ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • నేషనల్​ హైవే మీద బీజేపీ నాయకుల రాస్తారోకో

మెదక్​ (కౌడిపల్లి), వెలుగు: సీఎం కేసీఆర్ ​ఫామ్ హౌస్ చుట్టే రోడ్లు వేసుకుంటున్నారని,  గ్రామీణ ప్రాంతాల రోడ్లను పట్టించుకోవడం లేదని, ప్రజల ఇబ్బందులు ప్రభుత్వానికి పట్టవా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. అధ్వానంగా మారిన రోడ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కౌడిపల్లి మండలం తిమ్మాపూర్ గేట్​ వద్ద నేషనల్​ హైవే మీద బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సదర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ మాట్లాడుతూ నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి తాను సీఎం కేసీఆర్​కు సన్నిహితుడినని గొప్పలు చెప్పుకోవడం తప్ప  నర్సాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరగడంలేదన్నారు. తిమ్మాపూర్ నుంచి రాజిపేట వరకు ఆరు కిలోమీటర్లు రోడ్డు అధ్వానంగా మారినా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.  15 ఏండ్లుగా ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉందని, పలుమార్లు ఎమ్మెల్యే మదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లితే నిధులు మంజూరయ్యాయని చెబుతున్నారు తప్ప రోడ్డు వేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు డిమాండ్​ చేస్తుండం వల్లే కాంట్రాక్టర్లు ముందుకు రావడంలేదని ఆరోపించారు. వెంటనే రోడ్డు వేయకుంటే బీజేపీ  ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు రాజేందర్, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్ గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు గోడ రాజేందర్, మండల అధ్యక్షుడు రాకేశ్ ​పాల్గొన్నారు.

రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగింది

మెదక్​ టౌన్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ కృషితో  మత్స్య సంపద పెరిగిందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ మండలం రాయిన్​పల్లి ప్రాజెక్టులో 2.90 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారిణి డాక్టర్​ రజనితో కలిసి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో మత్స్య సంపద అంటే ఆంధ్ర పేరే వినిపించేదని,  ప్రస్తుతం తెలంగాణ మత్స్య సంపదకు నిలయంగా మారిందన్నారు. భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసుకొని చెరువులు, చెక్​డ్యామ్​లలో కూడా చేప పిల్లలను పెంచుతామన్నారు.  కార్యక్రమంలో మెదక్​  జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ లావణ్య రెడ్డి,  మెదక్​ ఎంపీపీ యమున, మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్,  మండల రైతుబంధు ప్రెసిడెంట్​ కిష్టయ్య, పీఏసీఎస్​చైర్మన్ హన్మంతరెడ్డి ఉన్నారు. 

బీటీ రోడ్లకు రూ.79 కోట్లు మంజూరు

మెదక్ (కౌడిపల్లి, కొల్చారం), వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గంలో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.79 కోట్లు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే మదన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కౌడిపల్లి మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండాల రోడ్లన్నీ రిపేర్లు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గుంజరి ప్రవీణ్ పాల్గొన్నారు. 

కొల్చారంలో.. 

కొల్చారం మండలంలోని కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులు అందజేశారు. అనంతరం కొల్చారంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మంజుల, జడ్పీటీసీ మేఘమాల, కొల్చారం సర్పంచ్​ రాజాగౌడ్​ పాల్గొన్నారు.

మెదక్ స్టేడియానికి ఇందిరా గాంధీ పేరెలా పెట్టారు? బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్

మెదక్​, వెలుగు: మెదక్​ స్పోర్ట్స్​ స్టేడియానికి ఇందిరా గాంధీ పేరు పెట్టడంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్​ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. స్టేడియంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్​ ట్రాక్​ నిర్మాణం చేపట్టగా ట్రాక్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై ‘ఇందిరా గాంధీ స్టేడియం’ అని పేరు పెట్టడం, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల పేర్లు పెట్టకపోవడం దారుణమన్నారు. స్టేడియానికి ఇందిరాగాంధీ పేరు ఎలా పెట్టారని ఆర్​టీఐ కింద పంచాయతీరాజ్​ డిపార్ట్​మెంట్​కు, జిల్లా యువజన, క్రీడల శాఖలో దరఖాస్తు చేస్తే వారు తమకు సంబంధం లేదంటున్నారని తెలిపారు.  స్టేడియం నిర్మాణానికి కృషి చేసిన దివంగత మంత్రి కరణం రామచందర్​ రావు పేరు లేదా క్రీడలకు స్ఫూర్తి అయినా మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. ఆయన వెంట బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్​, టౌన్​ ప్రెసిడెంట్​ ప్రసాద్​, నాయకుడు ఎంఎల్ఎన్​ రెడ్డి ఉన్నారు. 

