
ఏటూరు నాగారం, వెలుగు: ములుగు జిల్లాలో పొంగుతున్న జంపన్న వాగు దాటి వెళ్లి వైద్య శిబిరం నిర్వహించి పలు గ్రామాల గిరిజనులకు అధికారులు సేవలు అందించారు. ఏటూరునాగారం మండలంలోని దొడ్ల–-కొండాయి గ్రామాల మధ్య జంపన్న వాగు పొంగి ప్రవహిస్తోంది. అవతలి వైపు గ్రామాలైన మల్యాల, కొండాయి, గోవిందరాజుల కాలనీ, ఐలాపురం గ్రామల ప్రజల రాకపోకలకు గతంలో వంతెన నిర్మించగా మూడేండ్ల కింద వరద తాకిడికి పూర్తిగా కొట్టుకుపోయింది.
జంపన్నవాగుపై వంతెన సౌకర్యం లేకపోవడంతో అవతలివైపు గ్రామాల ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో వైద్యానికి ఐటీడీఏ అధికారులు ఏర్పాటు చేసిన పడవలో ఏటూరునాగారం చేరుకుంటారు. కొందిరాల కన్నాయిగూడెం మండల కేంద్రంలోని పీహెచ్ సీ వైద్యాధికారి హెచ్. ప్రణిత్గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైద్య సేవలు అందిస్తుంటారు. ప్రమాదకర పరిస్థితుల్లో కూడా సిబ్బందితో కలిసి పడవలో వాగు దాటి వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నారు.
దీంతో పలుమార్లు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వాగుదాటి వెళ్లి ప్రజలకు వైద్యసేవలు అందిస్తుండగా ప్రాణదాతగా చూస్తున్నారు. గత శనివారం సిబ్బందితో కలిసి పడవలో జంపన్నవాగు దాటి మల్యాల గొత్తికోయగూడెంలో వైద్యం శిబిరం ఏర్పాటు చేశారు. ఇంటింటికీ తిరిగి ఫీవర్సర్వే చేశారు. అనంతరం శిబిరానికి వచ్చిన గ్రామస్తులకు మలేరియా పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు డాక్టర్ ప్రణిత్ సూచించారు. ఆయన వెంట హెల్త్అసిస్టెంట్కె.భాస్కర్, ఆశ వర్కర్లు జ్యోతి, భాగ్యలక్ష్మీ ఉన్నారు.