వరద బాధితుల  తిండి పైసలు ఇయ్యలే!

వరద బాధితుల  తిండి పైసలు ఇయ్యలే!

వరద బాధితుల  తిండి పైసలు ఇయ్యలే!
రూ. 8.7 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్న సర్కారు
అప్పు చేసి వండిపెట్టిన వాళ్లంతా తహసీల్దార్లను నిలదీస్తున్నరు
భద్రాచలం డివిజన్​లో నాలుగు నెలలుగా బాధితుల గోస

భద్రాచలం, వెలుగు : వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో 20 రోజుల పాటు వారంతా భోజనాలు వండి పెట్టారు. బిల్లులు తర్వాత చెల్లిస్తామని అధికారులు భరోసా ఇవ్వడంతో అప్పు చేసి మరీ ప్రజల ఆకలి తీర్చారు. ఇందుకోసం రూ. 8.7 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. కానీ నాలుగు నెలలు కావస్తున్నా వారికి బిల్లులు మాత్రం అందలేదు. ట్రెజరీలో ఫండ్స్​జమ చేసినట్టే చేసి సర్కారు మళ్లీ వెనక్కు తీసుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జులై నెలలో వచ్చిన గోదావరి వరదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్​ను అతలాకుతలం చేశాయి.

భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాల్లోని 99 గ్రామాల్లో 16,044 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. వీరందరినీ ఆయా మండలాల్లోని పునరావాస కేంద్రాలకు తరలించి జులై 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భోజనాలు వండిపెట్టారు. అంతకు ముందు కొన్ని రోజులు స్థానిక హోటళ్లలో క్యాటరింగ్ ద్వారా తెచ్చిపెట్టారు. వంట మాస్టర్లు, టెంట్ హౌస్ ద్వారా గిన్నెలు ఇతరత్రా సరుకులు, హోటల్​అసోషియేషన్, క్యాటరింగ్​బాయ్స్, ట్రాన్స్​పోర్ట్.. ఇలా అన్నింటినీ స్థానికుల సాయంతో తహసీల్దార్లు జిల్లా కలెక్టర్​ ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజులపాటు నిర్వాసితులకు వండి పెట్టారు. ఏడు మండలాల్లో సుమారు రూ.8.7‌‌ కోట్ల వరకు ఖర్చయ్యింది.

భోజనానికి రూ.60, టిఫిన్​కు రూ.30 చొప్పున రోజుకు ఒక నిర్వాసితుడికి రూ.150 చెల్లిస్తామని సర్కారు పేర్కొంది. వీటికి సంబంధించిన బిల్లులు ఆయా తహసీల్దార్​ఆఫీసుల ద్వారా జిల్లా కలెక్టరేట్​కు వెళ్లాయి. ప్రభుత్వం నుంచి నిధులు కూడా వచ్చాయి. కానీ ట్రెజరీల వద్దకు బిల్లుల కోసం వెళ్తే ఫండ్స్ వెనక్కి వెళ్లాయని చెప్పారు. దీంతో నాలుగు నెలలుగా బిల్లుల కోసం పడిగాపులు కాస్తున్న వంటమాస్టర్లు, హోటల్​యజమానులు, టెంట్​షాపుల ఓనర్లలో ఆగ్రహం పెల్లుబికింది. తహసీల్దార్​ ఆఫీసులకు వెళ్లి తమ బిల్లులు తమకు కావాలంటూ నిలదీశారు. అక్కడా పనికాకపోవడంతో జిల్లా కలెక్టర్​అనుదీప్​ను కలిసి మొరపెట్టుకున్నారు. మా బిల్లులు మాకు ఇప్పించండంటూ వేడుకున్నారు. అక్కడా వారికి నిరాశే ఎదురైంది. దీంతో ఇప్పుడు జిల్లా మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ను ఆశ్రయించారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని, బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి డబ్బులు పెట్టామని లబోదిబోమంటున్నారు. 

వడ్డీ భారం పెరిగిపోతోంది

వరద బాధితుల ఆకలి తీర్చేందుకు అప్పు చేసి వంట చేసిపెట్టినం. ఖర్చుల కోసం బంగారం బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చినం. నాలుగు నెలల నుంచి మేమంతా అప్పులకు వడ్డీ కడుతున్నం. క్యాటరింగ్​బాయ్స్ కు, ట్రాన్స్ పోర్టు ఆటోలకు కొంత ఇచ్చినం. మిగిలిన డబ్బుల కోసం వారంతా మా ఇంటి చుట్టూ తిరుగుతున్నరు. ప్రభుత్వం వెంటనే బిల్లులు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలి. మా కష్టం ఆఫీసర్లకు తెలుసు. దయచేసి అప్పుల ఊబి నుంచి బయటపడేయండి.
-  రాంబాబు, వంట మాస్టర్​

బడ్జెట్​ రాలేదు
 

బడ్జెట్​ఇంకా రాలేదు. మేమైతే బిల్లులు మొత్తం ఇచ్చినం. ట్రెజరీకి బడ్జెట్​వస్తే వెంటనే బిల్లులు అవుతాయి. మేము కూడా బయట తెచ్చి పెట్టినం. కాస్త ఆలస్యమైనా బిల్లులు వచ్చేస్తాయి. బడ్జెట్ కోసం ఎదురుచూస్తున్నం. 
-  శ్రీనివాస్​యాదవ్, తహసీల్దారు, భద్రాచలం

కోతలు పెట్టి.. అవీ ఇస్తలేరు

వరద బాధితులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు పూటలా భోజనం, ఒక పూట టిఫిన్​తయారు చేయించేందుకు స్థానిక తహసీల్దార్లు నానా తిప్పలు పడ్డారు. ముందు మూడు రోజులు హోటళ్ల నుంచి తెప్పించి పునరావాస కేంద్రాల్లో భోజనం పెట్టారు. తర్వాత పునరావాస కేంద్రాల వద్దనే వంట వండి అందించారు. అందినచోటల్లా అప్పులు తెచ్చి పెట్టారు. వంట చేసి ఆటోల్లో పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి క్యాటరింగ్​బాయ్స్ ద్వారా పంపిణీ చేశారు. సన్న బియ్యంతో అన్నం, పప్పు, కూర, పచ్చడి, సాంబారు, పెరుగుతో రెండు పూటలా భోజనం, ఒక పూట టిఫిన్ అందించారు. భద్రాచలంలో సుమారు రూ.1.20 కోట్లు బిల్లు అయితే వాటిలో జిల్లా స్థాయిలో కోత పెట్టి రూ.80 లక్షలు మంజూరు చేశారు. బూర్గంపాడులో కూడా అంతే. అక్కడ రూ. కోటి రూపాయలకు బిల్లులు పరిమితం చేశారు. కానీ అయిన ఖర్చు ఎక్కువే. కోతలు విధించడమే కాకుండా నేటి వరకూ బిల్లులు ఇవ్వకపోవడంతో ఇప్పుడు వండిపెట్టిన వారంతా తహసీల్దార్లను నిలదీస్తున్నారు.