- ఆరు ఎగ్జామ్స్‌కు సంబంధించి 15 పేపర్లు లీక్
- మాస్టర్ పేపర్లలో ప్రశ్నలతో పాటు జవాబులు
- షమీమ్, రమేశ్, సురేశ్ విచారణలో కీలక వివరాలు వెలుగులోకి..
- వాళ్ల ఇండ్లలో సిట్ సోదాలు
- మరికొంత మంది టీఎస్పీఎస్సీ
- ఉద్యోగులకు నోటీసులు ఇచ్చే చాన్స్
హైదరాబాద్, వెలుగు: టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సంచలన విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులకు క్వశ్చన్ పేపర్లే కాకుండా.. ప్రశ్నలతో పాటు జవాబులూ ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్లు లీక్ అయ్యాయి. గ్రూప్ 1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్ క్వశ్చన్ పేపర్లను ప్రవీణ్ గ్యాంగ్ హ్యాక్ చేసిందని సిట్ విచారణలో తేలింది.ఈ ఎగ్జామ్స్ కు సంబంధించి మొత్తం 15 మాస్టర్ క్వశ్చన్ పేపర్లు నిందితుల చేతికి చేరినట్లు వెల్లడైంది.
దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈ పరీక్షలు రాసిన అభ్యుర్థులు.. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఎగ్జామ్స్ రాసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. క్వశ్చన్లతో పాటు ఆన్సర్స్ కూడా తమ చేతికి అందడంతో లీకేజీ విషయం బయటపడదనే ధీమాతో నిందితులు ఆ క్వశ్చన్ పేపర్లను సేల్ చేసినట్లు గుర్తించింది. వీళ్లతో పాటు మరికొంత మంది ఉద్యోగులకు కూడా పేపర్లు లీక్ అయినట్లు అనుమానిస్తోంది.
శంకరలక్ష్మీ పాత్రపై ఆరా..
కస్టడీలో భాగంగా గురువారం రెండో రోజు టీఎస్పీఎస్సీ ఉద్యోగి షమీమ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేశ్, మాజీ ఉద్యోగి సురేశ్ లను సిట్ విచారించింది. ఎల్బీనగర్, ఉప్పల్, సైదాబాద్ లోని నిందితుల ఇండ్లలో సోదాలు జరిపింది. కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్స్ రికార్డ్ చేసింది. గ్రూప్ 1కు సంబంధించిన మెటీరియల్ స్వాధీనం చేసుకుంది. నిందితులు ఇచ్చిన సమాచారంతో టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీని సిట్ గురువారం మరోసారి విచారించింది. షమీమ్, రమేశ్ తో కలిపి శంకరలక్ష్మీని ప్రశ్నించి స్టేట్ మెంట్ రికార్డు చేసింది. పేపర్ల లీకేజీలో ఆమె పాత్ర ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.
మరోసారి టీఎస్పీఎస్సీ ఉద్యోగుల విచారణ?
ప్రవీణ్ ద్వారా పేపర్ లీక్ అయిన తర్వాత.. వీళ్లంతా ఎక్కడ ప్రిపేర్ అయ్యారనే వివరాలను సిట్ అధికారులు సేకరించారు. మాస్టర్ క్వశ్చన్ పేపర్ కావడంతో ఎలాంటి కోచింగ్ సెంటర్‌కి వెళ్లలేదని గుర్తించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో 150 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కావడంతో ఈజీగా ప్రిపేర్ అయ్యారని ఆధారాలు సేకరించారు. పేపర్ జిరాక్స్ కాపీలు చేతిలో ఉండడంతో ఇంకా ఎవరికైనా షేర్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, షమీమ్, రమేశ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా టీఎస్పీఎస్సీలో మరికొంత మంది ఉద్యోగులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంతకుముందు విచారించిన 22 మందిని మరోసారి ప్రశ్నించనున్నట్లు సమాచారం. ఇందులో క్వాలిఫై అయిన ఆరుగురికి షమీమ్, రమేశ్‌లతో ఉన్న కాంటాక్ట్స్ వివరాలను సిట్ సేకరించింది.
మరింత మందికి గ్రూప్ 1 పేపర్ లీక్?
ప్రవీణ్ ద్వారానే షమీమ్‌కి గ్రూప్ 1 పేపర్ చేరినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్ ద్వారా అదే సెక్షన్‌లో పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్ దామెర రమేశ్, న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌రెడ్డిలకు పేపర్ చేరినట్లు తేలింది. టీఎస్ పీఎస్సీలో గతంలో టెక్నీషియన్‌గా పని చేసిన సురేశ్ కు కూడా గ్రూప్1 పేపర్ లీక్ కావడంతో.. చైన్ సిస్టమ్ ద్వారా మరికొంత మందికి గ్రూప్1 పేపర్ చేరి ఉండొచ్చని సిట్ అనుమానిస్తోంది. మరికొంత టీఎస్ పీఎస్సీ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్‌కు కూడా పేపర్ చేరి ఉండొచ్చని భావిస్తోంది. ఈ క్రమంలోనే కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులతో పాటు సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ నుంచి పూర్తి వివరాలు రాబడుతోంది.
