- రిపేర్లు చేసినా గ్యారంటీ ఇవ్వలేమన్న ఎన్డీఎస్ఏ
- దానికి తగ్గట్టే పనులు మొదలుపెట్టగానే కొత్త సమస్యలు
- ఏడో బ్లాక్‌లో భారీ గొయ్యి.. అందులోంచి నీటి ఊటలు
- ఒక్క రోజులోనే పెరిగిన బొయ్యారం సైజు
- కొత్తగా మరో రెండు గేట్లనూ కట్‌చేయాలని అధికారుల నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ మేడిపండును తలపిస్తున్నది. బ్యారేజీలో కొత్త సమస్యలు వచ్చి పడుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బ్యారేజీకి రిపేర్లు మొదలుపెట్టగానే ఊహించని లోపాలు బయటపడుతున్నాయి. బ్యారేజీకి రిపేర్లు చేస్తున్నా.. భవిష్యత్తులో ఆ బ్యారేజీ పరిస్థితి ఏమిటన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. రిపేర్లు మొదలు పెట్టగానే పిల్లర్ల కింద భారీ గొయ్యి ఏర్పడడం, పలు పిల్లర్ల దగ్గర నీటి ఊటలు వస్తుండడంతో మున్ముందు బ్యారేజీ పటిష్ఠత ఎలా ఉంటుందోనన్న భయాలు అధికారులను వెంటాడుతున్నాయి.
రిపేర్లు చేస్తే వాడుకునేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నా.. భారీ వరదలు వస్తే బ్యారేజీకి రక్షణ ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు బ్యారేజీ రక్షణకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బ్యారేజీ పటిష్ఠతను తెలుసుకునేందుకు ఎన్డీఎస్ఏ సూచించిన జియోఫిజికల్, జియోటెక్నికల్ టెస్టులు ఇంకా మొదలుకాకపోవడం బ్యారేజీపై ఆందోళనలకు కారణమవుతున్నది.
ముందే గ్యారంటీ ఇవ్వని ఎన్డీఎస్ఏ
బ్యారేజీ పటిష్ఠతపై నేషనల్డ్యామ్సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నిపుణుల కమిటీ గ్యారంటీ ఇవ్వలేదు. రిపేర్లు చేసినా భవిష్యత్తులో ఆ బ్యారేజీ పటిష్టంగా ఉంటుందని చెప్పలేమని మూడు వారాల క్రితం ఇచ్చిన మధ్యంతర నివేదికలో నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఆ మాటలను నిజం చేసేలాగానే ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీ పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. ఊహించని రీతిలో బ్యారేజీ ఏడో బ్లాక్‌లోని పిల్లర్ల కింద భారీ బొయ్యారం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆ బ్లాక్‌లోని గేట్లను ఎత్తుతుండగా శబ్దాలొచ్చి ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. కింద బొయ్యారం ఉండడం, ఇసుక లేకపోవడంతో గేట్లేపుతుంటే పిల్లర్లపై భారం పడుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ మరో రెండు గేట్లనూ కట్‌చేయాలని అధికారులు నిర్ణయించారు. అప్పటికే రెండు గేట్లను కట్ చేయాలని ఎన్డీఎస్ఏ కమిటీ చెప్పడం.. ఇప్పుడు దానికి మరో రెండు యాడ్ కావడంతో పరిస్థితి తీవ్రంగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి గ్రౌటింగ్ చేసి గేట్లను లేపాలని అధికారులు భావించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని అంటున్నారు. ఈ క్రమంలోనే నాలుగు గేట్లనూ కట్చేస్తేనే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి ఆ బ్లాక్‌లోని మిగిలిన ఏడు గేట్లలో మూడు గేట్లను ఎత్తవచ్చని చెబుతున్నా.. ఎత్తే క్రమంలో పక్క పిల్లర్ల మీద ప్రభావం పడుతుందా? అన్న కోణాల్లోనూ అధికారులు అతి జాగ్రత్తగా చర్యలు చేపడుతున్నారు.
పలు చోట్ల నీటి ఊటలు..
మేడిగడ్డ ఏడో బ్లాక్‌లోని పలు చోట్ల నీటి ఊటలు ఉబికి వస్తున్నట్టు తెలుస్తున్నది. గొయ్యి పడిన ప్రాంతం నుంచి నీటి ఊటలు ఉబికి వస్తున్నట్టు చెబుతున్నారు. ఇటు తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల వానలు కురుస్తున్నాయి. ఎగువన కూడా వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే ఎగువ నుంచి త్వరగా వరద మొదలైతే.. ఏడో బ్లాక్ వద్దకు వరద రాకుండా అడ్డుకట్ట వేసి పనులు చేయనున్నారు. అయితే, ఊహించని విధంగా ఎక్కువ వరద వస్తే పరిస్థితేంటన్న దానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దాంతో పాటే పిల్లర్ల కింద ఏర్పడిన బొయ్యారం సైజు (వెడల్పు) ఒక్క రోజులోనే 50 మీటర్ల మేర పెరిగిపోవడమూ అనుమానాలకు తావిస్తున్నది. ఆ బొయ్యారం ఎంత లోతుకు పడిందన్న దానిపైనా క్లారిటీ లేదు. రిపేర్లు చేస్తే పదిహేనేండ్ల పాటు బ్యారేజీని వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా.. చేసిన రిపేర్లు ఎంత కాలం వరకు మన్నుతాయన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి.
ఇప్పటికే ఎన్డీఎస్ఏ సిఫార్సులను ఇంత తక్కువ టైంలో అమలు చేయడం కష్టమేనని అధికారులు తేల్చి చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యారేజీ ప్రొటెక్షన్‌పై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి బొయ్యారాలు మిగతా బ్లాకులకూ విస్తరించవన్న గ్యారంటీ ఉంటుందా? అన్న చర్చలు జరుగుతున్నాయి.
ఇప్పటికీ మొదలుకాని టెస్ట్‌లు
ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక వచ్చి దాదాపు మూడు వారాలు అవుతున్నా.. ఇప్పటికీ కేంద్ర సంస్థల టెస్టులు మొదలు కాలేదు. పుణెకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్), ఢిల్లీకి చెందిన సెంట్రల్సాయిల్మెటీరియల్రీసెర్చ్స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్), హైదరాబాద్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) నిపుణులతో జియోటెక్నికల్, జియోఫిజికల్, ఎన్డీటీ ఇన్వెస్టిగేషన్స్ చేయాలని ఎన్డీఎస్ఏ సూచించింది. సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు వచ్చి బ్యారేజీలను పరిశీలించినా.. ఇన్వెస్టిగేషన్స్ఎప్పుడు చేస్తామన్నది మాత్రం చెప్పలేదు.
సీఎస్ఎంఆర్ఎస్, ఎన్జీఆర్ఐ నిపుణులు బ్యారేజీలను ఎప్పుడు పరిశీలిస్తారో క్లారిటీ లేదు. ఒకట్రెండు రోజులని అధికారులు చెబుతున్నారు. అయితే, ఆయా సంస్థలు మరోసారి జియోఫిజికల్, జియోటెక్నికల్, ఎన్డీటీ ఇన్వెస్టిగేషన్స్చేస్తేనే బ్యారేజీ పరిస్థితి ఏంటన్నది తెలుస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత త్వరగా టెస్టులు చేయించి రిపోర్టులను తయారుచేసేందుకు ఆయా సంస్థలను రిక్వెస్ట్చేస్తున్నారు.