
మెదక్, వెలుగు: ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రేషన్ కార్డులను పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, భూభారతి, రెసిడెన్షియల్‌స్కూళ్లలో భోజన, మౌలిక వసతుల ఏర్పాటు, వన మహోత్సవంలో మొక్కలు నాటడడం, మహాలక్ష్మి పథకం తదితర అంశాలపై సమీక్ష చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవంలో వేగం పెంచి 15 రోజుల్లో పూర్తిస్థాయి లక్ష్యాన్ని సాధించాలన్నారు. టార్గెట్ పూర్తి అయిన దగ్గర జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. నేషనల్ హైవేస్ దగ్గర ప్లాంటేషన్ కార్యక్రమం పూర్తిచేయాలని, దేవాలయ భూముల్లో ప్లాంటేషన్ పై దృష్టి పెట్టాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా చేపట్టే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూళ్లను తరచూ సందర్శించాలన్నారు. జిల్లాలో ఫీవర్ కేసులపై ప్రత్యేక డాటా సిద్ధం చేసి అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ నగేశ్, డీఎఫ్ఓ జోజి, ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, డీఆర్డిఓ శ్రీనివాసరావు, డీఎంహెచ్ వో శ్రీరామ్, డీఈవో రాధాకిషన్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, మైనారిటీ సంక్షేమ అధికారి జమ్లా నాయక్, ఇంటర్మీడియట్ అధికారి మాధవి, జిల్లా పౌరసరఫరాధికారి నిత్యానంద్, హౌసింగ్ పీడీ మాణిక్యం పాల్గొన్నారు.
యూరియా లేదని ప్రచారం చేస్తే కఠిన చర్యలు
శివ్వంపేట: యూరియా కొరత ఉందని తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. శివ్వంపేట సొసైటీని తనిఖీ చేశారు. జిల్లాలో యూరియా కొరత ఎక్కడ కూడా లేదన్నారు. లేని కొరతను కృత్రిమంగా సృష్టించి తప్పుదోవ పట్టిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సొసైటీ రికార్డులు తనిఖీ చేసి యూరియా స్టాకు వివరాలు రికార్డులో కరెక్ట్ గా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రికల్చర్ ఏడీని రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. ఆయన వెంట అగ్రికల్చర్ ఏవో లావణ్య, సహకార సంఘం చైర్మన్ వెంకటరామ్ రెడ్డి, సీఈవో మధు ఉన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
నర్సాపూర్:సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీని పరిశీలించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. నీటి నిల్వ ఉన్న ప్రదేశాలను గుర్తించి దోమల లార్వాలను నిర్మూలించడానికి ఆయిల్స్ బాల్స్ వేయడం, ఫాగింగ్ నిర్వహించడం, ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త సేకరించడం చేయాలన్నారు. ఈ పర్యటనలో వ్యవసాయ సహకార సంఘం సీఈఓ మధు, మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.