
వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను తయారు చేసి ప్రతిభను చాటాడు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవికి చీరను బహూకరించగా.. మంగళవారం ఈఓ రాధాబాయికి అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కళాకారుడు నల్ల విజయ్ మాట్లాడుతూ చీర పొడవు 5.5 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు, బరువు 250 గ్రాములు ఉండగా.. పూర్తిగా పట్టుతో, బంగారు జరీతో సహా 21 రకాల సుగంధ ద్రవ్యాలతో రూపొందించినట్టు తెలిపారు. తన తండ్రి నల్ల పరంధారాములు 1987లో అగ్గిపెట్టెలో ఇమిడే చీరను తయారు చేసి ప్రపంచానికి సిరిసిల్ల ఖ్యాతిని చెప్పాడని గుర్తుచేశారు. తన తండ్రి స్ఫూర్తితో ఏటా అమ్మవారికి చీరును బహుకరిస్తున్నానని, ఇందులో భాగంగానే ఈసారి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను తయారు చేసి ఇచ్చానన్నారు.