
- స్టూడెంట్లు లేకపోవడంతో తప్పిన ప్రమాదం
వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్‌లో ఆదివారం రాత్రి పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి. ఈ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళ్తే... ఎంజీఎం హాస్పిటల్ ఆవరణలోనే నర్సింగ్ హాస్టల్ బిల్డింగ్ ఉండగా.. అందులో స్టూడెంట్లకు క్లాస్‌లు సైతం జరుగుతున్నాయి. ఈ హాస్టల్‌లో సుమారు 150 మంది వరకు ఉంటున్నారు. హాస్టల్‌లోని ఓ క్లాస్‌రూంలో ఆదివారం రాత్రి ఒక్కసారిగా పైకప్పు పెచ్చులు ఊడి పడ్డాయి.
రాత్రి టైం కావడం, క్లాస్‌రూంలో స్టూడెంట్లు, టీచర్లు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇటీవల వారం రోజుల పాటు వర్షాలు పడడంతో బిల్డింగ్ స్లాబ్‌పైకి నీరు చేరి పెచ్చులు ఊడి పడ్డాయని భావిస్తున్నారు. ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో హాస్టల్‌ను ఖాళీ చేయాలని, స్టూడెంట్లను మరో బిల్డింగ్‌లోకి తరలించాలని రెండేండ్ల కిందే ఆఫీసర్లు భావించారు. కలెక్టర్ సత్య శారద సైతం హాస్టల్‌ను ఖాళీ చేయించి ఓ సిటీ ప్రాంతంలోకి తరలించాలని నిర్ణయించారు.
కానీ కొందరు స్టూడెంట్లు ఆందోళనకు దిగడంతో బిల్డింగ్ ఖాళీ చేసే అంశాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ విషయంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ కిశోర్ మాట్లాడుతూ హాస్టల్ బిల్డింగ్ శిథిలావస్థకు చేరిన విషయాన్ని గతంలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. హాస్టల్‌ను ఖాళీ చేయించే ప్రయత్నం చేసినా స్టూడెంట్లు ఒప్పుకోలేదన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఆఫీసర్లకు వివరించి స్టూడెంట్లకు కేఎంసీలో వసతి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యశారద స్టూడెంట్లను వెంటనే మరోచోటుకు తరలించాలని ఆదేశించారు.