
మేం చెట్లు నరకలే.. కేసులెట్ల పెడ్తరు? గ్రామసభలో అధికారుల
తీరుపై రైతుల ఆగ్రహం
మెదక్ (శివ్వంపేట), వెలుగు: ‘చెట్లు మేం నరకలేదు. ఆ సమయంలో మేం హాస్పిటల్లో ఉంటే మాపై కేసులు పెట్టడం సరికాదు’ అని గ్రామ సభలో అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. శివ్వంపేట మండలం భీమ్లా తండాలో మంగళవారం పోడు భూముల గ్రామసభ నిర్వహించారు. ఫారెస్ట్ ఆఫీసర్లు తాము చెట్లు నరకకున్నా నరికినట్టుగా 46 మంది మీద కేసులు పెట్టడం తగదన్నారు. కొంతమంది ఆసుపత్రిలో ఉన్న వారి పైన కూడా కేసులు పెట్టారని, ఇది అన్యాయమని వాపోయారు. చాలా కాలంగా భూములు సాగు చేసుకుంటున్న 51 మంది రైతులు దరఖాస్తు పెట్టుకోగా, లిస్ట్‌లో 30 మంది పేర్లే వచ్చాయని తెలిపారు. దీనిపై ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవికుమార్ మాట్లాడుతూ సర్వే నిర్వహించగా 30 మంది కాస్తులో ఉన్నట్టు తేలిందని, అందుకే మిగతావారి దరఖాస్తులు రిజెక్ట్ చేశామని చెప్పారు.
‘పోడు’ లిస్ట్‌లో పేరు లేదని ట్యాంక్ ఎక్కి నిరసన
పోడు భూముల సర్వే జాబితాలో తన పేరు లేకపోవడంతో ఓ రైతు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడ్ లో మంగళవారం జరిగింది. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ మంజుల సత్యనారాయణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. అధికారులు అర్హులైన రైతుల పేర్లు చదివి వినిపించారు. కాగా గ్రామానికి చెందిన దేవదాసు అనే రైతు తాను చాలా ఏళ్లుగా పోడు భూమి సాగు చేసుకుంటున్నా అర్హులైన రైతుల జాబితాలో తన పేరు లేదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఆఫీసర్ల తీరును నిరసిస్తూ వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలిపాడు. ఎస్సై శ్రీనివాస్ గౌడ్ దేవదాసుకు నచ్చజెప్పి కిందకి దించారు.
ఏడాదిలోగా కేవీ బిల్డింగ్ నిర్మించాలి
సిద్దిపేట, వెలుగు : కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కా ప్రణాళికతో నిర్మించాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. ఎన్సాన్ పల్లి వద్ద నిర్మించే కేంద్రీయ విద్యాలయం భవన స్థలాన్ని అధికారులతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. విద్యాలయం పక్కన కరెంట్ జంక్షన్ తీగలు ఉండటం వల్ల ఇబ్బంది కలుగుతుందని, వాటిని క్యాంపస్ ఆవరణ బయటి నుంచి వెళ్లేలా మార్చాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. ఏడాదిలోపు పనులు పుర్తి చేసేలా చూడాలన్నారు. ఆయన వెంట విద్యుత్ శాఖ ఎస్ఈ ప్రభాకర్, సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ విద్యాసాగర్ ఉన్నారు.
