అందుకే మోడీ భార్యనొదిలేశారు : మాయావతి

అందుకే మోడీ భార్యనొదిలేశారు : మాయావతి

లక్నో: లోక్​సభ ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకున్న వేళ ప్రధాన పార్టీ నేతల మధ్య వ్యక్తిగత దూషణల పర్వం హద్దులు దాటింది. స్వార్థ రాజకీయాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ తన భార్యను విడిచిపెట్టారని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ‘‘బీజేపీలో మహిళా నేతలు..తమ భర్తలను మోడీతో చూసి ఆందోళన చెందుతున్నారు. భార్యను విడిచిపెట్టిన మోడీ తమ కుటుంబాలను కూడా వేరు చేస్తారేమోనని అనుమానిస్తున్నారు. వాళ్లకు కూడా మోడీ అలాంటి సలహాలే ఇస్తారేమోనన్న దిగులు పట్టుకుంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘తన రాజకీయ స్వార్థం కోసం అమాయక భార్యను వదిలిపెట్టిన వ్యక్తి ఇతర మహిళలను గౌరవిస్తాడని ఎలా భావిస్తాం?’ అని ప్రశ్నించారు. అల్వార్ ఘటన తర్వాత కూడా రాజస్థాన్ లో కాంగ్రెస్ కు బీఎస్పీ మద్దతు ఎందుకు వాపస్ తీసుకోలేదని ఉత్తరప్రదేశ్​లోని ఆడబిడ్డలు ప్రశ్నిస్తున్నారన్న మోడీ కామెంట్లనుద్దేశించి మాయావతి ఫైర్ అయ్యారు. ‘ఇతరుల అక్కాచెల్లెళ్లు, బిడ్డల గౌరవం గురించి ఆయనకేం అర్థం అవుతుంది?’ అని ఆమె ప్రశ్నించారు. దళితులపై ప్రధాని కపట ప్రేమను నటిస్తూ డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని దుయ్యబట్టారు. అల్వార్ రేప్ ఘటన అంశాన్ని పనికిమాలిన రాజకీయాలకు వాడుకుంటున్నారని మాయావతి ఆరోపించారు.

పబ్లిక్ లైఫ్​కు అన్​ఫిట్: అరుణ్​జైట్లీ

మాయావతి కామెంట్స్ పై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.‘బెహన్‌‌‌‌ మాయావతి ప్రధానమంత్రి కావాలని అనుకుంటున్నారు. ఆమె పరిపాలన, నైతికత, వ్యాఖ్యలు దారుణంగా దిగజారాయి. నరేంద్ర మోడీపై వ్యక్తిగత దూషణలు చేసిన మాయావతి ప్రజాజీవితానికి అనర్హురాలు’ అని ట్వీట్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నవారు దేశానికి ప్రతిపాదించాల్సింది ఇదేనా! అని జైట్లీ ప్రశ్నించారు.