- 28న సారలమ్మ రాక, 29న గద్దెకు చేరనున్న సమ్మక్క
- 31న వనప్రవేశంతో ముగియనున్న జాతర
- మూడు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా, భారీ స్థాయిలో ఏర్పాట్లు
- జాతర విధుల్లో 21 శాఖలు, 42,027 మంది ఆఫీసర్లు, సిబ్బంది
- 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ స్థలాలు
హైదరాబాద్, వెలుగు : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ములుగు జిల్లాలోని మేడారం సిద్ధమైంది. జాతర ప్రాంగణంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మహాజాతరకు సుమారు 3 కోట్ల మంది భక్తులు తరలివస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, క్యూలైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 21 మండ మెలిగే పండుగ నిర్వహించనున్నారు. ఈ నెల 27న మహబూబాబాద్ జిల్లా నుంచి పగిడిద్దరాజు, కన్నెపల్లి నుంచి జంపన్న మేడారానికి పయనమవుతారు. 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు వచ్చి గద్దెలపై కొలువుదీరుతారు. 29న చిలుకలగుట్టపై కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న దర్శనాలు, మొక్కుల చెల్లింపు, 31న దేవతల వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు.
జాతర విధుల్లో 42,027 మంది
మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం 21 శాఖల నుంచి మొత్తం 42,027 మంది అధికారులు, సిబ్బందిని నియమించారు. వీరికి తోడుగా మరో రెండు వేల మంది ఆదివాసీ యువత వలంటీర్లుగా సేవలు అందించనున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు మేడారం ప్రాంతాన్ని ఎనిమిది పరిపాలనా జోన్లుగా, 42 సెక్టార్లుగా డివైడ్ చేశారు. జోన్ల బాధ్యత జిల్లా స్థాయి ఆఫీసర్లు, సెక్టార్ల బాధ్యత మండల స్థాయి ఆఫీసర్లకు అప్పగించారు. కమ్యూనికేషన్ 27 శాశ్వత, 33 తాత్కాలిక మొబైబ్ టవర్లు, 450 హైఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు.
1,418 ఎకరాల్లో పార్కింగ్
వాహనాల రద్దీని నియంత్రించేందుకు అటవీ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 1,418 ఎకరాల విస్తీర్ణంలో 42 పార్కింగ్ ప్లేస్‌లను సిద్ధం చేశారు. ఆలయ ప్రాంగణం, గద్దెలు, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, ఊరట్టం, శివరాం సాగర్, నార్లాపూర్, పడిగాపూర్ వంటి అన్ని కీలక ప్రాంతాల్లో కంట్రోల్‌రూమ్‌లు, మిస్సింగ్ పర్సన్స్ క్యాంప్‌లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్‌ను నియమించి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రాకపోకల్లో ఇబ్బందులు రాకుండా మొత్తం 525 చోట్ల రహదారి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు.
తాగునీరు, శానిటేషన్, విద్యుత్ సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు
జాతరలో మిషన్ భగీరథ ద్వారా నిరంతం తాగునీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేశారు. మొత్తం 5,482 నల్లాలు ఏర్పాటు చేసి భక్తులకు తాగునీరు అందిస్తున్నారు. జంపన్నవాగులో పవిత్ర స్నానాలు చేసే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు 119 డ్రెస్సింగ్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు నీటి పరిశుభ్రత కోసం ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేయనున్నారు. 285 బ్లాకుల్లో 5,700 టాయిలెట్లను సిద్ధం చేశారు. వీటికి అదనంగా మొబైల్ టాయిలెట్స్ సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు.
పారిశుధ్య నిర్వహణ కోసం ఐదు వేల మంది సిబ్బందితో పాటు 150 ట్యాంకర్లు, 100 ట్రాక్టర్లు, 18 స్వీపింగ్ మెషీన్లు, 12 జేసీబీలు, 40 స్వచ్ఛ ఆటోలు, 16 డోజర్లను రంగంలోకి దింపారు. జాతర ప్రాంతంలో నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ ద్వారా 196 ట్రాన్స్‌ఫార్మర్లు, 911 విద్యుత్ స్తంభాలు, 65.75 కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ అంతరాయం తలెత్తకుండా 350 మంది సిబ్బందిని నియమించారు. ఆలయాలు, ప్రధాన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో వేల సంఖ్యలో హై పవర్ లైట్లు ఏర్పాటు చేయగా.. అత్యవసర పరిస్థితుల కోసం 28 డీజిల్ జనరేటర్లను సైతం రెడీగా ఉంచారు.
రవాణా, మెడికల్‌పై స్పెషల్ ఫోకస్
భక్తులు మేడారానికి సులభంగా చేరుకునేందుకు టీజీఆర్టీసీ ఈ సారి నాలుగు వేల బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి 51 వేల ట్రిప్పులు నడపనుంది. గంటకు 15 బస్సులు నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. జాతర కోసం 10,441 మంది ఆర్టీసీ సిబ్బంది సేవలు అందించనున్నారు. జాతర సమయంలో ఆరోగ్య సేవల కోసం మొత్తం 5,192 మంది వైద్య సిబ్బందిని నియమించారు.
భక్తులకు సేవలందించేందుకు 30 అంబులెన్స్‌లు, 40 బైక్ అంబులెన్సులు, 50 పడకల ప్రధాన ఆసుపత్రి, రోజుకు 30 మెడికల్ క్యాంప్‌లు పనిచేయనున్నాయి. జంపన్నవాగులో ప్రమాదాలను నివారించేందుకు 210 మంది గజ ఈతగాళ్లు, 12 మంది సింగరేణి రెస్క్యూ సిబ్బంది, 100 ఎస్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ పనిచేయనున్నాయి. అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు 15 ఫైర్ బ్రిగేడ్ వాహనాలు, 268 మంది ఫైర్ ఫైటర్లను నియమించారు.
మేడారంలోనే మంత్రి సీతక్క మకాం
మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు రావొద్దని ఆఫీసర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క మేడారంలోనే మకాం వేసి క్యూలైన్లు, స్నానఘట్టాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఆఫీసర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్నిశాఖలు కలిసి సమగ్ర ప్రణాళికతో పనిచేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
మేడారం భక్త జనసంద్రం
తాడ్వాయి, వెలుగు : సంక్రాంతి సెలవులు కావడం, మేడారం మహాజాతర సమీపిస్తుండడంతో ముందస్తు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం భారీ సంఖ్యలో వచ్చిన భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడాయి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర నుంచి వచ్చిన భక్తులు ముందుగా జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ఎత్తు బంగారంతో అమ్మవార్ల గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, చీరె సారే, ఒడిబియ్యం సమర్పించారు.
అనంతరం కోళ్లు, మేకలను బలిచ్చి అటవీ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. శుక్రవారం ఒక్కరోజే 10 లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చినట్లు ఈవో మేకల వీరస్వామి తెలిపారు. జంపన్న వాగు వద్ద రిషిత అనే బాలిక తప్పిపోగా విషయం తెలుసుకున్న పోలీసులు అలర్ట్ అయి తల్లిదండ్రులను గుర్తించి చిన్నారిని అప్పగించారు.