ఘనంగా అయ్యప్ప పడిపూజ
సదాశివపేట, వెలుగు : యువత భక్తి భావంతో నడుచుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ అన్నారు. మంగళవారం సదాశివపేట పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో జరిగిన అయప్ప పడి పూజకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 40 రోజుల దీక్షలో స్వాములు నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
హరితహారాన్ని దేశమంతా అమలు చేయాలి
జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యులు
సిద్దిపేట రూరల్, వెలుగు : తెలంగాణలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయాలని జమ్మూ కశ్మీర్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్ సభ్యులు అన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో రెండంచెల ప్రభుత్వ పరిపాలన విధానం మూడంచెలుగా మారడంతో ఆ రాష్ట్ర డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, బ్లాక్ డెవలప్మెంట్ చైర్మన్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఫ్లీల్డ్ విజిట్ కోసం మంగళవారం సిద్దిపేట రూరల్ మండలం పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతు వేదిక, డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, ప్రభుత్వ పాఠశాల, పల్లె ప్రకృతివనం సందర్శించారు. బృందం సభ్యులకు ఎంపీపీ శ్రీదేవి చందర్రావు, సర్పంచ్ రమేశ్ నిర్వహణ విధానాలను వివరించారు. అనంతరం బృంద సభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు తమకెంతో స్పూర్తిని కలిగించాయన్నారు. వారి వెంట నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ రాజేశ్వర్, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఉపసర్పంచ్ పుల్లూరు కనకరాజు, పంచాయతీ సెక్రటరీ యాదగిరి, పడిగె వెంకటేశ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈడీ, మోడీకి భయపడేదే లేదుఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
మునిపల్లి, వెలుగు : టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ రైడ్స్ చేస్తోందని, అలాంటి ఈడీ, మోడీలకు భయపడేది లేదని అందోల్ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పోల్కంపల్లి గ్రామ శివారులో శ్రీ సాయి గార్డెన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దళాన్ని పంపి మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ గెలువలేకపోయిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పీఏపై ఈడీ, ఐటీ దాడులు, మంత్రి మల్లారెడ్డి ఇంటిపై రైడ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలన సజావుగా సాగుతోందని, అలాంటి ప్రభుత్వంపై బీజేపీ లీడర్లు ఆరోపణలు చేస్తే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. పార్టీలకతీతంగా పల్లెలను అభివృద్ధి చేస్తుంటే దామోదర రాజనర్సింహ ప్రగల్బాలు పలకడం ఎంత వరకు సమంజసమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణాలకు రూ.100కోట్లు మంజూరయ్యాయని, త్వరలో మరిన్ని నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. అంతకుముందు మండల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులతో అభివృద్ధిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట టీఆర్ఎస్ రాష్ర్ట నాయకుడు పైతర సాయికుమార్, మండల అధ్యక్షుడు వార్నా సతీశ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి మంతూరి శశికుమార్, వైస్ ఎంపీపీ ఖమ్రోద్దీన్, సీనియర్ నాయకులు నారాయణ, రాంచందర్ రావు, చంద్రయ్య ఉన్నారు. పాండురంగ ఆలయంలో పూజలు మునిపల్లి మండలం అంతారం గ్రామంలో జీవన్ముక్త పాండురంగ విఠలేశ్వర ఆలయ జాతరోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్య్రమంలో ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అన్ని వర్గాల అభివృద్ధికి కృషి
కంది, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి తహసీల్దార్ ఆఫీసులో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం కంది మండల పరిధిలోని చిహ్నాపూర్ గ్రామ చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు దేశానికే మార్గదర్శకమన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొండల్ రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, కంది ఎంపీపీ సరళ, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కులవృత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం
కొండాపూర్, వెలుగు : కులవృత్తులను ప్రోత్సాహమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని మల్కాపూర్ సర్పంచ్ భాగ్యవతి అన్నారు. మంగళవారం మల్కాపూర్ పెద్ద చెరువులో జడ్పీటీసీ పద్మావతి పాండురంగతో కలిసి ఆమె చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులవృత్తులపై ఆధారపడిన ముదిరాజ్, బెస్త, మంగలి, చాకలి, గౌడ, చేనేత లాంటి అనేక కులాలకు 100 శాతం సబ్సిడీ అందించి వారి జీవనోపాధి కల్పించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ జేడీఏ, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ రమేశ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, మత్స్యకారులు, రైతులు పాల్గొన్నారు.
నిరంతర ప్రక్రియగా ‘కంటి వెలుగు’మంత్రి హరీశ్‌రావు
సిద్ధిపేట, వెలుగు : పేద ప్రజలకు ఆర్థిక భారం కాకుండా కంటి చూపు అందించాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్ ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మంగళవారం మంత్రి క్యాంపు ఆఫీస్‌లో నిర్వహించిన ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వృద్ధులు చాలా మంది కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నారని, వారికి మెరుగైన వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటి వరకు ఉచిత శిబిరాల్లో 3250 మందిని గుర్తించి, వారిలో 1300 మందికి కంటి ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కాశీనాథ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నేషనల్ హైవే వర్క్స్ స్పీడ్ చేయాలి
సిద్దిపేట జిల్లాలో నేషనల్ హైవే పనులు స్పీడ్ గా చేయాలని అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఎల్కతుర్తి- నుంచి మెదక్, జనగామ- నుంచి సిరిసిల్లా నేషనల్ హైవే పనులపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి ఆయన సమీక్షించారు. నేషనల్ హైవే నిర్మాణం కోసం అటవీశాఖ అభ్యంతరాలు వారం రోజుల్లో క్లియర్ చేయాలని ఆ శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. 12 చోట్ల ఇరిగేషన్ కాల్వల క్రాసింగ్స్ వస్తున్నందున అన్ని శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీటి పైపులైన్లు కొత్తగా నిర్మించిన తర్వాతనే పాతవి తొలగించాలని చెప్పారు. చేర్యాల, దుద్దేడ మధ్య రోడ్డు పూర్తిగా పాడైనందున అక్కడ పనులు వేగంగా జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు ముజామ్మిల్‌ఖాన్, శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ హైవే అథారిటీ డీఈ మోహన్, ఆర్డీఓలు అనంతరెడ్డి, విజయేందర్ రెడ్డి, ఆర్అండ్ బీ అధికారులు పాల్గొన్నారు.
