ఢిల్లీని చితకొట్టిన మేయర్స్.. లక్నో గ్రాండ్ విక్టరీ

ఢిల్లీని చితకొట్టిన మేయర్స్.. లక్నో గ్రాండ్ విక్టరీ

లక్నో: ఐపీఎల్​లో ఫస్ట్​ మ్యాచ్​లో కరీబియన్‌‌‌‌ క్రికెటర్‌‌ కైల్‌‌ మేయర్స్‌‌ (38 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 73).. లక్నో సూపర్​ జెయింట్స్​ తరఫున తొలి పోరులో ఇంగ్లండ్​ పేసర్​ మార్క్​ వుడ్​ (5/14) తమ మార్కు చూపెట్టారు.  మేయర్స్​ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించగా.. బౌలింగ్‌‌లో మార్క్‌‌ వుడ్‌‌ ఐదు వికెట్లతో మ్యాజిక్ చేశాడు. దాంతో,  ఐపీఎల్‌‌16వ సీజన్‌‌లో లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ సూపర్‌‌ విక్టరీతో శుభారంభం చేసింది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 50  రన్స్‌‌ తేడాతో    ఢిల్లీ క్యాపిటల్స్‌‌ను చిత్తు చేసింది. 

ఈ వన్‌‌సైడ్‌‌ పోరులో  తొలుత లక్నో సూపర్‌‌ జెయింట్స్‌‌ 20 ఓవర్లలో 193/6 స్కోరు చేసింది. మేయర్స్‌‌తో పాటు నికోలస్‌‌ పూరన్‌‌ (21 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) రాణించాడు. డీసీ బౌలర్లలో ఖలీల్‌‌ అహ్మద్‌‌, చేతన్‌‌ సకారియా చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌లో ఢిల్లీ  20 ఓవర్లలో 143/9 మాత్రమే  చేసి ఓడిపోయింది. కెప్టెన్‌‌  డేవిడ్‌‌ వార్నర్‌‌ (48 బాల్స్‌‌లో 7 ఫోర్లతో 56) ఒక్కడే పోరాడాడు. రవి బిష్ణోయ్‌‌, అవేశ్‌‌ ఖాన్‌‌ చెరో రెండు వికెట్లు తీశారు.  మార్క్‌‌ వుడ్‌‌కు ప్లేయర్ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌ అవార్డు దక్కింది. 

ఖతర్నాక్‌‌  కైల్‌‌

ఇద్దరు కరీబియన్ల ఖతర్నాక్ బ్యాటింగ్‌‌తో లక్నో భారీ స్కోరు చేసింది.మొదట  కైల్‌‌ మేయర్స్‌‌ దంచికొట్టగా..  చివర్లో నికోలస్‌‌ పూరన్‌‌ మెరుపులు మెరిపించాడు. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన లక్నో తొలుత నిదానంగా ఆడింది. పవర్‌‌ ప్లేలో 30 రన్స్‌‌ మాత్రమే చేసింది. కెప్టెన్‌‌ లోకేశ్‌‌ రాహుల్‌‌ (8)ను నాలుగో ఓవర్లో సకారియా పెవిలియన్‌‌ చేర్చాడు. సకారియా తర్వాతి ఓవర్లోనే కైల్‌‌ మేయర్స్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను ఖలీల్‌‌ అహ్మద్‌‌ అందుకోలేకపోయాడు. అప్పటికి మేయర్స్‌‌ 14 రన్స్‌‌ వద్ద ఉన్నాడు.  దీనికి ఢిల్లీ భారీ మూల్యమే చెల్లించుకుంది. 

ఈ లైఫ్‌‌ను సద్వినియోగం చేసుకున్న మేయర్స్..  దీపక్‌‌ హుడా (17) సపోర్ట్‌‌తో  పవర్‌‌ తర్వాత నుంచి పంజా విసిరాడు. ముకేశ్‌‌ వేసిన ఏడో ఓవర్లో రెండు భారీ సిక్సర్లు కొట్టిన అతను  స్పిన్నర్లు అక్షర్‌‌ పటేల్‌‌, కుల్దీప్‌‌ యాదవ్‌‌ బౌలింగ్‌‌లో మరింత రెచ్చిపోయి 28 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అక్షర్‌‌ వేసిన పదో ఓవర్లో రెండు సిక్సర్లు రాబట్టిన అతను  ఆ వెంటనే కుల్దీప్‌‌ బౌలింగ్‌‌లో ఎక్స్‌‌ట్రా కవర్‌‌ మీదుగా బాల్‌‌ను స్టాండ్స్‌‌కు పంపాడు. అదే ఓవర్లో హుడాను కుల్దీప్‌‌ ఔట్‌‌ చేశాడు. ఆపై,  మేయర్స్‌‌ను అక్షర్‌‌,  స్టోయినిస్‌‌ (12)ను ఖలీల్‌‌ అహ్మద్‌‌ వెనక్కు పంపడంతో ఢిల్లీ పుంజుకున్నట్టు కనిపించింది. కానీ, స్లాగ్‌‌ ఓవర్లలో నికోలస్‌‌ పూరన్‌‌ దాడి మొదలైంది. ఖలీల్‌‌ బౌలింగ్‌‌లో 4, 6తో జోరు చూపెట్టిన పూరన్‌‌.. సకారియా వేసిన 17వ ఓవర్లోనూ దాన్ని రిపీట్‌‌ చేశాడు. 

