మెడికల్ సీట్ల భర్తీలో మరోసారి ‘సీటు బ్లాకింగ్‌‌’

మెడికల్ సీట్ల భర్తీలో మరోసారి ‘సీటు బ్లాకింగ్‌‌’

హైదరాబాద్‌‌, వెలుగు: మెడికల్‌‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌‌ మరోసారి తెరపైకొచ్చింది. ఇటీవల ముగిసిన రెండో విడత మేనేజ్‌‌మెంట్‌‌ కోటా కౌన్సెలింగ్‌‌లో బీహార్‌‌‌‌కు చెందిన ముగ్గురు వైద్య విద్యార్థులు కరీంనగర్‌‌‌‌లోని ఓ ప్రైవేట్‌‌ మెడికల్‌‌ కాలేజీలో సీట్లు పొందారు. ఈ ముగ్గురి పేర్లు బీహార్‌‌‌‌ మెరిట్‌‌ లిస్ట్‌‌లోనూ ఉన్నాయని హెల్త్‌‌ రిఫార్మ్స్‌‌ డాక్టర్స్‌‌ అసోసియేషన్‌‌ ప్రతినిధులు తెలిపారు. తొలి విడత మేనేజ్‌‌మెంట్‌‌ కోటా కౌన్సెలింగ్‌‌లో పాల్గొనకుండా, రెండో విడతలో సీటు కోసం రావడంపై హెచ్‌‌ఆర్డీఏ ప్రతినిధులు అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్‌‌ చుట్టు పక్కల మంచి కాలేజీల్లో సీట్లు ఉండగా, కరీంనగర్‌‌‌‌లోని కాలేజీని ఎంచుకోవడం వెనుక మతలబేంటని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురూ బీహార్‌‌‌‌కు చెందిన వారే కావడం, ముగ్గురూ ఒకే కాలేజీలో సీటు ఎంచుకోవడం, తొలి విడత కౌన్సెలింగ్‌‌కు రాకుండా రెండో విడత కౌన్సెలింగ్‌‌కు హాజరుకావడం అనుమానాలను పెంచుతున్నాయని హెచ్‌‌ఆర్డీఏ ప్రెసిడెంట్‌‌ డాక్టర్‌‌‌‌ మహేశ్‌‌ అన్నారు. హెల్త్‌‌ వర్సిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.