వివాదాల సుడిగుండంలో సుంకిశాల!

వివాదాల సుడిగుండంలో సుంకిశాల!
  •     హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కారు 
  •     రూ.800 కోట్లు పెడ్తే పూర్తయ్యే ఎస్ఎల్​బీసీని పక్కనపెట్టి సుంకిశాల చేపట్టడంపై అప్పట్లోనే విమర్శలు
  •     ఈ స్కీంపై ఇప్పటికే  రూ.వెయ్యి కోట్లకుపైగా ఖర్చు
  •     అటు ఎస్ఎల్​బీసీ, ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో హైదరాబాద్ తాగునీటికి తిప్పలు 
  •     రూ.4 కోట్లతో పుట్టంగండి వద్ద తాత్కాలిక లిఫ్టులు

నల్గొండ, వెలుగు: హైదరాబాద్​ మహానగర తాగునీటి అవసరాల కోసం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల వద్ద నిర్మిస్తున్న మెట్రోవాటర్​ స్కీం రాజకీయ వివాదంలో చిక్కుకుంది. ఎస్ఎల్​బీసీ (శ్రీశైలం లెఫ్ట్​బ్యాంక్​ కెనాల్) నుంచి గ్రావిటీ ద్వారా హైదరాబాద్​కు వాటర్​ తీసుకునే అవకాశం ఉండగా, సుంకిశాల దండగ అని అప్పట్లో కాంగ్రెస్​ నేతలతో పాటు బీఆర్ఎస్​ నేతలూ విమర్శించారు. రూ.800 కోట్లు పెడ్తే పూర్తయ్యే ఎస్ఎల్​బీసీని పక్కనపెట్టి సుంకిశాల చేపట్టడం దండగ అని వాదించినా నాటి కేసీఆర్​ సర్కారు పెడచెవిన పెట్టింది. 

2021లో సుమారు రూ.2,200 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలు పెట్టగా, అగ్రిమెంట్​ ప్రకారం ఈ నెలాఖరులోగా పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసినా వివిధ కారణాల వల్ల  పెండింగ్​పడింది. ఇలా నాటి బీఆర్ఎస్​ సర్కారు తీరు వల్ల అటు ఎస్ఎల్​బీసీ, ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో ఇప్పుడు హైదరాబాద్​కు నీటిని తరలించేందుకు రూ.4  కోట్లతో పుట్టంగండి వద్ద  ఎమర్జెన్సీ మోటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 
 
రూ.800 కోట్లు ఇస్తే ఎస్​ఎల్​బీసీ పూర్తి..

శ్రీశైలం రిజర్వాయర్​ నుంచి  గ్రావిటీ రూపంలో నీటిని తరలిచేందుకు చేపట్టిన ఎస్​ఎల్​బీసీ టన్నెల్​ పనులు 2018 నుంచి ఆగిపోయాయి. మన్నెవారిపల్లి వద్ద మొదలైన టన్నెల్​–1 పనులు  34.33 కిలో మీటర్లు పూర్తికాగా, ఇంకా 9.6  కిలోమీటర్లు మిగిలిపోయాయి. నాటి బీఆర్ఎస్​ సర్కారు పట్టించుకోకపోవడంతో పనులు లేటయ్యి అంచనా వ్యయం రూ.3,152 కోట్లకు పెరిగింది.  గతేడాది వరకు రూ.2,359 కోట్ల వర్క్స్​ పూర్తి కాగా, కేవలం రూ.793 కోట్లు ఖర్చు పెడితే ఎస్ఎల్​బీసీ కంప్లీట్​ అయ్యేది. ఇది పూర్తయితే దిగువన ఉన్న నక్కలగండి, పెండ్లిపాకల, ఉదయసముద్రం బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులు నీళ్లతో కళకళలాడేవి. నల్గొండ జిల్లాలోని నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 600 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో పాటు  హైదరాబాద్ కు నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేది. 

సుంకిశాలతో నష్టమే.. 

ఉమ్మడి ఏపీలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్​ రెడ్డి టైంలోనే సుంకిశాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో పెద్ద పోరాటం జరిగింది. జిల్లాలో అప్పుడున్న కమ్యూనిస్టులు, టీడీపీ నేతలు సుంకిశాల నిర్మాణాన్ని వ్యతిరేకించారు. దీంతో అప్పటి ప్రభుత్వం నార్ల తాతారావు ఆధ్వర్యంలో టెక్నికల్​ కమిటీని నియమించగా, ఆ కమిటీ సుంకిశాల వల్ల లాభం లేదని తేల్చింది. దీనికి ప్రత్యామ్నాయంగా నాటి ప్రభుత్వాలు కొత్తగా ఏఎమ్మార్పీ(ఎలిమినేటి మాధవరెడ్డి) ని ప్రతిపాదించడంతో పాటు ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్ట్ పూర్తిచేయాలని నిర్ణయించాయి. 

