అర్ధరాత్రి మద్యం అమ్మకాలను కట్టడి చేయాలంటూ డిమాండ్

అర్ధరాత్రి మద్యం అమ్మకాలను కట్టడి చేయాలంటూ డిమాండ్

మేడ్చల్, వెలుగు : పరస్పర ఆరోపణలు, తీవ్ర వాగ్వాదాల మధ్య మేడ్చల్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. జడ్పీ చైర్మన్ మల్లిపెద్ది శరత్ చంద్రారెడ్డి అధ్యక్షతన మేడ్చల్ జడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగిన మీటింగ్​లో సభ్యులు లేవనెత్తిన సమస్యలపై మంత్రి మల్లారెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్ స్పందించారు. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పలు సమస్యలపై అధికారులు, నేతలను నిలదీశారు. 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న నిధులను ఎలా ఖర్చుపెడుతున్నారని ప్రశ్నించారు. కాగా ఈ విషయంపై తీవ్ర చర్చ సాగింది.

మంత్రి సహా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. జిల్లాలోని బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతోందని, అర్ధరాత్రి రాత్రి దాటి అమ్ముతున్నా ఎక్సైజ్ శాఖ పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిషేక్ అగస్య, జడ్పీ వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, సీఈవో దేవ సహాయం,  జడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.