ఇటు చేరికలు.. అటు మీటింగ్​లు

ఇటు చేరికలు.. అటు మీటింగ్​లు
  •     పార్లమెంట్​ఎన్నికల్లో జోరందుకుంటున్న ప్రధాన పార్టీల ప్రచారం
  •     మహబూబాబాద్​లో మూడు పార్టీల అభ్యర్థులు ఓకే 
  •     ఖమ్మంలో కాంగ్రెస్​ మాత్రమే పెండింగ్. .రేపోమాపో ప్రకటన!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లోక్​ సభ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటు చేరికలు.. అటు మీటింగ్​లు జోరందుకున్నాయి. నోటిఫికేషన్​ మరో నాలుగు రోజుల్లో వెలువడనుండడంతో రోజురోజుకు జిల్లాలో ప్రధాన పార్టీల హడావుడి పెరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్​బీజేపీ, బీఆర్​ఎస్​ క్యాండిడేట్లు ఇప్పటికే ఫైనల్​ కావడంతో వారు ప్రచారం షురూ చేశారు. కాంగ్రెస్​ అభ్యర్థి​పేరును ఒకట్రెండు రోజుల్లో పార్టీ హైకమాండ్ ​ప్రకటించనుంది. మహబూబాబాద్​ పార్లమెంట్​ పరిధిలో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో వారు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు.  

సమావేశాలు..  పర్యటనలు.. 

ఖమ్మం లోక్​ సభకు కాంగ్రెస్​ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఫైనల్​ కాకున్నా సమావేశాలు మాత్రం జోరుగా నిర్వహిస్తున్నారు. శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస​రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని చుంచుపల్లిలో గల తన క్యాంప్​ ఆఫీస్​ లో ముఖ్యనేతలతో స్పెషల్​ మీటింగ్​ పెట్టారు. నియోజకవర్గంలోని మండలాల వారీగా ముఖ్య నేతలతో లోక్​ సభ ఎన్నికల ప్రచారంపై చర్చించారు. పార్టీ తరఫున అభ్యర్థిని ఎవరిని నిలబెట్టినా వారి గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. 

అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పార్టీ ప్రచారంలో భాగంగా కార్యకర్తలను కలుస్తున్నారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​రావు చాపకింద నీరులా ప్రచారాన్ని చేపడుతున్నారు. మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో మీటింగ్​లు పెడుతూ చేరికలపై స్సెషల్​ ఫోకస్​ పెట్టారు. బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇప్పటికే అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గ స్థాయీ ముఖ్య కార్యకర్తల మీటింగ్​లు పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.  

మహబూబాబాద్​ పార్లమెంట్​పరిధిలో జిల్లాలోని ఇల్లెందు, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్​ఎస్​ అభ్యర్థులు సమావేశాలతో ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్​ తరఫున పోటీ చేస్తున్న పోరిక బలరాం నాయక్​ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. మహబూబాబాద్​ పార్లమెంట్​ ఇన్​చార్జిగా వ్యవహరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఇటీవల ఇల్లెందులో రివ్యూ మీటింగ్ ​పెట్టారు. బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్, బీఆర్​ఎస్​ తరుపున పోటీ చేస్తున్న మాలోత్​ కవిత ప్రచారం ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటోంది. 

చేరికలు ఇలా.. 

భద్రాచలం నుంచి బీఆర్​ఎస్​ తరుపున గెలిచిన తెల్లం వెంకట్రావ్​ ఇటీవలే కాంగ్రెస్​ పార్టీలో చేరారు. రెండు రోజుల కింద భద్రాచలంలోని బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 
    
జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​తో పాటు పలువురు ముఖ్య నేతలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు.  ఇల్లెందు నియోజకవర్గంలోనూ పలు పార్టీలకు చెందిన నేతలు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. 
    
భద్రాచలం నియోజకవర్గంలోని దుమ్ముగూడెం మండలంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో మహిళలు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. మహబూబాబాద్ పార్లమెంట్​ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
    
కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్​ అడ్వకేట్​ జీవీకే మనోహార్​ ఆధ్వర్యంలో పలువురు ఖమ్మం పార్లమెంట్ ​క్యాండిడేట్ ​తాండ్ర వినోద్​రావు సమక్షంలో కాషాయ కండువా  కప్పుకున్నారు.