వన్ టైమ్ సెటిల్మెంట్ ను సద్వినియోగం చేసుకోవాలి
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని బకాయిలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులు వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. మంగళ వారం కలెక్టరేట్లో అధికారులు, బ్యాంకర్ల తో సమావేశమై వన్ టైమ్ సెటిల్మెంట్ అంశంపై చ ర్చించారు. జిల్లా వ్యాప్తంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఏపీజీవీబీ, టీజీబీ బ్యాంకులలో వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఉందని తెలిపారు. ఈ స్కీమ్ గురించి అవగాహన కల్పించాలని, ఇందు కోసం బ్యాంకర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని సూచించారు.
కార్తీక దీపోత్సవ వేడుకల్లో గోదావరి అంజిరెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: కార్తీక మాసపు చివరి సోమవారం రాత్రి నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో బీజేపీ రాష్ట్ర మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భారతీనగర్ విజన్ పరిధిలోని ఓల్డ్ ఎంఐజీ కాలనీ రామాలయంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ధరణి మహిళా సంఘం ప్రెసిడెంట్ రజిని, జనరల్ సెక్రటరీ ఉమావతి, లక్ష్మి, రేణుక, రత్నకుమారి, ఉమాదేవి, అన్నపూర్ణ, రాణి, సాయి సుధ, దివ్య వేణి ఆమెతోపాటు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
హుస్నాబాద్‌లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని దీక్షలు
కోహెడ(హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్‌లో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసులపై కక్షిదారులు 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న జిల్లా కోర్టుకు వెళ్తున్నారని తెలిపారు. దూర భారం లేకుండా పేద ప్రజలకు వెంటనే న్యాయం అందడానికి హుస్నాబాద్‌లో సబ్ కోర్టు ఏర్పాటుచేయాలన్నారు. ప్రస్తుతం జూనియర్ సివిల్‌జడ్జీ కోర్టులో 400 కేసులకు పైగా ఉన్నాయని చెప్పారు.200 కేసులకు పైగా ఉన్న వేములవాడకు సబ్ కోర్టు ఇచ్చారని, అన్ని అర్హతలు ఉన్న హుస్నాబాద్‌కు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. వెంటనే హుస్నాబాద్‌కు సబ్ కోర్డు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేవైసీ చేసుకుంటేనే ‘పీఎం కిసాన్’
మెదక్ జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: కేవైసీ చేసుకున్న రైతులకే పీఎం కిసాన్ స్కీం కింద డబ్బులు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి తెలిపారు. కౌడిపల్లి మండలంలో మూడు వేల మందికి పీఎం కిసాన్ డబ్బులు రావడం లేదు. అత్యధికంగా భుజరంపేట గ్రామానికి చెందిన 400 మందికి రావడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం భుజరంపేటలో రైతులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని ఆశాకుమారి రైతులకు వివరించారు. పట్టాదార్ పాస్ బుక్, బ్యాంకు అకౌంట్, ఆధార్ లింక్ అయి ఉండాలని, లేదంటే డబ్బులు అకౌంట్లో జమ కావని చెప్పారు. అనంతరం ఆమె ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆన్ లైన్ లో ఎదురవుతున్న సమస్యల గురించి సెంటర్ నిర్వహకులకు, రైతులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఏడీఏ పద్మ, ఎన్ఐసీ జిల్లా కోఆర్డినేటర్ రాజు, ఏఓ స్వప్న ఉన్నారు.