ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి 

జగదేవపూర్(కొమురవెల్లి), వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దోపిడీకి గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి అన్నారు. శనివారం జగదేవపూర్ లో 91 మంది లబ్ధిదారులకు ఆయన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పేద ప్రజల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్, ఎంపీపీ బాలేశం గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రాచర్ల నరేశ్, గజ్వేల్ ఏఎంసీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఉన్నారు.  

రఘునందన్​పై ఎంపీ వ్యాఖ్యాలు తగవు 

సిద్దిపేట, వెలుగు :  దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి  తన సొంత గ్రామంలోనే మెజార్టీ తెచ్చుకోలేదన్న విషయాన్ని మరచిపోయి ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అవాకులు.. చవాకులు మాట్లాడటం తగదని బీజేపీ సిద్దిపేట నాయకుడు కొత్తపల్లి వేణుగోపాల్ అన్నారు. శనివారం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులనే గుర్తు పట్టని ఎంపీ స్థానిక ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు కొత్త ప్రభాకర్​రెడ్డికి సరైన 
బుద్ధిచెబుతారన్నారు. 

పెళ్లైన వారికీ ప్యాకేజీ ఇవ్వాలి..మంత్రికి ‘గౌరవెల్లి’ నిర్వాసితుల వినతి

కోహెడ (హుస్నాబాద్), వెలుగు : పెళ్లైన యువతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని గౌరవెల్లి నిర్వాసితులు కోరారు. ఈ మేరకు బాధితులు శనివారం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డితో హైదరాబాద్ వెళ్లి మంత్రి హరీశ్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు పునరావాస ప్యాకేజీ కోసం ఇంటింటా సర్వే చేసి 324 మందితో జాబితాను ప్రకటించినట్లుతెలిపారు. ఇందులో 100 మంది పేర్లు పెళ్లైన వారు అని తొలగించడంతో వారు నష్టపోతున్నారని, వారికి కూడా ప్యాకేజీ ఇవ్వాలన్నారు.  అలాగే ప్రాజెక్టు ముంపు బాధితులు 1500 మంది ఉన్నారని, అందరికీ డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఒకేసారి ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే రఘునందన్​రావు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. శనివారం రాయపోల్​ మండల కేంద్రంతోపాటు గొల్లపల్లి, ఉదయ్​పూర్, కొత్తపల్లి, రాంసాగర్, వీరా నగర్, తిమ్మక్​పల్లి, అనాజీపూర్​ గ్రామాల్లో ఏర్పాటు చేసిన హైమాస్ట్​ లైట్లను ఆయన ప్రారంభించారు. రాంసాగర్​ గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్​ లైట్​ను దివ్యాంగురాలు ఎల్లమ్మ చేతుల మీదుగా, వీరానగర్​ గ్రామంలోని హైమాస్ట్​ లైట్లను పారిశుద్ధ్య కార్మికుల చేత ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. అనంతరం పలువురి బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మాదాస్​ వెంకట్​గౌడ్, కొండి స్వామి, నాయకులు రవీందర్​రెడ్డి, తిరుపతిరెడ్డి, భాస్కర్​రెడ్డి, మధురెడ్డి, వెంకట్​ గౌడ్, దయాకర్​రెడ్డి, కొత్తింట్ల సత్యం, నర్సింలు, కృష్ణ పాల్గొన్నారు.