
షాద్ నగర్ నిందితుల్ని నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదని మెగస్టార్ చిరంజీవి అన్నారు.
ఆ నలుగురి దుర్మార్గులతో పోటీ పెడితే పశువులు కూడా సిగ్గుపడతాయి. కృరమృగాలు సైతం ఆశ్చర్యపోతాయి. అలాంటి చిత్తకార్తె కుక్కలు మనమధ్య ఉన్నందుకు పశ్చాతప్పడాల్సిందే. అందుకే నీచుల్ని బహిరంగంగా ఉరితీయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
షాద్ నగర్ దారుణంపై చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బతుకుతోంది అనిపిస్తోంది. మనసు కలిచివేసిన ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాలా కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డుపై ఉరితీసినా తప్పులేదు.
త్వరగా నేరస్థులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే, త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి. అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవడైనా భయపడతాడు. ఆడపిల్లలు అందరికీ నేను చెప్పేది ఒక్కటే. మీ ఫోన్‌లో 100 నంబర్ స్టోర్ చేసి పెట్టుకోండి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌లో ‘హాక్ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ హుటాహుటిన మీ దగ్గరకు చేరుకుంటాయి. పోలీసు వారి సేవలను అలాగే వారి టెక్నాలజీని మీరు వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వీడియోలో చిరంజీవి అన్నారు.