మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు సహా 18మంది మృతి

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం.. ఆరుగురు భారతీయులు సహా 18మంది మృతి

మెక్సికోలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నయారిట్​ రాష్ట్రంలో ఓ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు భారతీయులు సహా 18మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. 23మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. నయారిట్​ రాష్ట్ర రాజధాని టెపిక్​కు సమీపంలోని బరాంక బ్లాంకాలో స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 


ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42మంది ఉన్నట్టు సమాచారం. టిజువానా ప్రాంతానికి బస్సు వెళుతుండగా.. లోయలో పడిపోయింది. మృతుల్లో భారతీయులు, డొమెనిక్​ రిపబ్లిక్​, ఆఫ్రికెన్​ దేశస్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మృతదేహాలను వెలికితీశారు. కాగా.. మృతదేహాలను గుర్తించేందుకు కష్టంగా ఉందని తెలుస్తోంది.  మరోవైపు మెక్సికో బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేప్టటారు. మలుపులు ఉన్న రోడ్డుపై డ్రైవర్ అతివేగంగా బస్సు నడపడటే మెక్సికో రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.  త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. బస్సులో ఉన్నవారందరూ వలస వచ్చిన వారని తెలుస్తోంది. మరణించిన వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నారని సహాయక సిబ్బందిలో ఒకరు తెలిపారు.