ఆచార్య టికెట్ల ధరలను ప్రేక్ష‌కులే ఆద‌రిస్తున్నారు

ఆచార్య టికెట్ల ధరలను ప్రేక్ష‌కులే ఆద‌రిస్తున్నారు

కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే న‌టించిన ఈ సినిమా టికెట్ల రేట్ల‌ను పెంచుకునేందుకు ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌గా,  ఏపీ ప్ర‌భుత్వం కూడా అనుమ‌తి ఇచ్చింది. సినిమా రిలీజ్ నుంచి మొదటి పది రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య టికెట్ ధ‌ర‌ల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఆచార్య సినిమా విడుద‌ల‌కు సంబంధించి మీడియాతో చిరంజీవి ఇవాళ మాట్లాడారు. ప్ర‌పంచంలో క‌రోనాతో అన్ని రంగాలు కుంటుప‌డ్డాయన్నారు. అన్ని రంగాల్లాగే సినిమా రంగం కూడా న‌ష్ట‌పోయింద‌ని తెలిపారు. క‌రోనా వ‌ల్ల బ‌డ్జెట్‌పై వ‌డ్డీల‌కు వ‌డ్డీలు పెరిగాయ‌ని చెప్పారు. తాము ప్ర‌భుత్వాల‌కు 42 శాతం ప‌న్ను క‌డుతున్నామ‌ని.. ఈ క్ర‌మంలో టికెట్ ధ‌ర‌లు పెంచ‌మ‌ని ప్ర‌భుత్వాల‌ను వేడుకుంటే త‌ప్పేముంద‌న్నారు. వినోదాన్ని పంచుతున్నందుకు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని చిరంజీవి తెలిపారు. న‌టుల‌కు ప్రేక్ష‌కులు ఇంతా అని ఇస్తున్నారు.. అందులో త‌ప్పేముంద‌న్నారు చిరంజీవి. తెలంగాణలో ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ప్ర‌భుత్వం తెలిపిన సంగ‌తి తెలిసిందే. ఒక్కో టికెట్‌పై మ‌ల్టీప్లెక్స్ లో రూ.50 పెంచుకునేందుకు, సాధార‌ణ ఏసీ థియేట‌ర్ల‌లో రూ.30 పెంచుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చింది. దీంతోపాటు వారం రోజుల పాటు ఆచార్య ఐదో ఆట‌కు కూడా అనుమ‌తి ల‌భించింది.