ఉపాధి కూలీల వినూత్న పెళ్లి వేడుక..మామిడి తోట వేదిక.. మామిడాకులే తలంబ్రాలు.. ఉపాధి కూలీలే బంధుమిత్రులు.. తాంబాలం చప్పుడే బాజాబజంత్రీలు.. మటన్ బగారా, మక్క గుడాలతో విందు.. జగిత్యాల జిల్లా పోరండ్ల లో ఉపాధి హామీ కూలీ జంట పెళ్లి రోజును వినూత్నంగా నిర్వహించారు తోటి కూలీలు..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..
జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల, బాలపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 225 మంది ఉపాది హామీ కూలీలు పనులకు హాజరయ్యారు. పనులు ముగిసిన తర్వాత మాట్లాడుకుంటుండగా.. పోరండ్ల కు చెందిన బుచ్చిరెడ్డి, సత్తమ్మ దంపతుల పెళ్లి రోజు చర్చకు వచ్చింది. అదే సమయంలో వారి పెళ్లి రోజు వేడుకలను నిర్వహించాలని ఉపాధి కూలీలు నిర్ణయించారు.
అనుకున్నదే ఆలస్యం.. పెళ్లిరోజు వేడుకలకు అన్ని ఏర్పా్ట్లు చేశారు. మామిడి తోటలో గౌరి పూజనుంచి అరుంధతి నక్షత్రం చూపించే వరకు పెళ్లి తంతు అంతా సవ్యంగా జరిపించారు. ఇక విందు విషయంలో కూడా ఏమాత్రం తగ్గలేదు ఉపాధి కూలీలు. తెలంగాణ స్టైల్ లో బగారా అన్నం, మటన్ కర్రీ, మక్క గుడాలతో రుచికరమైన పెళ్లి భోజనాలు తయారు చేసి వడ్డించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే పెళ్లికి హాజరైన కూలీలందరూ కట్న కానుకలు సమర్పించడం ఈ పెళ్లివేడుకలో హైలైట్.ప్రస్తుతం ఈ పెళ్లి తతంగమంతా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
