
నారాయణ ఖేడ్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. శనివారం నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్ కొత్త మండలాన్ని, రూ.కోటీ 56 లక్షలతో నిర్మించనున్న 30 బెడ్ల హాస్పిటల్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్ల కరోనా కష్ట కాలంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేనన్నారు. గత పాలకుల హయాంలో నారాయణఖేడ్ వెనకబడేశారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోందని తెలిపారు. జన్ ధన్ ఖాతాలలో ధన్ ధన్ మని డబ్బులేస్తానని చెప్పి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీవి పనికిమాలిన రాజకీయాలని అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సింగూరు ప్రాజెక్టు లోని నీళ్లను హైదరాబాద్ కు తీసుకెళ్లకుండా నియోజకవర్గానికే కేటాయించినట్టు తెలిపారు. ఖేడ్ నియోజకవర్గంలో ఐదు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని, దాంతో స్టూడెంట్స్ కు కార్పొరేట్ తరహా విద్య అందుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ జగదీశ్వరాచారి, అడిషనల్ కలెక్టర్ రాజర్జి షా, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో మదన్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.
అసైన్డ్ భూములను అభివృద్ధి చేస్తాం : సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట రూరల్, వెలుగు : జిల్లాలోని అసైన్డ్ భూములు ఉన్న రైతులను అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ ఆఫీస్ లో సిద్దిపేట సుడా, గజ్వేల్ మున్సిపాలిటీలు పరిధిలో చేపట్టబోతున్న మోడ్రన్ లే అవుట్ భూసేకరణపై అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడ్రన్ లే అవుట్ డెవలప్మెంట్ కోసం మున్సిపల్ పరిధిలోని గవర్నమెంట్, అసైన్డ్, సీలింగ్, భూదాన్ లాంటి భూములను సేకరించాలన్నారు. మోడ్రన్ లే అవుట్ కోసం అసైన్డ్ భూమి ఇస్తే ఆ రైతుకు ఎకరానికి 600 గజాలు డెవలప్ చేసిన ప్లాట్ ఇస్తామన్నారు. అసైన్డ్ భూములలో అమ్మాడానికి, కొనడానికి ఉండదు కానీ, ఈ డెవలప్ చేసిన ప్లాట్‌పై వారికి సర్వ హక్కులు ఉంటాయని చెప్పారు. దీనిపై ఉత్సాహం ఉన్న రైతులు ఆయా ప్రాంతాల అధికారులను కలవాలని సూచించారు. ఈ అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని జిల్లా అభివృద్ధిలో భాగస్వాముల కావాలని పిలుపునిచ్చారు.
శ్రీకాంత్ చారికి ఘన నివాళి
తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని శనివారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల నిర్వహించారు. ఆయన ఫొటోలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాన్ని కొనియాడారు. శ్రీకాంత్‌చారి విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. - వెలుగు, నెట్వర్క్
స్వర్ణకారులను పోలీసులు వేధించొద్దు
మెదక్ టౌన్/నారాయణఖేడ్, వెలుగు : స్వర్ణకారులను పోలీసులు వేధించొద్దని కోరుతూ పలువురు స్వర్ణకారులు మెదక్కలెక్టరేట్ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ టౌన్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రమేశ్‌చారి, ప్రధాన కార్యదర్శి చెన్నోజు కృష్ణకుమార్, కోశాధికారి మామిడి ప్రభాకర్ మాట్లాడారు. కార్పొరేట్ షాపులు నగరాలు, జిల్లాలు, మండలాలకు రావడంతో తాము వృత్తిని కోల్పోయి అప్పుల బాధతో ఉన్నామని, ఈ పరిస్థితిలో పలువురి స్వర్ణకారులను దొంగ బంగారం కేసులతో పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్వర్ణకారులకు సబ్సిడీ రుణాలు, విశ్వకర్మబంధు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవో యూనస్‌కు వినతిపత్రం అందజేశారు. నారాయణఖేడ్‌లో స్వర్ణకారులు దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ఆర్డీవో కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు.