AUS vs SA: సౌతాఫ్రికా బ్యాటర్ అసాధారణ నిలకడ.. 38 ఏళ్ళలో తొలి ప్లేయర్‌గా రికార్డ్

AUS vs SA: సౌతాఫ్రికా బ్యాటర్ అసాధారణ నిలకడ.. 38 ఏళ్ళలో తొలి ప్లేయర్‌గా రికార్డ్

సౌతాఫ్రికా నయా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే వన్డేల్లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. అద్భుతమైన నిలకడ చూపిస్తూ సౌతాఫ్రికా క్రికెట్ కు కొత్త ఆశాకిరణంలా మారాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఈ 26 ఏళ్ళ బ్యాటర్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. శుక్రవారం (ఆగస్టు 22) ఆస్ట్రేలియాతో ప్రారంభమైన రెండో వన్దేలో 88 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రీట్జ్కేకు  ఈ సిరీస్ లో వరుసగా ఇది రెండో హాఫ్ సెంచరీ కాగా.. ఓవరాల్ గా ఇప్పటివరకు వన్డేల్లో ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ 50 కి పైగా పరుగులు చేశాడు. వరుసగా నాలుగు సార్లు 50 కి పైగా స్కోర్లు చేసి టీమిండియా మాజీ ఓపెనర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ 38 ఏళ్ల రికార్డ్ సమం చేశాడు. 

వన్డే చరిత్రలో ఆడిన తొలి నాలుగు మ్యాచ్ ల్లో 50కి పైగా స్కోర్లు చేసిన రెండో బ్యాటర్ గా మాథ్యూ బ్రీట్జ్కే నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సఫారీ బ్యాటర్ అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్ లో తొలి మ్యాచ్ లోనే అత్యధిక స్కోర్ చేసిన క్రికెటర్ గా నిలిచాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌పై జరిగిన మ్యాచ్ లో 83 పరుగులు చేసి రాణించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 57 పరుగులు చేయగా.. తాజాగా 88 పరుగులు చేసి తన తొలి నాలుగు వన్డేల్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశాడు. 

ఇప్పటివరకు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మాత్రమే తొలి నాలుగు వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేశాడు. సిద్ధు 1987 ప్రపంచ కప్ లో ఈ ఘనత సాధించాడు. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి నాలుగు ఇన్నింగ్స్‌లలో ఆస్ట్రేలియాపై 73, న్యూజిలాండ్‌పై 75, ఆస్ట్రేలియాపై 51, జింబాబ్వేపై 55 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా వెళ్తుంది. ప్రస్తుతం 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కే(88), స్టబ్స్ (66) హాఫ్ సెంచరీలు చేసి రాణించారు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది.