
- నేడు ఆరు వేల మందికి ఏర్పాటు
- రూ.255 కోట్ల పరిహారం అందించాం
- జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు : ‘సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో పాలమూరు – రంగారెడ్డి స్కీమ్‌లోని ఉదండాపూర్ ముంపు బాధితులకు ఆదివారం సామూహిక భోజనాలు ఏర్పాటు చేశాం.. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే మూడు విడతల్లో బాధితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.255 కోట్ల చెల్లింపులు చేశాం. ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరు వేల మంది ముంపు బాధితులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం.. రాజకీయాలకు అతీతంగా ఈ భోజనాల్లో పాల్గొనాలి’ అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి సూచించారు.
పాలమూరు జిల్లా జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన ఉదండాపూర్‌కు చెందిన కొందరు రైతులు కోర్టుకు వెళ్లడం వల్ల అవార్డు పాస్ కాలేదన్నారు. వారు మంగళవారం కలెక్టర్‌ను కలిసి అభ్యంతరాలు తెలియజేయాలన్నారు. ప్రభుత్వం దానిని పరిశీలించి ఫైనల్ చేస్తుందని, ఆ తర్వాతే అవార్డ్ పాస్ అవుతుందని స్పష్టం చేశారు. డిసెంబరు 9 నాటికి పరిహారం పెంపుపై క్లారిటీ వస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని, ఏడాదిన్నరలోపు ఉదండాపూర్ రిజర్వాయర్పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.