క్వార్టర్స్ ఖాళీ చేయండని ముఫ్తీకి నోటీసులు

క్వార్టర్స్  ఖాళీ చేయండని ముఫ్తీకి నోటీసులు

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ప్రభుత్వ క్వార్టర్‌ను ఖాళీ చేయాల్సిందిగా జమ్మూ కశ్మీర్ అధికారులు నోటీసులు అందజేసింది. 'ఫెయిర్ వ్యూ గెస్ట్ హౌస్'గా పిలిచే ఈ బిల్డింగ్ ను 24 గంటల్లోగా ఖాళీ చేయాలని స్పష్టం చేశారు. ఖాళీ చేయని పక్షంలో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని అనంతనాగ్ డిప్యూటీ కమిషనర్ నోటీసులో తేల్చి చెప్పారు. ముఫ్తీతో పాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలను కూడా క్వార్టర్లు ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు పంపారు. 

2019లో జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత మాజీ సీఎంలకు ఇచ్చే వెసలుబాటులను కేంద్రం ఉపసంహరించుకుంది. ఈ క్రమంలోనే 2020లో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్ తమ అధికారిక నివాసాలను ఖాళీ చేశారు. ముఫ్తీ తండ్రి, దివంగత ముహమ్మద్ సయీద్ కూడా మాజీ సీఎం కావడంతో ఆమె ఆ వసతి గృహంలో ఉంటున్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రులు పదవీకాలం ముగిశాక వారికి కేటాయించిన  ప్రభుత్వ నివాసాలను ఖాళీ చేయాల్సిన అవసరం లేదు.