
నిర్మల్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యం, రైతులు పడుతున్న అవస్థలపై నిర్మల్ జడ్పీ మీటింగ్ వాడివేడిగా సాగింది. మంగళవారం నిర్మల్ లోని దివ్య గార్డెన్ లో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. మీటింగ్‌కు జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షత వహించగా, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలు రేఖా నాయక్, విఠల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొదట సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, పెంబి జడ్పీటీసీ సభ్యురాలు జానుభాయి మాట్లాడుతూ...
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారన్నారు. తూకంలో మోసం జరుగుతోందని, తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. దీంతో రాజేశ్వర్ రెడ్డి మైకును అధికారులు కట్ చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ జడ్పీటీసీ మైక్ ను నేలపై విసిరేశారు. దీంతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి తీరును తప్పుపట్టారు.
Also Read : ఎంఐఎం చేతిలోనే బీఆర్ఎస్ కారు స్టీరింగ్ : బండి సంజయ్
రేఖానాయక్, జడ్పీటీసీ మధ్య వాగ్వాదం
ఖానాపూర్ నియోజకవర్గంలో పరిస్థితి మరింత దయనీయంగా తయారైందని పెంబి జడ్పీటీసీ సభ్యురాలు జానుభాయి ఆరోపించారు. రేఖా నాయక్ జోక్యం చేసుకొని వడ్ల కొనుగోలులో కోతలు ఎక్కడా జరగడం లేదని రైతులకు సమస్యలే లేవని పేర్కొనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. జాను బాయి మాట్లాడుతుండగా మైకును కట్ చేయడంతో ఆమె నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తోందన్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. రాజకీయాలకతీతంగా సమస్యలపై చర్చించాలే తప్ప తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని సూచించారు. మక్కజొన్న, ధాన్యం పంటల కొనుగోలు భారమైనప్పటికీ ప్రభుత్వం రైతుల కోసం ఆ భారాన్ని మోస్తుందన్నారు.