిట అవుటర్ రింగ్ రోడ్డు ను నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయ్యే వరకు సుడా మాస్టర్ ప్లాన్ ను పక్కన పెట్టాలని ఆలోచనలో వున్నారు.  సుడా పరిధిలో   కొనసాగుతున్న రైల్వే లైన్ పనులు కూడా   పూర్తయిన తరువాత  మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తే బావుంటుందని   ఆలోచిస్తున్నారు. 

ప్రజల వినతులపై వెంటనే స్పందించాలి

సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్​ శరత్

సంగారెడ్డి టౌన్, వెలుగు: మంత్రి హరీశ్​రావు వివిధ సందర్భాలలో  జిల్లాకు వచ్చినప్పుడు ఆయనకు ప్రజలు ఇచ్చిన వినతులపై ఆయా శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శనివారం కలెక్టరేట్ మినీ మీటింగ్​ హాల్​లో మినిస్టర్​కు అందజేసిన దరఖాస్తులు, తీసుకున్న చర్యలపై సమీక్షించారు. సంబంధిత అధికారులు ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి చేయాలని కలెక్టర్​ సూచించారు. తమ పరిధిలో లేనట్లయితే ఆయా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. సమీక్షలో అడిషనల్​ కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, డీఆర్వో రాధికా రమణి, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, డీపీవో సురేశ్​మోహన్, డీఎం అండ్​హెచ్​వో డాక్టర్ గాయత్రి దేవి, మిషన్ భగీరథ ఎస్ఈ రఘువీర్, ఉద్యాన శాఖ ఏడీ సునీత, రెవెన్యూ డివిజనల్ అధికారులు నగేశ్, రమేశ్​బాబు పాల్గొన్నారు.

హమాలీలకు దసరా బోనస్ పంపిణీ

జిల్లా పౌర సరఫరాల సంస్థ లో పనిచేస్తున్న హమాలీలకు జిల్లా  కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్, అడిషనల్​ కలెక్టర్ వీరారెడ్డి తో కలిసి శనివారం తన చాంబర్​లో దసరా బోనస్ ను అందించారు. దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 

పేదల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం 

ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డి

దుబ్బాక, వెలుగు: రాష్ట్రంలోని పేదల ఆర్థికాభివృద్ధే టీఆర్ఎస్​ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో ఎంపీ సుడిగాలి పర్యటన చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్స్​కు భూమి పూజ చేశారు. చెరువుల్లో చేప పిల్లలను వదిలారు. దుర్గామాత మండపాల్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేసీఆర్ ​ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ వస్తోందన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్​ఎస్​కు పూర్వ వైభం లభిస్తోందని తెలిపారు. చేప పిల్లల పంపిణీతో మత్య్స కారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పలు కుల సంఘ భవనాల నిర్మాణాలను పూర్తి చేసి తొందరగా ప్రారంభించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్​రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్​రెడ్డి, మున్సిపల్​ చైర్ పర్సన్​ గన్నె వనితా భూంరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​ బక్కి వెంకటయ్య, ఎంపీటీసీ ఎల్​ రాంరెడ్డి, సర్పంచులు పోతనక రాజయ్య, శెట్టి సంతోష, మడూరి శ్రీనివాస్​, కరికె భాస్కర్,​ టీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షులు బానాల శ్రీనివాస్​, జీడిపల్లిత రాంరెడ్డి, పల్లె వంశీ కృష్ణ, నాయకులు కేఆర్​ భీమసేన తదితరులు పాల్గొన్నారు. 

సీఎంఆర్​ఎఫ్​ పేదలకు అండ  

జహీరాబాద్, వెలుగు : అనారోగ్యానికి గురై బాధ పడుతున్న పేదలకు సీఎంఆర్​ఎఫ్​ అపన్న హస్తంలా ఉంటుందని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. కరోనా బారిన పడి ఆసుపత్రికి పెద్ద మొత్తంలో  ఖర్చు పెట్టుకున్న జహీరాబాద్ పట్టణానికి చెందిన నాజియ ఇర్ఫత్ కుటుంబసభ్యులకు శనివారం ఎంపీ రూ.2.50 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ను అందజేశారు. దీంతో బాధితులు ఎంపీకి కృతజ్ఞాతలు  తెలిపారు.   రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, కొహిర్ ఎంపీటీసీ హన్నన్ జావేద్ ఉన్నారు. 
============
ఆరు ప్రైవేట్​హాస్పిటళ్లకు నోటీసులు
మెదక్​ టౌన్, వెలుగు :  మెదక్​ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్​ హాస్పిటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం మెదక్ పట్టణంతో పాటు మెదక్​ డివిజన్​లోని12  ప్రైవేట్​ హాస్పిటళ్లలో తనిఖీలు నిర్వహించారు. వాటిలో ఆరు ఆసుపత్రులకు పొల్యూషన్​ సర్టిఫికెట్, బయో మెడికల్​వేస్టేజ్​సర్టిఫికెట్స్​ లేనందున నోటీసులు జారీ చేసినట్లు డీఎంఅండ్​హెచ్​వో విజయ నిర్మల తెలిపారు. తనిఖీల్లో డాక్టర్​ నవీన్​కుమార్, డాక్టర్​అనీలా, డాక్టర్​ మణికంఠ పాల్గొన్నారు. 
==============
కొనసాగుతున్న ‘సేవాపక్షం’ కార్యక్రమాలు
మెదక్​టౌన్/సంగారెడ్డి టౌన్, వెలుగు : ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా సెప్టెంబర్​17 నుంచి ఈనెల 2 వరకు నిర్వహిస్తున్న సేవాపక్షంలో భాగంగా
శనివారం బీజేపీ లీడర్లు పలు కార్యక్రమాలు చేపట్టారు. మెదక్​లో బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​శ్రీనివాస్​ ఆధ్వర్యంలో గుజరాతీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించారు. పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్​చార్జి రాజేశ్వరరావు దేశ్​పాండే 
ఆధ్వర్యంలో చెరువుల శుద్ధీకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని వినాయక సాగర్​లో ప్లాస్టిక్, చెత్తను తొలగించారు. 

