
- ‘కల్లుగీత కార్మిక సంఘం’ రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ గౌడ్
యాదగిరిగుట్ట, వెలుగు: కల్లు గీత వృత్తికి అండగా నిలిచిన కాటమయ్య (కంఠ మహేశ్వరుడు) స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకట రమణ గౌడ్ అన్నారు. ఆదివారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. గీత వృత్తి చేస్తూ కుటుంబాలను పోషిస్తున్న గౌడన్నలు సహజ మరణం పొందినా సరే.. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న గీత కార్మికుల ఎక్స్ గ్రేషియా నిధులను వెంటనే విడుదల చేయాలని, గౌడన్నల వృద్ధాప్య పింఛన్ రూ.4 వేలకు పెంచాలని, గీత వృత్తి సాగిస్తున్న కార్మికులకు మోటార్ సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ నెల 28న చౌటుప్పల్‌లో నిర్వహించే కల్లుగీత కార్మిక సంఘం జిల్లా మహాసభకు గౌడన్నలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయరాములు గౌడ్, వెంకటనర్సయ్య, మండల అధ్యక్షుడు కోల వెంకటేశ్ గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు హేమేందర్ గౌడ్, తుర్కపల్లి మండల అధ్యక్షుడు శ్రీరాంమూర్తి గౌడ్, యాదగిరిపల్లి సొసైటీ అధ్యక్షుడు సీస కృష్ణ గౌడ్, గుండ్లపల్లి సొసైటీ అధ్యక్షుడు ఉపేందర్ గౌడ్, మండల నాయకులు మచ్చ నరసింహ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.