
ఎన్నో ఆటలు ఆడిన అనుభవం అందరిది. ఎన్ని ఆటలు ఆడినా.. ఏదో ఒక దాంట్లోనే మెడల్ సాధిస్తారు కొందరు. పుట్టుకతో ఉన్న స్కిల్, ప్రాక్టీస్‌తో ఇంప్రూవ్ చేసుకున్న టాలెంట్‌తో ఒక ఆటలో మేటి అనిపించుకోవచ్చు. ఎన్నో ఆటల్లో సాటిలేని స్పోర్ట్స్ పర్సన్ కావాలంటే రాపెల్లి శ్రీనివాస్‌లా కష్టపడాలె. ప్రతి మనిషికీ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అదే జీవితంలోని అద్భుతం. ఒక మనిషిలో మల్టీ టాలెంట్ ఉంటే ఇదొక మహాద్భుతం! అయినా.. అతనికి కూరగాయల వ్యాపారమే జీవనాధారం. ఇదే విషాదం. టాలెంట్‌కి, అవకాశాలకి మధ్య అంత అంతరం ఉన్నా ఆ రెండింటినీ కలిపి జీవితాన్ని సక్సెస్ చేసుకునేందుకు వంతెన కడుతున్నడు.
పేరు ‘రాపెల్లి శ్రీనివాస్’. ఆటగాడు. ‘ఏ ఆటగాడు?’ అంటే చెప్పలేం! ఎన్నో ఆటలు ఆడుతడు. అడిగినోళ్లతో ‘ఏ ఆట గురించి చెప్పాలె?’ అంటడు శ్రీనివాస్. అతను రన్నర్ ఇంకా.. స్విమ్మింగ్, జిమ్నాస్టిక్, కరాటే, కుంగ్‌ఫూ, కిక్ బాక్సింగ్‌లో మస్త్ సార్లు గెలిచిండు. క్యూబిక్ పజిల్ సాల్వ్ చేయడంల దిట్ట. మునివేళ్ల మీద నడకలో గిన్నిస్ రికార్డ్ హోల్డర్! ఎన్ని విద్యలో కదా!. ఆటలు లెక్కపెట్టినం కానీ, గెలిచిన మెడల్స్ లెక్కలేవ్. ఇప్పటి దాంక శ్రీనివాస్ గెలిచిన మెడల్స్ వందల్ల ఉంటయి. శ్రీనివాస్ గురించి చెప్పాల్నంటె కథ శానా ఉంది.
గ్రాండ్ చాంపియన్
శ్రీనివాస్ కరీంనగర్ సిటీల ఉన్న రాంపూర్‌లో ఉంటడు. చిన్నప్పటి సంది ఆటలంటే మస్త్ ఇష్టం ఉండెనట. చిన్నప్పటి సంది రన్నింగ్, స్విమ్మింగ్ చేయనీకి ఇష్టపడేటోడు. టెన్త్ క్లాస్ అయిపోయినంక, జనార్దన్ అనే కోచ్ దగ్గర కరాటే, కుంగ్‌పూ ట్రైనింగ్ తీసుకున్నడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి కిక్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నడు. దేశంల ఎక్కడ అథ్లెటిక్స్ కాంపిటీషన్స్ ఉంటె ఆడికిపోయిండు. ఇప్పటి దాంక 200 మెడల్స్ గెలిచిండు. కరాటే, కుంగ్ పూ పోటీల్లో గ్రాండ్ చాంపియన్ టైటిల్ మాత్రం శ్రీనివాస్‌కి దక్కాల్సిందేనట.