కానీ తెలంగాణ వచ్చాక ఎస్​ఎల్​బీసీని నిర్లక్ష్యం చేసిన గత  కేసీఆర్​ సర్కారు.. హైదరాబాద్​ తాగునీటి అవసరాల పేరుతో సుంకిశాలను మళ్లీ తెరపైకి తెచ్చింది. నాగార్జునసాగర్ రిజర్వాయర్​​డెడ్​స్టోరేజీకి చేరుకున్నా, హైదరాబాద్​ సిటీకి తాగునీటి సమస్య రావొద్దనే ఉద్దేశ్యంతో సుంకిశాల నిర్మిస్తున్నట్టు గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చెప్పింది. దీనిని అప్పట్లో కాంగ్రెస్​ నేతలతోపాటు నల్గొండకు చెందిన బీఆర్ఎస్​ నేతలు కూడా వ్యతిరేకించారు. పైన ఎస్ఎల్​బీసీ నుంచి  గ్రావిటీ ద్వారా నీటిని తెచ్చుకునే అవకాశం ఉండగా, మోటర్లతో ఎత్తిపోసుకోవడం ఏమిటని విమర్శించారు. 

కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని కాంగ్రెస్​ నేతలు ఆరోపించారు. కానీ బీఆర్ఎస్​ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. 2021లో రూ.2,200 కోట్ల అంచనాలతో మేఘా కాంట్రాక్ట్​ సంస్థ ఈ వర్క్స్​దక్కించుకొని వెయ్యి కోట్ల విలువైన పనులు చేసింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్ఎల్​బీసీని పూర్తిచేయడంపై ఫోకస్​పెట్టింది. నిజానికి  సుంకిశాలకు మరో రూ.1,200 కోట్లు పెట్టి పూర్తిచేసినా.. కరెంట్​బిల్లుల కోసం ప్రతి నెలా రూ.13 కోట్లు పెట్టాల్సిందేనని, దీని వల్ల నష్టమే తప్ప లాభం లేదని కాంగ్రెస్​ నేతలు వాదిస్తున్నారు. దీంతో సుంకిశాల పరిస్థితి ఏమిటో అంతుచిక్కడం లేదు. 

సాగర్​లో మళ్లీ ఎమర్జెన్సీ మోటర్లు

బీఆర్ఎస్​ సర్కారు వల్ల అటు ఎస్ఎల్​బీసీ, ఇటు సుంకిశాల అందుబాటులోకి రాకపోవడంతో తాజాగా హైదరాబాద్​తాగునీటి అవసరాల కోసం రూ.4  కోట్లతో పుట్టంగండి వద్ద  ఆఫీసర్లు ఎమర్జెన్సీ మోటర్లు ఏర్పాటు చేశారు.  ప్రస్తుతం సాగర్​లో 509 అడుగుల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం కృష్ణాలో  తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు తెలంగాణకు, 5.5 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు కేఆర్ఎంబీ అనుమతిచ్చింది. ఈ లెక్కన సాగర్​ నుంచి ఏపీ వాటర్​ డ్రా చేస్తే  నీటి మట్టం 506 అడుగులకు పడిపోతుంది. 

అప్పుడు  హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు తాగునీటి అవసరాలకు ఉన్న లిఫ్టులకు నీళ్లందే పరిస్థితి ఉండదు. దీంతో  రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు ఖర్చు పెట్టి పీఏపల్లి వద్ద 600 హెచ్​పీ కెపాసిటీ కలిగిన ఐదు మోటర్లు,300 హెచ్​పీ కలిగిన మరో 5 మోటర్లు ఏర్పాటు చేస్తున్నది. వీటిద్వారా సాగర్​ నీటి మట్టం 500 అడుగులకు పడి పోయేదాక నీటిని తోడుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఎల్​బీసీ పూర్తికావడమే నల్గొండ, హైదరాబాద్​తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్​ఎల్​బీసీ పూర్తయితే సుంకిశాల అవసరం లేదు

కోట్ల విజయభాస్కర్​రెడ్డి టైంలో సుంకిశాలకు వ్యతిరేకంగా నల్గొండ జిల్లాలో ఉద్యమం జరిగింది. నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు ఇవ్వకుండా హైదరాబాద్​కు నీళ్లు తీసుకుపోవద్దని ప్రతిపక్షాలు పోరాటం చేశాయి. ప్రత్యామ్నాయంగా ఏఎమ్మార్పీ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రపోజ్ చేసి,  పుట్టంగండి దగ్గర లిఫ్ట్​ పెట్టినం. దాంతో సిటీకి తాగునీరు, నల్గొండ జిల్లాలో మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు, 584  గ్రామాలకు మంచినీళ్లు అందించాం. 

బీఆర్ఎస్​ప్రభుత్వం మళ్లీ సుంకిశాల చేపట్టింది. అది పూర్తయి కృష్ణా నీటిని ఎత్తిపోస్తే  కోదండాపూర్​కు చేరుతయి. ఎస్ఎల్​బీసీ పూర్తయితే కూడా అదే కోదండపూర్​కు వాటర్​ గ్రావిటీ ద్వారా వస్తయ్​. రూ.50 కోట్లతో  ఈ కెనాల్​పనులు కూడా పూర్తయ్యాయి. అప్పుడు సుంకిశాలతో ఎలాంటి అవసరం ఉండదు. పైగా నక్కలగండి, పెండ్లిపాకల రిజర్వాయర్ల వద్ద 10 టీఎంసీల నీటిని స్టోరేజీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కరెంట్​ బిల్లుల భారం కూడా తప్పుతుంది. 


- గుత్తా సుఖేందర్​ రెడ్డి,
శాసన మండలి చైర్మన్​