పేదల దవాఖానలో అందని వైద్యసేవలు

పేదల దవాఖానలో అందని వైద్యసేవలు
  • ఎంసీహెచ్​కు సుస్తీ
  • పేదల దవాఖానలో అందని వైద్యసేవలు..

“ఈ నెల 16న జగిత్యాల ఎంసీహెచ్ లో వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామానికి చెందిన వనిత అనే నిండు గర్భిణి రెండు రోజుల కింద డెలివరీ కోసం జాయిన్  అయ్యింది.  మధ్యాహ్నం 2  గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నొప్పులు భరించింది. 12 తర్వాత  పెయిన్స్​ఎక్కువ కావడంతో సోదరుడు మహేశ్ ​నర్సులను  వేడుకున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. డ్యూటీ డాక్టర్​కూడా లేకపోవ డంతో అక్కడ ఉన్న ఆయాలు జనరల్ వార్డులోనే డెలివరీ చేశారు. ’’

 “ఈ నెల 13న ధర్మపురికి చెందిన గర్భిణి రమ్య.. రెగ్యులర్​చెకప్​కోసమని  ఎంసీహెచ్ కు వచ్చింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచిచూసినా.. ఏ డాక్టర్ రాలేదు.  నర్సులు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాలని చెప్పడంతో  అక్కడకు వెళ్తే రెగ్యులర్​చెకప్స్​చూడమని  , ఎమర్జెన్సీ అయితేనే చూస్తామని తిప్పి పంపించారు. ఇలా ఒక్క రోజే  30 మందికి పైగా  గర్భిణులు , మహిళలు ఆస్పత్రి వరకు వచ్చి వెళ్లిపోయారు.’’ 

  • నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్లు, నర్సులు
  • ఎమర్జెన్సీ ఉన్నా  పట్టించుకోని దుస్థితి..
  • ఇబ్బంది పడుతున్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు 
  • ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని పేషంట్ల ఆవేదన..

జగిత్యాల, వెలుగు :  పేదలకు మెరుగైన వైద్యసేవల కోసం  ఏర్పాటు చేసిన ఎంసీహెచ్ (మాతా శిశు సంరక్షణ కేంద్రం) లో గర్భిణులకు,  బాలింతలకు, చిన్నారులకు వైద్యం అందడం లేదు. ఆస్పత్రిపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక రోగులు, రోగి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ టైమ్​లో డాక్టర్లు ఉండకపోవడంతో ఎంతో దూరం నుంచి వచ్చిన గర్భిణులు అవస్థలు పడుతున్నారు. పైగా సాయంత్రం సమయాల్లో సైతం గైనిక్ డాక్టర్లు  ఓపీ చూడాలనే రూల్స్ ఉన్నప్పటికీ డాక్టర్లు పట్టించుకోవడం లేదు. దీంతో పాటు రాత్రి వేళల్లో ఏ సమస్య వచ్చినా ఆస్పత్రిలో  వైద్యం అందక ప్రైవేట్ బాట పట్టాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. 

అడుగడుగునా నిర్లక్ష్యం 

 ఆస్పత్రి చిల్డ్రన్స్ విభాగంలో 8 మంది ,  గైనిక్ లో  6 గురు డాక్టర్లను  ప్రభుత్వం నియమించింది. ప్రారంభించిన మొదట్లో మెరుగైన సేవలందించడం తో జిల్లా ఆస్పత్రి తో పాటు ఎంసీహెచ్​కు రోజూ 600 కు పైగా రోగులు ఓపీకి వస్తున్నారు.   ప్రస్తుతం సర్కార్  దవాఖానాల్లో  సిజేరియన్లు తగ్గించి, నార్మల్ డెలివరీల సంఖ్య పెంచేలా ప్రణాళిక రూపొందించారు. గత నెలలో రాయికల్ పీహెచ్​సీ నుంచి  60 డెలివరీ కేసులు జగిత్యాల ఎంసీహెచ్ కు రిఫర్​పై రాగా, ఒకే ఒక్క నార్మల్ డెలివరీ చేశారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు షిఫ్ట్ ల వారీగా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆస్పత్రిలో డాక్టర్లు ఇవేవీ పట్టించుకుంటలేరని ఆరోపణలొస్తున్నాయి. 

ఆధిపత్య పోరు   

ఎంసీహెచ్​లో ఆధిపత్య పోరు వల్ల  వైద్య సేవలందడం లేదనే విమర్శలున్నాయి. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన ఆస్పత్రిలో అధికార పార్టీ లీడర్​ పైరవీతో  ఎంపికైన ఓ డాక్టర్ ఆధిపత్య వైఖరితో డాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎంసీహెచ్​లో సూపరింటెండెంట్​ స్థానికంగా ఉండకపోవడాన్ని ఆసరా చేసుకుని  అన్ని తానై వ్యవహరిస్తున్నాడు. అతని  తీరు నచ్చక ఇతర డాక్టర్లు ఎంసీహెచ్ కు వచ్చేందుకు జంకుతున్నారు. అలాగే మంత్రి పీఏ తనకు సన్నిహితుడని, చెప్పినట్లు వినకపోతే మరుసటి రోజే పీకేస్తానంటూ వేధింపులకు గురి చేస్తాడని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరిగిన శానిటేషన్​ స్టాఫ్ రిక్రూట్​మెంట్​లో కూడా కాంట్రాక్టర్ తో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడిన విషయం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి వెళ్లడంతో మందలించినట్లు సమాచారం.  

ప్రతి పేషంట్​పై  కేర్​ తీసుకుంటున్నం

ఆస్పత్రికి వచ్చే ప్రతి పేషంట్​పై కేర్ తీసుకుని మెరుగైన ట్రీట్​మెంట్​అందిస్తున్నాం. పేషంట్లకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తా. శనివారం  వజ్రోత్సవాల్లో భాగంగా డాక్టర్లు గేమ్స్​లో పాల్గొనడంతో ఆస్పత్రికి రావడం కొంత ఆలస్యమైంది.  


– డాక్టర్ రాములు, సూపరింటెండెంట్, ఎంసీహెచ్, జగిత్యాల