బస్సుల కోసం భక్తులను వెయిట్ చేయించొద్దు.. మేడారానికి వెంట వెంటనే బస్సులు నడపాలి

బస్సుల కోసం భక్తులను వెయిట్ చేయించొద్దు.. మేడారానికి వెంట వెంటనే  బస్సులు నడపాలి
  •      టీజీ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి 

హనుమకొండ, వెలుగు: మేడారం మహాజాతరకు భక్తులు ఎదురుచూడకుండా బస్సులు నడపాలని టీజీఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశించారు. హనుమకొండ, వరంగల్, కాజీపేటలో ఏర్పాటు చేసిన మేడారం టెంపరరీ బస్ క్యాంప్ లను గురువారం రీజినల్ మేనేజర్ డి.విజయభానుతో కలిసి ఆయన పరిశీలించారు. 

బస్ క్యాంపుల్లో కల్పిస్తున్న సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సులు భక్తులకు నిరంతరం అందుబాటులో ఉండేలా పక్కా ప్లాన్ తో చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. తాగునీరు, ప్రాథమిక చికిత్స కేంద్రాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. 

జాతర ముగిసే వరకు అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు సమన్వయంతో పనిచేసి భక్తులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలన్నారు. ఆర్టీసీ సేవలను వినియోగించుకుని భక్తులు సురక్షితంగా ప్రయాణించాలన్నారు. వరంగల్ రీజినల్ మేనేజర్ దర్శనం విజయభాను,డీఆర్ఎం కేశరాజు భానుకిరణ్, డిపో మేనేజర్లు బి.ధరమ్‌సింగ్, పి.అర్పిత,  రవిచంద్ర ఉన్నారు.