6,7 క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టును ఫిజిక్స్ టీచర్లే చెప్పాలి

6,7 క్లాసుల మ్యాథ్స్ సబ్జెక్టును ఫిజిక్స్ టీచర్లే చెప్పాలి

 

  • ఉత్తర్వులు జారీచేసిన విద్యాశాఖ కార్యదర్శి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మళ్లీ ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల సమస్య తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఆరో తరగతి మ్యాథ్స్ ను ఫిజిక్స్ టీచర్, ఏడో తరగతి మ్యాథ్స్ ను స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) టీచర్ బోధిస్తున్నారు.  తాజాగా ఆరు, ఏడు తరగతుల మ్యాథ్స్ సబ్జెక్టును స్కూల్ అసిస్టెంట్ ( ఫిజిక్స్) టీచర్లే చెప్పాలని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని 2024–25 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ఆదేశించారు. ఉమ్మడి ఏపీలోనే (2002) ఫిజిక్స్ పోస్టును క్రియేట్ చేశారు. ఈ సమయంలో ఫిజిక్స్ టీచర్లు.. ఆరు, ఏడు క్లాసుల మ్యాథ్స్ తోపాటు 8,9,10 క్లాసులకు ఫిజిక్స్ బోధించాలని ఆదేశాలిచ్చారు. ఇదే బేసిక్ పై అప్పట్లో ప్రమోషన్లు ఇచ్చారు. ఆ తర్వాత ఫిజిక్స్ టీచర్లంతా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్కారు దృష్టికి తీసుకుపోయారు. ఈ క్రమంలో ఫిజిక్స్ టీచర్లు, మ్యాథ్స్ టీచర్ల మధ్య గొడవలు అయ్యాయి.

 దీంతో 2017లో ఆరో తరగతి ఫిజిక్స్ ను ఫిజిక్స్ టీచర్లు.. ఏడో తరగతి ఫిజిక్స్ ను మ్యాథ్స్ టీచర్లు  చెప్పాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. దీనిపై మ్యాథ్స్ టీచర్లు ఆందోళనలు కొనసాగిస్తూ వచ్చారు. మ్యాథ్స్ సబ్జెక్టు 80 మార్కులకు ఉంటుందని, ఫిజిక్స్ 40 మార్కులకే ఉంటుందని, తమపై బార్డెన్ పడుతుందని, క్లాసులు ఎక్కువగా ఉన్నాయని సర్కారుకు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంతో ఆరు, ఏడు క్లాసులకు మ్యాథ్స్ సబ్జెక్టును ఫిజిక్స్ టీచర్లే చెప్పాలని తాజాగా ఆదేశాలిచ్చారు. సింగిల్ టీచర్ ఉన్న దగ్గర ఒకే కానీ..  డబుల్ టీచర్లున్న దగ్గర ఎలా అనేదానిపై స్పష్టత లేదని టీచర్లు వాపోతున్నారు. 

కాగా..జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరంలో ఉదయం 9 గంటలకే ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను  తెరవాలని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశాలిచ్చారు. గత విద్యాసంవత్సరం మధ్యలోనే ఈ నిబంధనను ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని ఈ విద్యాసంవత్సరమూ అమలు చేయాలని ఉత్తర్వులిచ్చారు.