మేడారంలో 1700 ఎకరాల్లో వెహికల్స్​ పార్కింగ్

మేడారంలో 1700 ఎకరాల్లో వెహికల్స్​ పార్కింగ్

ఆత్మకూరు(దామెర), వెలుగు: మేడారం మహా జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ చెప్పారు. మీడియా మిత్రులు, పోలీస్​శాఖ సమన్వయంతో జాతరను సక్సెస్​చేద్దామని పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట శివారులోని ఎన్ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్​లో బుధవారం విలేకర్లు, ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, పోలీస్​అధికారులతో ఎస్పీ కోఆర్డినేషన్​మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీశ్​మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక పార్కింగ్ సెక్టార్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సెక్టార్ కు ఒక డీఎస్పీ ఇన్​చార్జిగా ఉంటారని చెప్పారు.

మొత్తం 34 చోట్ల 1700 ఎకరాల్లో వెహికల్స్​పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. 14 వేల మంది పోలీసులు, క్రైమ్ కంట్రోల్ కోసం సీసీఎస్ టీమ్​నుంచి మరో 500 మంది సిబ్బంది జాతర డ్యూటీలో ఉంటారన్నారు. ట్రాఫిక్​నియంత్రణకు సీసీ కెమెరాలు, డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు గతంలో ఎదుర్కొన్న సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. చిలుకలగుట్ట వద్దకు అనుమతించేందుకు స్పెషల్​పాస్​లు ఇవ్వాలని కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ లక్ష్మణ్ కుమార్, నర్సంపేట రూరల్ ఇన్​స్పెక్టర్ కిషన్, ఎస్సై కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.