మేడారం బంద్ తాత్కాలికంగా వాయిదా

మేడారం బంద్ తాత్కాలికంగా వాయిదా
  •     స్థల వివాదం పరిష్కరిస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హామీ 
  •     ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించిన మేడారం పూజారులు

బషీర్ బాగ్, వెలుగు : మేడారం సమ్మక్క, సారక్క పూజారులు తలపెట్టిన బంద్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆ శాఖ కమిషనర్ హనుమంతరావుతో సమ్మక్క పూజారులు చర్చలు జరిపారు. కమిషనర్ హన్మంతరావు ఇచ్చిన తాత్కాలిక హామీతో ఆందోళన విరమిస్తున్నట్టు పూజారులు తెలిపారు. వరంగల్ పాత సెంట్రల్ జైల్ పక్కన ఉన్న రంగంపేట ధార్మిక భవన్ స్థల వివాదాన్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పూజారి రఘుపతి రావు చందా చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డితో చర్చించిన అనంతరం దేవాదాయశాఖ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ నెల 29, 30 రెండ్రోజుల్లో  నిర్వహించాల్సిన ఆందోళనను తాత్కాలిక వాయిదా వేసినట్టు వెల్లడించారు. 1993లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేడారం దేవస్థానానికి 9 గుంటల భూమిని కేటాయించిందని వివరించారు. తమకు కేటాయించిన భూమిని వరంగల్ భద్రకాళి దేవాలయం కమిటీ ఆక్రమించుకుందని స్పష్టం చేశారు.

అక్కడ నిర్మించిన ధార్మిక భవన్ కు.. సమ్మక్క, సారక్క ధార్మిక భవన్ గా పేరు మార్చి ఆ స్థలం, భవన పూర్తి హక్కులను మేడారం దేవస్థానానికి ఇస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే పూజరులంతా సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.