అదే ఓవర్లో క్రునాల్ పాండ్యా (15) లాంగాన్‌‌ మీదుగా  సిక్స్‌‌ రాబట్టడంతో 19 రన్స్‌‌ వచ్చాయి. 19వ ఓవర్లో ఖలీల్‌‌ ఆఫ్‌‌ స్టంప్‌‌కు దూరంగా వేసిన లెంగ్త్‌‌ బాల్‌‌ను మేయర్స్‌‌ ఎక్స్‌‌ట్రా కవర్‌‌ మీదుగా కొట్టిన సిక్స్‌‌ ఇన్నింగ్స్‌‌కే హైలైట్‌‌గా నిలిచింది. కానీ, మరో షాట్‌‌ ఆడే ప్రయత్నంలో అతను ఔటవగా.. చివరి ఓవర్లో ఆయుష్‌‌ బదోనీ (18) రెండు సిక్సర్లు.. లాస్ట్ బాల్‌‌కు ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌గా వచ్చిన క్రిష్ణప్ప గౌతమ్‌‌ సిక్స్‌‌ (6 నాటౌట్)తో ఇన్నింగ్స్‌‌కు సూపర్‌‌ ఫినిషింగ్‌‌ ఇచ్చాడు.

మార్క్‌‌ మ్యాజిక్‌‌.. ఢిల్లీ ఢమాల్‌‌

భారీ టార్గెట్‌‌ ఛేజింగ్‌‌ను మెరుపు వేగంతో ఆరంభించిన ఢిల్లీ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఓడింది. వార్నర్‌‌ ఒంటరి పోరాటం జట్టును గట్టెక్కించలేకపోయింది. స్టార్టింగ్‌‌లో వేగంగా ఆడిన వార్నర్‌‌.. ఓపెనర్‌‌ పృథ్వీ షా (12)తో కలిసి తొలి వికెట్‌‌కు 41 రన్స్‌‌ జోడించాడు. అయితే, ఐదో ఓవర్లో వరుసగా రెండు బుల్లెట్ల లాంటి బాల్స్‌‌తో పృథ్వీ, డేంజర్‌‌ మ్యాన్‌‌ మిచెల్‌‌ మార్ష్‌‌ (0)ను క్లీన్‌‌ బౌల్డ్‌‌ చేసిన మార్క్‌‌ వుడ్‌‌ ఢిల్లీని దెబ్బకొట్టాడు. తన తర్వాతి ఓవర్లో షార్ట్‌‌ బాల్‌‌తో  సర్ఫరాజ్‌‌ ఖాన్‌‌ (4)ను వెనక్కుపంపాడు. 

దాంతో48/3తో డీలా పడ్డ డీసీ కోలుకోలేకపోయింది. వార్నర్‌‌ కూడా  స్లో అయ్యాడు. రవి బిష్ణోయ్‌‌ వేసిన పదో ఓవర్లో రిలీ రొసో (20 బాల్స్‌‌లో 30) రెండు ఫోర్లు, సిక్స్‌‌తో ఇన్నింగ్స్‌‌లో చలనం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ, తన తర్వాతి ఓవర్లో అతడిని ఔట్‌‌ చేసిన బిష్ణోయ్‌‌ రివెంజ్‌‌ తీర్చుకున్నాడు.  మరో హార్డ్‌‌ హిట్టర్‌‌ రోవ్‌‌మన్‌‌ పావెల్‌‌ (1)ను ఎల్బీ చేశాడు. ఆ వెంటనే ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌ అమన్‌‌ హకీమ్‌‌ (4)తో పాటు  అవేశ్‌‌ వెనక్కు పంపడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. లాస్ట్​ ఓవర్లో అక్షర్‌‌ (16), సకారియా (4)ను ఔట్ చేసిన మార్క్‌‌ వుడ్‌‌ ఐదు వికెట్ల స్పెల్‌‌ ఖాతాలో వేసుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 193/6 (కైల్‌ మేయర్స్‌ 73, పూరన్‌ 36, ఖలీల్‌ 2/30).
ఢిల్లీ:  20 ఓవర్లలో 143/9   (వార్నర్‌ 56, రొసో 30, మార్క్‌ వుడ్‌ 5/14)'