పీక్​ అవర్స్​లో కిక్కిరిసిపోతున్న మెట్రో

 పీక్​ అవర్స్​లో కిక్కిరిసిపోతున్న మెట్రో
  • సర్వీసులు పెంచాలని డిమాండ్
  • రైళ్ల మధ్య టైమ్ తగ్గించామంటున్న అధికారులు
  • ప్రస్తుతం మూడు నిమిషాలకో ట్రైన్

హైదరాబాద్, వెలుగు : మెట్రో రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఆఫీసులకు వెళ్లే ఐటీ ఎంప్లాయ్స్, కోచింగ్​సెంటర్లకు వెళ్లే వాళ్లు పెరగడంతోపాటు కాలేజీలు, ఇతర పనులకు వెళ్లే వాళ్లు ఎక్కువగా మెట్రోనే ఆశ్రయిస్తున్నారు. డైలీ నాలుగు లక్షల మంది దాకా ప్రయాణిస్తున్నారు. అయితే పీక్​ అవర్స్​లో మెట్రో రైల్​ఎక్కాలంటే మినీ యుద్ధం చేయాల్సి వస్తోందని ప్యాసింజర్లు చెబుతున్నారు. సర్వీసులు పెంచాలని కోరుతున్నారు. పెరుగుతున్న ప్యాసింజర్ల సంఖ్య దృష్ట్యా రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచామని, ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. 

మునపటి పరిస్థితులు..

కరోనా తర్వాత మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో మునుపటి రద్దీ కనిపిస్తోంది. గతంలో కంటే సొంత వెహికల్స్ పెరగడంతో రోజూ ఎక్కడికక్కడ ట్రాఫిక్​జామ్ ​అవుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న రూట్లలో ఎక్కువ మంది మెట్రోనే ఎక్కుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రైన్ వచ్చిన వెంటనే తోసుకుంటూ ఎక్కేస్తున్నారు. త్వరగా చేరుకోవాలనే ఆలోచనతో కొంచెం ప్లేస్ ఉన్న ఇరుక్కుని మరీ ప్రయాణిస్తున్నారు. దీంతో మెట్రో ట్రైన్లు, స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఆఫీసులకు వెళ్లి, వచ్చే సమయాల్లో మెట్రో సర్వీసులు పెంచాలని ఐటీ ఉద్యోగులు, ఇతర ప్యాసింజర్లు కోరుతున్నారు. రాయదుర్గం నుంచి నాగోల్, ఎల్​బీనగర్ నుంచి మియాపూర్ రూట్లలో విపరీతమైన రద్దీ ఉంటోందని చెబుతున్నారు. ఆఫీసులు అయిపోయాక మెట్రోలో ఇంటికి వెళ్లాలంటే కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోందని ఐటీ, ఎంటర్​ప్రెన్యూర్స్ ఫోరం ఫౌండర్ శ్రీధర్ తెలిపారు. ట్రైన్‌ కోచ్​లు, సర్వీసులు పెంచాలని జనాల నుంచి మెట్రో సంస్థకు రిక్వెస్టులు వస్తూనే ఉన్నాయి. అయితే ప్యాసింజర్ల సౌకర్యం కోసం గతంలో ఐదు నిమిషాలకో రైల్ వస్తే, ఇప్పుడు మూడు నిమిషాలకు ఒకటి నడుస్తోందని మెట్రో అధికారులు చెబుతున్నారు. రెండు నిమిషాలకు కుదించేందుకు చర్చలు జరుగుతున్నాయంటున్నారు. రద్దీ ఎక్కువున్నప్పుడు  ప్యాసింజర్లు ఓపికతో మరో ట్రైన్ వచ్చేవరకు ఎదురుచూడాలని కోరుతున్నారు. 

రద్దీ ఉన్నా మెట్రోనే బెటర్

మాదాపూర్‌‌లోని ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా. బేగంపేట నుంచి డైలీ మెట్రోలోనే వెళ్తుంటా. ట్రాఫిక్‌లో గంటలు గంటలు ఉండే కంటే మెట్రోలో ఈజీగా వెళ్లిపోవచ్చు. మెట్రో జర్నీ అన్ని విధాలుగా  బాగుంటుంది. కానీ రష్ ఒకటే ప్రాబ్లం. మెట్రో అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. – హర్ష, ప్రైవేట్ ఎంప్లాయ్, బేగంపేట

రష్​ ఎక్కువగానే ఉంటోంది

పీక్ అవర్స్​లో రష్ ఎక్కువగానే ఉంటోంది. రైళ్ల ఫ్రీక్వెన్సీ పెంచాం. ప్రయాణికులు ఎక్స్ ట్రా కోచ్​లు అటాచ్ చేయాలని అడుగుతున్నారు. ఇప్పుడు రష్ ​ఉందని అటాచ్​ చేస్తే తర్వాత అవి ఉపయోగపడవు. అందుకే ట్రైన్ల మధ్య సమయాన్ని తగ్గించాం. ప్రస్తుతం 3 నిమిషాలకు ఒక ట్రైన్ నడుస్తోంది. ఇరుకుగా ఉన్న వాటిలో ఎక్కకుండా ప్యాసింజర్లు 3 నిమిషాలు వెయిట్​ చేస్తే మరో ట్రైన్​లో వెళ్లొచ్చు. – మెట్రో అధికారి, రాయదుర్గం స్టేషన్