
హర్యానాలోని పానిపట్ జిల్లాలో బువానాలఖు గ్రామంలో 2022 నవంబర్ 2న జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఒక చిన్న గ్రామీణ సంఘటనలా కనిపించవచ్చు. కానీ, దాదాపు మూడున్నరేండ్ల నిరీక్షణ, ఒక పౌరుడి పట్టుదల తర్వాత సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు, ఈ సంఘటనను యావత్ భారత ప్రజాస్వామ్యంపైనే ఒక పెద్ద ప్రశ్నగా నిలబెట్టింది. ఒక వ్యక్తి తన హక్కు కోసం చేసిన పోరాటం, కేవలం ఒక గ్రామంలోనే కాదు, దేశ ఎన్నికల ప్రక్రియలోని లోపాలను ప్రపంచానికి చాటి చెప్పింది.
ఆ ఎన్నికల్లో తొలి ఫలితాల్లో కుల్దీప్ సింగ్ 313 ఓట్ల మెజారిటీతో విజేతగా ప్రకటించబడ్డారు. అధికారులు అధికారిక గెలుపు సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ ప్రత్యర్థి మోహిత్ కుమార్ ఈ ఫలితాలను వెంటనే సవాలు చేశారు. పోలింగ్ బూత్ నంబర్ 69లో తనకు వచ్చిన వందల ఓట్లు కుల్దీప్ ఖాతాలో చేరాయని, ఇది పేపర్ వర్క్‌లో కావాలనే చేసిన లోపమని ఆయన ఆరోపించారు.
ఈ కేసు స్థానిక పానిపట్ ట్రిబ్యునల్‌లో మొదలైంది. అక్కడ తీర్పు వ్యతిరేకంగా రావడంతో, ఆయన హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశే ఎదురవడంతో, చివరికి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మూడున్నరేండ్ల పాటు ఆయన పోరాటం ఆగలేదు. 2025 జులై 31న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సదరు పోలింగ్ బూత్‌లోని అన్ని ఈవీఎంలను తిరిగి లెక్కించారు. ఈ రీకౌంటింగ్ ప్రక్రియ వీడియో రికార్డింగ్, ఇరు పక్షాల న్యాయవాదుల సమక్షం, కోర్టు నియమించిన రిజిస్ట్రార్ పర్యవేక్షణలో జరిగింది.
రీకౌంటింగ్ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈవీఎంల లెక్కింపులో మోహిత్ కుమార్‌కు 1,051 ఓట్లు, కుల్దీప్ సింగ్‌కు 1,000 ఓట్లు వచ్చాయని తేలింది. అనూహ్యంగా 51 ఓట్ల తేడాతో మోహిత్ కుమార్ నిజమైన విజేతగా బయటపడ్డారు. ఈ సంఘటన తర్వాత ఆగస్టు 14న ఆయన సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదంతం భారత ప్రజాస్వామ్యం ఆత్మను నిలబెట్టిన న్యాయవ్యవస్థ విజయమా? లేక ఎన్నికల వ్యవస్థలోని లోపాలను బహిర్గతం చేసిన చేదు నిజమా? అనే తీవ్రమైన చర్చను రేకెత్తించింది. నిజానికి ఈ సంఘటనలో తప్పు ఈవీఎంలది కాదు, మాన్యువల్ గా పేపర్ వర్క్‌లో జరిగిన మోసం అని అర్థం అవుతుంది.
పేపర్ బ్యాలెట్‌తో రిగ్గింగ్‌లు, ఈవీఎంలపై అనుమానాలు!
భారతదేశంలో 1998 నుంచి ప్రయోగాత్మకంగా, 2004 నుంచి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగం మొదలైంది. దీనికి ప్రధాన కారణం అంతకుముందు బ్యాలెట్ పేపర్ల కాలంలో జరిగిన భారీ మోసాలు. బూత్ కాప్చరింగ్, బలవంతపు ఓటింగ్, ఒకే వ్యక్తి బండిల్‌గా ఓట్లు వేయడం వంటి అక్రమాలు చాలా ఎక్కువగా జరిగేవి. ఎన్నికల సంఘం అంచనాల ప్రకారం, 1980లు, 1990లలో కొన్ని కీలక నియోజకవర్గాల్లో నమోదైన ఓట్లలో దాదాపు 10-–15 శాతం ‘బోగస్’ ఓట్లుగా ఉండేవి.
