మేడారం మహాజాతరకు అంకురార్పణ : మండమెలిగే పండుగతో ప్రారంభం

మేడారం మహాజాతరకు అంకురార్పణ : మండమెలిగే పండుగతో ప్రారంభం

ములుగు: మేడారం మహాజాతరకు అంకురార్పణలో ప్రధాన ఘట్టం మండమెలిగే పండుగ ప్రారంభం అయ్యింది. సమ్మక్క కొలువైన మేడారం, సారలమ్మ ఉన్న కన్నెపల్లి, కొండాయిలోని గోవిందరాజులు, పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడుల పూజారులు శుద్ది చేశారు.

పుట్టమట్టితో గుడులు అలికి... మామిడి తోరణాలతో పూజారులు అలంకరణ చేశారు. మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన ఆడపడుచులు సమ్మక్క గుడికి వెళ్లి పూజలు చేశారు. గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆదివాసీ ఆచార సంప్రదాయాల ప్రకారం ఉపవాస దీక్షలతో మండమెలిగే పండుగ చేస్తారు. ఫిబ్రవరి 21 నుండి 24 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అసలు జాతర ప్రారంభం కానుంది.