అలర్ట్ గా లేకుంటే ఆగమే!.. మేడారం దారుల్లో మూల మలుపుల ముప్పు

 అలర్ట్ గా లేకుంటే ఆగమే!.. మేడారం దారుల్లో మూల మలుపుల ముప్పు

 

  • జాతరకు వెళ్లే రూట్లలో ప్రమాదాలకు ఆస్కారం 
  • జంక్షన్ల వద్ద ఆగితే ట్రాఫిక్ జామ్ అవడం ఖాయం 
  •  డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచనలు
  • బారీకేడ్స్, రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేసి నిఘా
  • ఇయ్యాల్టి నుంచి అమలులోకి ట్రాఫిక్ వన్ వే రూల్స్ 

 జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు : మేడారం మహాజాతరకు వెళ్లే దారుల్లో మూల మలుపులతో ముప్పు పొంచి ఉంది. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాల్లో భక్తులు వనదేవతల దర్శనానికి బాటపట్టారు. ప్రధాన జంక్షన్లు అయిన గూడెప్పాడ్, పస్రా, జంగాలపల్లి, మల్లంపల్లి వద్ద డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. గత అనుభవాల దృష్ట్యా పోలీసులు జాతరకు వెళ్లే దారులతో పాటు ఎగ్జిట్ రూట్లలోనూ బైక్ పెట్రోలింగ్, నేషనల్ హై పై వాహనాలు నిలపకుండా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జంక్షన్ల వద్ద అలర్ట్ గా లేకుంటే ప్రమాదాలు జరిగే చాన్స్ ఉందని ముందుగానే వాహనదారులకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.

 ఒక్క వెహికల్ ఆగినా.. 

ములుగు జిల్లాలోని మేడారం జాతరకు వాహనాలు భారీగా క్యూ కడుతున్నాయి. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్​తో పాటు విదేశాల నుంచి భక్తులు తరలివ స్తున్నారు. వాహనాలు ఎక్కడా ఆగకుండా చూడడంతో పాటు క్షేమంగా గమ్యస్థానా లకు చేరేలా పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఒక్క వెహికల్ ఆగినా ట్రాఫిక్​ జామ్​అయ్యే పరిస్థితి ఉండడంతో వాహనాల రాకపోకలపై ఫోకస్ చేశారు.   

మూల మలుపులతో ముప్పు..

జాతర చేరుకునే, తిరిగి వెళ్లే దారుల్లో ప్రమాదకరమైన మూలమలుపులు ఉన్నాయి. దీతో ములుగు జిల్లా సరిహద్దు నార్లాపూర్​వద్ద పోలీసులు జంక్షన్ ఏర్పాటు చేశారు. నార్లాపూర్, బయ్యక్కపేట, గొల్ల బుద్ధారం, రాంపూర్, కమలాపూర్, గాంధీనగర్ ​క్రాస్​, హనుమకొండ జిల్లా పరకాల మండలం చలివాగు వరకు నేషనల్ హైవే వెంట బైక్​పై పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కమలాపూర్, రాంపూర్, దీక్షకుంట వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బయ్యక్కపేట నుంచి దూదేకులపల్లి, దీక్షకుంట మూల మలుపుల వద్ద బారీకేడ్స్ తో పాటు రేడియం స్టిక్కర్స్  ఏర్పాటు చేసి నిఘా పెంచారు.

వాహనాలు స్పీడ్ లిమిట్ దాటినా, వన్​వే రూల్స్ అతిక్రమించినా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా సరిహద్దులో అడిషనల్​ఎస్పీ, 8 మంది డీఏస్పీలు, 18 మంది సీఐలు, 45 మంది ఎస్ ఐలు, 651 మంది సిబ్బందితో ట్రాఫిక్​ కంట్రోల్ చేస్తున్నారు. బుధవారం సారలమ్మ రాకతో జాతరకు భక్తుల రద్దీ పెరుగుతుంది. దీంతో వన్​ వే రూల్స్ అమల్లోకి వస్తాయి. హనుమకొండ, హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్​, ఏపీకి చెందిన భక్తులు భూపాలపల్లి జిల్లా కేంద్రం నుంచే  గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. వెహికల్స్ లో ఏదైనా సమస్య తలెత్తినా నిలిపి రిపేర్​చేసుకునేలా పార్కింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు.  

గూడెప్పాడ్ నుంచి పస్రా దాకా..

జాతరకు చేరే మార్గాల్లోని జంక్షన్ల వద్ద వాహనాలు తిప్పే క్రమంలో ఏ ఒక్కటి ఆగినా ట్రాఫిక్​జామ్ అవడం ఖాయం. దీంతో క్లియర్​ చేయడం పోలీసులకు పెద్ద సవాల్​గా మారుతుంది. జంక్షన్ల వద్ద ఒక వెహికల్ దారిమళ్లిన తర్వాతనే మరొకటి వదలాల్సి ఉంటుంది. హైదరాబాద్, హనుమకొండ ప్రాంతాల వైపు నుంచి వచ్చే ఆర్టీసీ, ప్రైవేట్ వెహికల్స్​రద్దీగా ఉండే గూడెప్పాడ్ జంక్షన్ ​నుంచే మేడారం వెళ్లాల్సి ఉంటుంది. వన్​వే రూట్ కావడంతో జాతర సమయాల్లో ట్రాఫిక్ కష్టాలు తలెత్తుతాయి. గూడెప్పాడ్ దాటిన తర్వాత ఉండే మల్లం పల్లి జంక్షన్​ కూడా వాహనాలతో రద్దీగానే ఉంటుంది.  

ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు ఇక్కడికి చేరుకుని మేడారం వైపు వెళ్లాలి.  తిరిగి వెళ్లేటప్పుడు వాహనాలు ఓవర్ టేక్ చేయడం సమస్యగా ఉంటుంది. ఇక్కడ డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అన్ని దారుల నుంచి వచ్చే లక్షలాది వాహనాలు మేడారం చేరేందుకు కీలకమైన పస్రా జంక్షన్​ వద్దకు చేరుతాయి. అక్కడ ఏ ఒక్క వాహనం నిలిచినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్ అవుతుంది.