రయ్యిన పోవచ్చిగ.. మెదక్- సిద్దిపేట హైవే పనులు ప్రారంభం

రయ్యిన పోవచ్చిగ.. మెదక్- సిద్దిపేట హైవే పనులు ప్రారంభం
  •     రూ.882 కోట్లు... 69 కిలో మీటర్లు
  •     8 మేజర్ జంక్షన్లు.. 34 మైనర్ జంక్షన్లు ఏర్పాటు
  •     ఇది పూర్తయితే పుణ్య క్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకువెళ్లడం ఈజీ

మెదక్, వెలుగు: జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణానికి హైవేల అనుసంధానం పెరుగుతోంది. ఇక్కడి నుంచి  సిద్దిపేట వరకు కొత్తగా మంజూరైన 765/డీజీ నేషనల్ హైవే  నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభం అయ్యాయి.   మేజర్‌‌‌‌ ప్రాంతాల్లో నాలుగు లేన్లుగా, మిగతా చోట్ల టూ లేన్‌‌గా చేపడుతున్న ఈ రోడ్డు పూర్తయితే రెండు జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవనుంది.  అంతేగాక ఉమ్మడి కరీంనగర్​, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు వెళ్లి రావడం ఈజీ కానుంది. పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామని ఎన్‌‌హెచ్‌‌ఏ అధికారులు చెబుతున్నారు. 

రూ.882 కోట్లతో..

రద్దీ ఎక్కువగా ఉన్న రూట్లో రవాణా సౌకర్యాలు మెరుగు పరచేందుకు ప్రాధాన్యం ఇస్తోన్న కేంద్ర ప్రభుత్వం మెదక్ నుంచి సిద్దిపేట వరకు ప్రస్తుతం ఉన్న స్టేట్​ హైవేను నేషనల్​హైవేగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 69.97 కిలోమీటర్ల మేర హైవే నిర్మాణానికి గాను రూ.882 కోట్లు మంజూరు చేసింది.  మెదక్ జిల్లా పరిధిలో 33.676 కిలో మీటర్లు,  సిద్దిపేట జిల్లా పరిధిలో 36.302 కిలో మీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం జరుగనుంది. ​ నిధులు మంజూరు కావడంతో నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్​ హెచ్ఏఐ) సర్వే పూర్తి చేసి ఆర్అండ్​బీ పరిధి నుంచి రోడ్డును స్వాధీనం చేసుకుంది.  ఆ తర్వాత టెండర్ ప్రాసెస్​ పూర్తికాగా కాంట్రాక్ట్​ దక్కించుకున్న లక్ష్మీ  కన్‌‌స్ట్రక్షన్‌‌ ​సంస్థ ఇటీవల పనులు మొదలు పెట్టింది.  మెదక్ పట్టణ పరిధిలో నుంచి రోడ్డు విస్తరణ, బ్రిడ్జీల నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. హవేలి ఘనపూర్​, రామాయంపేట మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగిస్తున్నారు.  

పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట ఫోర్‌‌‌‌ లేన్

69.97 కిలోమీటర్ల హైవేలో భాగంగా మెదక్​ మున్సిపాలిటీతో పాటు మండలంలోని పాతూర్, రామాయంపేట మండలం అక్కన్నపేట, రామాయంపేట మండలం కోనాపూర్​, నిజాంపేట మండలంలోని నందిగామ, నిజాంపేట వద్ద, సిద్దిపేట జిల్లా పరిధిలోని దుబ్బాక మండలం పోతిరెడ్డిపేట, అక్బర్​ పేట, చిట్టాపూర్​, హబ్సీపూర్, ధర్మారం, తిమ్మాపూర్​, సిద్దిపేట మండలం ఇర్కోడు, బూర్గుపల్లి గ్రామాల వద్ద ఫోర్​ లేన్‌‌ రోడ్డు నిర్మించనున్నారు.  ఇరువైపులా సైడ్​ డ్రైన్స్​, ఫుట్​పాత్​, మధ్యలో డివైడర్, బటర్​ఫ్లై లైట్లు ఏర్పాటు చేయనున్నారు. మిగతా ప్రాంతాల్లో  రెండు వరుసల రహదారినిర్మించనున్నారు. మెదక్​ జిల్లా పరిధిలో చౌరస్తాలు, గ్రామాల లింక్​ రోడ్లు ఉన్న నాలుగు చోట్ల మేజర్​ జంక్షన్లు, 15 మైనర్​ జంక్షన్​లు, సిద్దిపేట జిల్లా పరిధిలో నాలుగు మేజర్​ జంక్షన్లు, 19 మైనర్​ జంక్షన్లు ఏర్పాటు చేయనున్నారు.  

 ఈ ప్రాంతాలకు త్వరగా వెళ్లొచ్చు.. 

మెదక్​ నుంచి రామాయంపేట మీదుగా సిద్దిపేట వరకు ఉన్న రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.  మెదక్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్​, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ప్రజలు ఎక్కువగా వెళ్తుంటారు. అలాగే  అక్కడి నుంచి  జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఏడుపాయల, మెదక్​ చర్చి,  పోచారం వన్యప్రాణి అభయారణ్యం, పోచారం ప్రాజెక్ట్​ సందర్శనకు వచ్చే వారు ఇదే రూట్లో రాకపోకలు సాగిస్తారు.  ప్రస్తుతం మెదక్ - సిద్దిపేట రూట్లో చాలా వరకు సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది.  కొంత మేర డబుల్​ రోడ్డు ఉన్నా..  దెబ్బతిన్నది.  దీంతో  వాహనదారులు, ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  హైవే నిర్మాణంతో పూర్తయితే.. ఈ ప్రాంతాలకు వెళ్లడం ఈజీ అవుతుంది.