
- రూ. కోటిన్నర విలువైన సొత్తు స్వాధీనం
- నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల వెల్లడి
నిర్మల్, వెలుగు: మీసేవ అడ్డాగా చేసుకుని రూ. కోట్లలో ఆన్ లైన్ బెట్టింగ్ దందా నిర్వహించే ముఠా ను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. భైంసా టౌన్ లో మీ సేవ సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ ఆజం ‘ ఆల్ ప్యానెల్ డాట్ కామ్’ బెట్టింగ్ యాప్ ద్వారా రూ. కోట్లలో దందాను కొనసాగిస్తున్నాడు. పలువురి వద్ద బ్యాంకు అకౌంట్లు తీసుకుని, నెలకు కొంత డబ్బు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు.
బెట్టింగ్ దందా తో వచ్చే డబ్బులను ఆ అకౌంట్లలో జమ చేస్తున్నాడు. ఇందుకు ఫేక్ ఐటీ రిటర్న్స్ తయారు చేశాడు. కాగా.. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడేవారికి కొన్ని డబ్బులను ఇస్తూ.. మిగతావి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ గోపీనాథ్ సిబ్బందితో వెళ్లి ఓవైసీ నగర్ లో నిందితుడు సయ్యద్ ఆజంను అదుపులోకి తీసుకుని రూ. 16.30 లక్షల నగదు, 384.38 గ్రాముల బంగారు ఆభరణాలు, 5. 5 గ్రాముల మూడు బంగారు బిస్కెట్లను, 21 భూమి డాక్యుమెంట్లను, 3 మొబైల్ ఫోన్లతో పాటు రూ. లక్ష విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులు, 8 ఏటీఎం కార్డులు, పాన్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసున్నారు.
వీటి విలువ రూ. కోటిన్నరకుపైగా ఉంటుంది. ముఠా దందాలో 8 మంది పట్టుబడగా.. వీరిలో నిర్మల్ కు చెందిన పులివెల్లి మణికంఠ, చిలమంతుల శివ చారి, లక్కా ల నరేశ్, కారేగాం ప్రణయ్, చేయని కళ్యాణ్, చిక్కాల వెంకటేశ్, భైంసాకు చెందిన రెహమాన్ సయ్యద్ ఇర్ఫాన్ ఉన్నారు. ప్రధాన సూత్రధారి ఇర్ఫాన్ పరారీలో ఉండడంతో ప్రత్యేక టీమ్ లతో గాలింపు చేపట్టారు.