మయాంక్‌కు ఏమైంది!.. హాస్పిటల్​లో చేరిక.. తప్పిన ప్రమాదం

మయాంక్‌కు ఏమైంది!..   హాస్పిటల్​లో  చేరిక.. తప్పిన ప్రమాదం

అగర్తలా: టీమిండియా క్రికెటర్, కర్నాటక రంజీ టీమ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ ఫ్లైట్‌‌‌‌‌‌‌‌లో నీళ్లు అనుకొని విషపూరిత లిక్విడ్ తాగి  తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.  ప్రస్తుతం అగర్తలాలోని ఓ హాస్పిటల్‌ ఐసీయూలో ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నాడు. ఈ ఘటన దేశ క్రికెట్ వర్గాలను షాక్‌కు గురి చేసింది. అగర్తలాలో త్రిపుర, కర్నాటక  మధ్య  రంజీ మ్యాచ్ ముగిసిన తర్వాత  మయాంక్  మంగళవారం టీమ్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఢిల్లీ మీదుగా సూరత్‌కు బయలుదేరాడు. అగర్తలాలో ఇండిగో ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఎక్కిన మయాంక్‌‌‌‌‌‌‌‌ తన సీటు  ముందున్న ఓ పౌచ్‌ను చూశాడు. అందులో ఉన్నవి నీళ్లు అనుకొని కొంచెం తాగాడు. వెంటనే  నోరు, గొంతులో తీవ్రమైన మంటతో ఇబ్బంది పడ్డాడు.  

రెండు సార్లు వాంతి కూడా చేసుకున్న అతను కనీసం మాట్లాడలేకపోయాడు. అప్పటికి ఫ్లైట్‌‌‌‌‌‌‌‌ ఇంకా బయల్దేరలేదు. దాంతో మయాంక్‌‌‌‌‌‌‌‌ను ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ నుంచి నేరుగా అగర్తలాలోని ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ ఐసీయూలో చేర్చడంతో ప్రమాదం తప్పింది. నోటిలో మంట, పెదవులపై వాపుతో మయాంక్ ఇబ్బంది పడ్డాడని ఐఎల్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌   హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. అతనిప్పుడు బాగానే ఉన్నాడని వెల్లడించింది. క్రికెటర్‌‌కు అందుబాటులో ఉన్న అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని త్రిపుర హెల్త్ సెక్రటరీ తెలిపారు. బుధవారం అతను బెంగళూరు వెళ్తాడని చెప్పారు. 

కుట్ర కోణం ఉందా?

మయాంక్ పై కుట్ర జరిగిందనే అనుమానంతో కర్నాటక టీమ్ మేనేజర్‌‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడని వెస్ట్ త్రిపుర ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఇండిగో విమాన సంస్థ కూడా దర్యాప్తు చేస్తోంది. మయాంక్ సీటుపై ఆ పౌచ్‌ను ఎవరు ఉంచారు? అందులో ఎలాంటి రసాయనం ఉంది? అనేది తేలాల్సి ఉంది. మయాంక్‌పై ఎవరైనా కుట్ర చేశారా?  అన్న విషయంపైనా క్లారిటీ రావాలి.  కాగా, శుక్రవారం నుంచి రైల్వేస్‌తో జరిగే మ్యాచ్‌కు మయాంక్  దూరం అయ్యాడు.