రాజకీయ పార్టీల బలమైన మద్దతుదారులు, సాయుధ గూండాలు పోలింగ్ బూత్‌లోకి చొరబడి నిమిషాల వ్యవధిలో వేలాది బ్యాలెట్లను బ్యాలెట్ పెట్టెల్లో వేసే సంఘటనలు ఎన్నో. దీనివల్ల సాధారణ ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయలేని పరిస్థితి ఉండేది. అయితే ఈవీఎం వాడకం మొదలైన తర్వాత ఈ రకమైన బహిరంగ, హింసాత్మక మోసాలు గణనీయంగా తగ్గాయి. బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం, ఈవీఎంల ప్రవేశం దేశంలో ఎన్నికల మోసాలను సుమారు 3.5 శాతం తగ్గించిందని తేలింది.
ఈవీఎంల వాడకం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసి, వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గించింది. వాటి పనితీరు, నిల్వ సమయంలో భద్రత, ఓట్ల లెక్కింపులో పారదర్శకత లోపం వంటి విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. వాటిని ట్యాంపర్ చేయవచ్చని నిపుణులు, ప్రతిపక్షాలు తరచూ ఆరోపిస్తుంటాయి. కానీ మాన్యువల్‌గా పేపర్ వర్క్‌లోనే మోసం చేశారని హర్యానా సర్పంచ్ కేసే చెప్పుతోంది.
నమ్మకానికి అద్దం వీవీప్యాట్లు
ఈవీఎంలపై పెరుగుతున్న అనుమానాలను పారదోలడానికి, ఎన్నికల సంఘం 2014 నుంచి వీవీప్యాట్లు పద్ధతిని అమలు చేయడం ప్రారంభించింది. ఈ పద్ధతిలో ఓటరు బటన్ నొక్కిన వెంటనే ఒక కాగితం స్లిప్‌లో తాను ఎవరికి ఓటు వేశాడో ఏడు సెకన్ల పాటు కనబడుతుంది. ఈ స్లిప్ ఒక పెట్టెలో పడి ఓటు సరిగా నమోదయిందన్న నమ్మకాన్ని ఓటరుకు కల్పిస్తుంది. ఈ స్లిప్పులను ఎన్నికల వివాదాల సందర్భంలో తిరిగి లెక్కించడానికి వీలుంటుంది.
2019 సాధారణ ఎన్నికల నాటికి, దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్‌లలో వీవీప్యాట్ యంత్రాలను ఉపయోగించారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో రాండమ్‌గా కేవలం ఐదు బూత్‌ల స్లిప్పులను మాత్రమే లెక్కిస్తారు. ఇది ప్రజలకు, రాజకీయ పార్టీలకు తగినంత భరోసా కలిగించలేదని, విస్తృతంగా రీకౌంటింగ్ జరగాలని డిమాండ్లు పెరిగాయి. కనీసం 50 శాతం స్లిప్పులను లెక్కించాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నవి.
ప్రజాస్వామ్యానికి ముప్పు?
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఐదేండ్లకోసారి సుమారు 95 కోట్ల మంది ఓటర్లు తమ నాయకులను ఎన్నుకుంటారు. ఇంత పెద్ద స్థాయిలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడం ఒక మహత్తర కార్యం. కానీ హర్యానాలో మోహిత్ కుమార్ ఉదంతం చూపించినట్టుగా, ఒక తప్పు లెక్కింపు లేదా పేపర్‌వర్క్ లోపం వల్ల ప్రజల తీర్పే వక్రీకృతమవుతుందనే ప్రమాదం ఉంది. ఈ తప్పు కేవలం ఒక పొరపాటు మాత్రమేనా? లేక ఉద్దేశపూర్వకమా? ఒక వ్యక్తి తన హక్కు కోసం మూడున్నరేండ్లపాటు పోరాడకపోతే, ఈ సత్యం వెలుగులోకి వచ్చేదా? ప్రజాస్వామ్యానికి పునాది ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సింది ఎన్నికల సంఘమే!
పారదర్శకత రావాలి
హర్యానాలో మోహిత్ కుమార్ గెలుపు ఒక వ్యక్తి న్యాయం కోసం పోరాడిన గాథ మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయతపై పెరుగుతున్న అనుమానాలకు ప్రతిబింబం. సుప్రీంకోర్టు జోక్యం లేకపోతే ఒక గ్రామ ప్రజల తీర్పు వక్రీకృతమయ్యేది. అదే విధంగా, దేశవ్యాప్తంగా లక్షల ఓటర్ల తీర్పు వక్రీకృతమవకుండా కాపాడటం ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, పౌర సమాజం అందరి బాధ్యత. ‘ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేసే హక్కు కాదు. ఆ ఓటు సరిగా లెక్కించబడుతుందన్న నమ్మకం’. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే, ఎన్నికల వ్యవస్థలో పూర్తి పారదర్శకత తీసుకురావాలి. అప్పుడే ఓటరుకు తన ఓటు శక్తిపై, ఎన్నికల ఫలితాలపై పూర్తి విశ్వాసం ఏర్పడుతుంది.
- మేకల ఎల్లయ్య -