వృద్ధులను గౌరవించాలి 

వెలుగు, నెట్​వర్క్​: వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ కంటికి రెప్పాలా చూసుకోవాలని మెదక్, సంగారెడ్డి అడిషనల్​ కలెక్టర్లు ప్రతిమాసింగ్, రాజర్షి షా సూచించారు. శనివారం సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మెదక్​ జిల్లాలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సీనియర్ ఓటర్లను జిల్లా  స్వీప్ నోడల్ ఆఫీసర్ ​రాజిరెడ్డి సన్మానించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబం, పిల్లల కోసం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎక్కువ భాగం జీవితం గడిపారని, ఇకపై ఆరోగ్యం,ఆనందంగా జీవించడం కోసం ఆలోచించాలని సూచించారు.  నేటితరం పిల్లలకు స్కూల్స్,  కాలేజీల్లో  కుటుంబం విలువలు,  కుటుంబం పట్ల అవగాహన, తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ పట్ల  అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్లు వృద్ధులను సన్మానించారు. 
 

ఉత్సాహంగా బతుకమ్మ

వెలుగు, నెట్​వర్క్: ఉమ్మడి మెదక్​ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. శనివారం జోగిపేటలో ఎమ్మెల్యే చంతి క్రాంతి కిరణ్, నర్సాపూర్​లో ఎమ్మెల్యే మదన్​రెడ్డి బతుకమ్మలను ఎత్తుకున్ని మహిళలు, యువతుల్లో ఉత్సాహాన్ని నింపారు. మెదక్​ కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్ రమేశ్, మెదక్​ జిల్లా కోర్టు సముదాయంలో జిల్లా జడ్జి లక్ష్మీశారద, సిద్దిపేట పోలీస్ కమిషనర్ లో సీపీ శ్వేత, సంగారెడ్డి పోలీస్​ కార్యాలయంలో డీఎస్పీ డీఎస్పీ రవీందర్ రెడ్డి, తదితరులు వేడుకలకు హాజరై పూజలు చేశారు. ఆయా ప్రాంతాల్లో మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో బతుకమ్మ చుట్టూ ఆడిపాడారు. అనంతరం వాటిని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ​

​స్తంభాన్ని ఢీకొన్న బైక్​.. ఇద్దరు మృతి 

గజ్వేల్, వెలుగు : స్తంభాన్ని భైక్​ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్​ మండలం అహ్మదీపూర్ క్రాస్ రోడ్డు శనివారం జరిగింది. గజ్వేల్ పోలీస్ ఇన్స్​పెక్టర్ వీర ప్రసాద్ తెలిపిన ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన సక్లేన్(24) ప్రజ్ఞాపూర్ లో వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఆ షాపులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ కు చెందిన సాజీద్ (29) పనిచేస్తున్నాడు. వీరద్దరూ శనివారం సాయంత్రం బైక్ పై తొగుట గ్రామానికి వెళ్లి రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వేగంగా వస్తుండటంతో అహ్మదీపూర్ ఎక్స్ రోడ్ వద్ద బైక్​ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న విద్యుత్​ స్తంభాన్ని ఢీకొంది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆరోగ్య పరిరక్షణ కోసమే వీక్లీ పరేడ్

సిద్దిపేట రూరల్, వెలుగు : పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసమే వీక్లీ పరేడ్ నిర్వహిస్తున్నట్లు సీపీ ఎన్. శ్వేత తెలిపారు. శనివారం పెద్ద కోడూర్ గ్రామ శివారులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్  సిబ్బందికి నిర్వహించిన వీక్లీ పరేడ్ కు ఆమె గౌరవ వందనం స్వీకరించారు. సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్, స్క్వాడ్, లాఠీ డ్రిల్ ను పరిశీలించారు. వీక్లీ పరేడ్ తో సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ చంద్రబోస్, తదితరులు 
పాల్గొన్నారు.

డాక్టర్లను అభినందించిన ఇఫ్కో డైరెక్టర్

మెదక్​ టౌన్, వెలుగు:  మెదక్​ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సెప్టెంబర్ నెలలో రికార్డు స్థాయిలో 377 ప్రసవాలు నిర్వహించారు. ఈ మేరకు శనివారం డాక్టర్ల బృందాన్ని ఇఫ్కో డెరైక్టర్ దేవేందర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆస్పత్రికి జిల్లాతో పాటు పక్కాన ఉన్న కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, గోపాల్​పేట తదితర ప్రాంతాల నుంచి వచ్చే పేద గర్భిణులకు సేవలందిస్తోందని తెలిపారు. రికార్డు స్థాయిలో ప్రసవాలు జరగడానికి జిల్లా గైనకాలజిస్టు డాక్టర్​ శివదయాల్, డీసీహెచ్ డాక్టర్​ చంద్రశేఖర్, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్​హాస్పిటల్​లో క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.23. 75 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 

కల్యాణలక్ష్మి పేదలకు వరం

తూప్రాన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం పేదలకు వరంగా మారిందని ఎఫ్ డీ సీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన తూప్రాన్ తహసీల్దార్ ఆఫీస్ లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్​ రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్  పాల్గొన్నారు.