రాజకీయాలకు నేను దూరంగా ఉండటం.. తమ్ముడికి హెల్ప్ అవుతోందేమో

రాజకీయాలకు నేను దూరంగా ఉండటం.. తమ్ముడికి హెల్ప్ అవుతోందేమో

మెగా స్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ నా తమ్ముడు.. భవిష్యత్ లో తమ్ముడికి సపోర్ట్ ఇస్తానేమో’’ అని  కామెంట్ చేశారు. ‘‘నా తమ్ముడు లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి. రాజకీయాలకు నేను దూరంగా ఉండటం కూడా  నా తమ్ముడికి హెల్ప్ అవుతోందేమో’’ అని  చిరు పేర్కొన్నారు.  తాను పాలిటిక్స్ లో తమ్ముడికి మద్దతు ఇస్తున్నట్లు ఇంతకుముందు స్ట్రాంగ్ గా ఎక్కడా.. ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు అంకితభావం కలిగిన నాయకుడు అవసరమని, ఆ అవకాశాన్ని ప్రజలు పవన్ కు ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. బుధవారం చిరు కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ ఆ మూవీ యూనిట్ ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు.

ఆ డైలాగులు విని భుజాలు తడుముకుంటే చేసేదేం లేదు

గాడ్ ఫాదర్ సినిమాలో ప్రస్తుత పొలిటికల్ లీడర్స్ కు సంబంధించి ఎలాంటి సెటైరికల్ డైలాగ్లు లేవని  చిరంజీవి స్పష్టం చేశారు. ఈ సినిమాకు మాతృక అయిన ‘లూసిఫర్’ కథ ఆధారంగానే డైలాగులు ఉన్నాయన్నారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేనని పేర్కొన్నారు. 

హీరోయిన్  లేదు అనే ఆలోచన  రాదు

‘‘  కొత్త సినిమాలు చేయాలనే తపన నాకు ఎప్పుడూ ఉంటుంది.  లూసిఫర్ మూవీ గురించి నాకు మొదట చరణ్  చెప్పాడు.  లూసిఫర్ సినిమాలో సాంగ్స్ వింటే.. హీరోయిన్  లేదు అనే ఆలోచన  రాదు. ఈ సినిమా మీ ప్రేమ పొందుతుందనే నమ్మకం నాకు ఉంది. మాకు, మా సినిమాకి  దేవీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను.  ప్రతీ కథకి ఇక సోల్ ఉంటుంది. దానికి కనెక్ట్ అయితే చాలు. నా ఫ్యాన్స్ తో కలిసి నేను వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్న. ఈ మూవీలో ఫ్యామిలీ, పొలిటికల్ డ్రామా లు చాలా హై లో ఉంటాయి. ఇవి నాకు బాగా నచ్చాయి’’ అని చిరంజీవి తెలిపారు.  ‘‘ నాగ్ మూవీ కూడా రేపే వస్తుంది. ఇద్దరం కలిసి పండగ చేసుకుంటాం’’ అని చెప్పారు.

ఓటీటీ లో సత్యదేవ్ సినిమాలు చూశా

‘‘ పాండమిక్ టైంలో ఓటీటీ లో సత్యదేవ్ సినిమాలు చూశా. బ్లఫ్ మాస్టర్ మూవీ బాగా నచ్చింది. ఇంటికి పిలిచి మాట్లాడాను. అప్పుడే   సత్యదేవ్  తెలుగువాడు అని తెలిసింది. అతడు చాలా అద్భుత యాక్టర్’’ అని చిరంజీవి అన్నారు.  ‘‘ రీమేక్ మూవీస్ ని ఎప్పుడూ తక్కువ చేయకూడదు.ఒరిజినల్ కంటే రీమేక్ మూవీస్ లో చేయడమే కష్టం. ఎవరు ఏం కంపేర్ చేసినా నేను పట్టించుకోను. రీమేక్ లలో నేను ఎలా నటిస్తానో నా హిస్టరీ చూస్తే తెలుస్తది’’ అని చిరు కామెంట్ చేశారు.