అధికారుల నిర్లక్ష్యంతో పనులైతలేవు : శివ్వంపేట ఎంపీపీ ఆగ్రహం

మెదక్ (శివ్వంపేట), వెలుగు: మన ఊరు మన బడి పథకం కింద శివ్వంపేట మండలంలోని 26 స్కూళ్లకు రూ.7.80 కోట్లు మంజూరు కాగా ఆఫీసర్ల నిర్లక్ష్యంతో పనులు కావడం లేదని ఎంపీపీ హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ ఆఫీస్​లో మంగళవారం ఆయన అధ్యక్షతన మన ఊరు మన బడి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఇరిగేషన్ ఏఈ పాఠశాలల్లో పనులు పరిశీలించడం లేదని, బిల్స్ రికార్డ్ చేయడం లేదని, పనితీరు మార్చుకోకుంటే ఈ మండలంలో పనిచేయాల్సిన అవసరం లేదని చెప్పారు.  సీఎం అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే ఆఫీసర్లు జరిగిన పనులకు ఎంబీ రికార్డు చేయకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పీఆర్​ ఏఈ భాస్కర్ మాట్లాడుతూ దొంతి హైస్కూల్ కు రూ.45 లక్షలు,  శివ్వంపేట హైస్కూల్​కు రూ.43 లక్షలు, గోమారం హైస్కూల్ రూ.56 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. అయితే నాలుగు సార్లు టెండర్ వేసిన కాంట్రాక్టర్స్ ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. సర్పంచులు  మన ఊరు - మనబడి పనులు చేసేందుకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లకు సహకరించాలన్నారు. సమావేశంలో జడ్పీ కో ఆప్షన్ మెంబర్​ మన్సూర్, ఎంపీడీఓ నవీన్​ కుమార్, ఎంఈఓ బుచ్యా నాయక్​, డీఈ బుచ్చిబాబు, సర్పంచులు శ్రీనివాస్ గౌడ్, రవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

భెల్ డిపోను తరలిస్తే ఊరుకోబోం.. 

రామచంద్రాపురం, వెలుగు : రామచంద్రాపురం మండలంలలోని భెల్​ డిపోను తరలిస్తే ఊరుకోబోమని బీజేపీ మహిళా మోర్చా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం బీజేపీ  ఆధ్వర్యంలో భెల్​ డిపో ఎదుట ధర్నా చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భెల్ పరిశ్రమ సౌజన్యంతో ఎనిమిది ఎకరాల స్థలాన్ని కేటాయించి 1988 ఆర్టీసీ డిపో ప్రారంభించారన్నారు. మూడెకరాలలో గ్యారేజీ తదితర అవసరాల కోసం వినియోగిస్తుండగా, ఇంకా ఐదెకరాలు ఖాళీగానే ఉందన్నారు. ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకుని డిపోను అభివృద్ధి చేయాల్సింది పోయి ఏకంగా ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. జంటనగరాలలోని అన్ని డిపోలకంటే  భెల్ డిపోనే  అగ్రగామిగా  ఉందని, రోజూ రూ.16 లక్షలు ఆదాయం వస్తుందని తెలిపారు. ఏదేమైనా డిపోను  తరలిస్తే  సహించేదిలేదని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు అంజిరెడ్డి, గిద్దె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధురి, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, గుమ్మడిదల మండల అధ్యక్షుడు యాదగిరి, జిన్నారం మండల అధ్యక్షుడు శ్రీకాంత్ గౌడ్, భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు మన్నె శ్రీకాంత్,  భారతీనగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు శిరీష, భారతీనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు నందారెడ్డి, అమీన్​పూర్ మండల అధ్యక్షుడు ఆగారెడ్డి పాల్గొన్నారు.