పదేండ్ల ప్రాక్టీస్.. గిన్నిస్ రికార్డ్
శ్రీనివాస్ ఎన్నో ఆటలాడుతడు. ఎన్నో మెడల్స్ గెలిచిండు. అందరితో పోటీపడి గెలిచే ఆటల కంటే ఎవరితో పోటీ లేకుండా గెలవాలనుకున్నడు. మునివేళ్లను నేలని తాకిస్తూ ఉరకాలనుకున్నడు. మొత్తానికి పదేళ్లు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయిండు. మునివేళ్లు మాత్రమే నేలను తాకిస్తూ నిమిషంల 137.1 మీటర్ల దూరం ఉరికిండు. 2019 మార్చి నెలలో కరీంనగర్ సిటీలో సక్సెస్ఫుల్గ జరిగిన ఈ ఫీట్ ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో శ్రీనివాస్ పేరు చేర్చింది. ఇదొక్కటే కాదు, చిత్రమైన ఎన్నో ఆటల్లో శ్రీనివాస్ మేటి. క్యూబిక్స్ని వేళ్లమీద చకచకా కదిలిస్త క్షణాల్లో పజిల్స్‌ని సాల్వ్ చేస్తడు. ఎంత ప్రయత్నించినా ఎవ్వరికీ సాధ్యం కాని క్యూబిక్ పజిల్ సాల్వ్ని తేలిగ్గా చేయడం కాదు, కళ్లకు గంతలు కట్టుకుని నిమిషంల సాల్వ్చేస్తడు. ముంబయిల 2014ల జరిగిన పోటీల కళ్లకు గంతలు కట్టుకొని క్యూబిక్ పజిల్ని సాల్వ్ చేసి గోల్డ్ మెడల్ గెలిచిండు.
గొర్రెలు కాస్తూ ప్రాక్టీస్
శ్రీనివాస్‌కి ఎంత టాలెంట్ ఉన్నా, గుర్తించాల్సిన వాళ్లు మాత్రం గుర్తించలే. శ్రీనివాస్‌కి మల్టీ టాలెంట్ ఉందని ఎర్కనే. సాధించిన మెడల్స్‌కి లెక్క లేకున్నా ఆ టాలెంట్‌కి తగ్గ గుర్తింపు రాలె. ఎంకరేజ్ చేసేటోళ్లు లేరు. ఆటల్ల సపోర్ట్చేసేటోళ్లూ దొర్కలే. పోటీల్ల గెలిచిన గోల్డ్‌మెడల్స్ బువ్వ పెడతయా? కూటి కోసం కోటి విద్యలన్నట్టు ఆటలు బువ్వ పెట్టకుంటే కూరగాయలు అమ్మి పొట్టపోసుకుంటున్నడు. ఈ పోరాటం ఈనాటిది కాదు. అమ్మనాన్నలు చనిపోతే చిన్నప్పటి సంది ఇట్లనే పోరాటం జేస్తున్నడు. ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్నట్టు ఏ పనీ చేయలేని రోజుల్లో గొర్రెలు కాస్తూ చిన్నప్పుడు బతికిండు. గొర్రెలు కాస్తనే ఈ ఆటలన్నీ ప్రాక్టీస్ చేసిండు. ప్రైజులు గెలిచిండు. శ్రీనివాస్ టాలెంట్చూసి ఎంకరేజ్చేసినోళ్లు లేరు. కానీ, ఏదో బతుకుదెరువు కోసం ఏ కూలీ నాలీకి పోకుండా పోలీస్ ట్రైనింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నోళ్లకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఇచ్చినరొకరు. ఈ పనితో పెద్దగా ఆదాయం లేక కరీంనగర్ వెజిటబుల్ మార్కెట్ల కూరగాయలు అమ్ముతున్నడు. శ్రీనివాస్ టాలెంట్‌ని గుర్తించి ఎన్నో అవార్డులిచ్చారు. ఢిల్లీ, బెంగళూరు సిటీలకు పోయి, రానీకి చార్జీకి డబ్బుల్లేక ఆ అవార్డులు కూడా తీసుకోలె. ఎంత దయనీయం శ్రీనివాస్ జీవితం. ఈ ఆణిముత్యాన్ని గవర్నమెంట్ గుర్తిస్తే తెలంగాణ గర్వపడే రోజొస్తుంది. మరి స్పోర్ట్స్ ఆఫీసర్స్ గుర్తించే రోజు ఎప్పుడొస్తదో చూడాలె.
సాయంచేస్తే సాహసాలు చేస్త
ఎన్నో మెడల్స్ గెలిచిన. గిన్నిస్ బుక్‌ల ఎక్కిన. ఇప్పుడు మునివేళ్ల మీద స్కిప్పింగ్, ఒంటి చేత్తో స్విమ్మింగ్ చేసుకుంట రూబిక్ క్యూబ్ ప్రాక్టీస్ చేస్తున్న. వీటిల్ల తొందర్లనే రికార్డు సాధిస్త. ఎవరైనా సాయంగా ఉంటే వండర్స్ చేస్త.
– రాపెల్లి శ్రీనివాస్
యాకయ్య ఓడపల్లి, కరీంనగర్, వెలుగు
For More News..