వీవీఐపీల హెలికాప్టర్.. MI-17V-5

వీవీఐపీల హెలికాప్టర్.. MI-17V-5

 

  • కొండలు, సముద్రాలు, ఎడారి.. ఎక్కడైనా సై
  • పైలట్ ఫ్రెండ్లీ సౌకర్యాలతో ప్రత్యేకంగా తయారు

ఎంఐ-17వీ-5 హెలికాప్టర్లను మిలటరీలో రవాణా కోసం ఉపయోగిస్తారు. రష్యాకు చెందిన కాజాన్ హెలికాప్టర్స్ సంస్థ వీటిని తయారుచేస్తోంది. 36 మందిని తీసుకెళ్లగలిగే ఈ హెలికాప్టర్ ను నడపడానికి మరో ముగ్గురు సిబ్బంది ఉంటారు. ఇది మొత్తం 13వేల కిలోల బరువును క్యారీ చేస్తుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో 1065 కిలోమీటర్లు నాన్ స్టాప్ గా ప్రయాణించే కెపాసిటీ దీనికి ఉంది. ప్రపంచంలోని అడ్వాన్స్‌‌డ్​ టెక్నాలజీ ఉన్న హెలికాప్టర్లలో ఇదొకటి. సరుకు, బలగాలు, ఆయుధాల రవాణాతో పాటు సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్లలో సమర్థంగా పనిచేస్తాయి.

ఎవరెవరు వాడుతున్నారు?
2013లో ఎంఐ 17 వీ5 రకానికి చెందిన 71 హెలికాప్టర్ల కోసం రష్యా కంపెనీకి మన ప్రభుత్వం ఆర్డర్​ పెట్టింది. అదే ఏడాది 12 ఎంఐ రకం హెలికాప్టర్లను కంపెనీ డెలివరీ చేసింది. 2018 నాటికి అన్ని హెలికాప్టర్లు మన దేశానికి చేరినయ్. వీటి రిపేర్లు, ఓవర్​ హాలింగ్ కోసం ఐఏఎఫ్​ ప్రత్యేకంగా ఓ సెంటర్​ను ఏర్పాటు చేసింది. అఫ్గాన్​ ఆర్మీ 2014 నుంచి, రష్యా రక్షణ శాఖ కూడా ఈ హెలికాప్టర్లను వాడుతోంది. 

స్పెషల్ ఫీచర్లు
సముద్రాలు, ఎడారుల పైన ఉండే ప్రతికూల వాతావరణంలో కూడా సమర్థంగా ప్రయాణం చేసే స్పెషాలిటీ ఈ హెలికాప్టర్​ సొంతం. ఈ హెలికాప్టర్ల క్యాబిన్లో పన్నెండున్నర చదరపు మీటర్ల విశాలమైన స్పేస్ ఉంటుంది. బలగాలుగానీ, సామాగ్రిగానీ వేగంగా ఎక్కించడానికి, బయటికి తీయడానికి డోర్లు, రియర్ ర్యాంప్ అనుకూలంగా ఉంటాయి. పారాచూట్ ఎక్విప్ మెంట్, సెర్చ్ లైట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ తో పాటు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. స్లింగ్ ద్వారా ఈ హెలికాప్టర్ కు 4,500 కిలోల కార్గోను మోసుకెళ్లే కెపాసిటీ ఉంది. గ్లాస్ కాక్ పిట్ ఉంటుంది. ఇందులో అన్నిరకాలుగా పనిచేసే నాలుగు డిస్ ప్లేలు ఉంటాయి. నైట్ విజన్ ఎక్విప్ మెంట్, వాతావరణం తెలిపే రాడార్, ఆటోపైలట్ సిస్టంలాంటివి ఉండడం వల్ల పైలట్స్ పై ఒత్తిడి బాగా తగ్గుతుంది. మనదేశం అవసరాలకోసం తయారుచేసిన ఎంఐ రకం హెలికాప్టర్లలో ప్రత్యేకంగా నేవిగేషన్, సమాచారాన్ని చూపించే డిస్ ప్లేలను ఏర్పాటు చేశారు.

ఇది సాయుధ హెలికాప్టర్
రవాణాకే కాదు యుద్ధంలోనూ పోరాడే సమర్థత ఎంఐ-17వీ-5 హెలికాప్టర్లకు ఉంది. వీటిలో ష్టర్మ్-5 మిసైల్స్ ప్రయోగించే ఫెసిలిటీ ఉంటుంది. ఎస్-8 రాకెట్స్, 23ఎంఎం మెషీన్ గన్, పీకేటీ మెషీన్ గన్స్, ఏకేఎం సబ్ మెషీన్ గన్స్ అన్నింటినీ హెలికాప్టర్ నుంచే ఉపయోగించవచ్చు. ఆయుధాలను ఫిక్స్ చేసి ఫైర్ చేయడానికి వీలుగా ఎనిమిది పోస్ట్ లు ఉంటాయి. దీంతో హెలికాప్టర్లో నుంచే సైనికులు కింద ఉన్న శత్రువులను, ఆర్మీ వెహికల్స్ ను, నిర్మాణాలను, ఫైరింగ్ పోస్టులను, ఇతర కదులుతున్న టార్గెట్లపై కూడా ఫైర్ చేయొచ్చు. 

కీలక విడిభాగాలు దెబ్బతినకుండా మెటల్ 
ప్లేట్స్ తో ప్రొటెక్షన్ ఉంటుంది. మెషిన్ గన్ ను ఉపయోగించేవాళ్లు కూడా సేఫ్ గా ఉండేలా గన్ పోస్ట్ కు కూడా ఆర్మర్ ప్రొటెక్షన్ ప్లేట్స్ ఉంటాయి. హెలికాప్టర్ ఫ్యూయల్ ట్యాంక్ కూడా దానికదే సెల్ఫ్ సీల్ అయ్యే ఏర్పాటుంది. ఇంజన్ ఎగ్జాస్ట్ ను నిరోధించేలా ఇన్ ఫ్రారెడ్ సప్రెసర్స్, ఫ్లేర్స్ డిస్పెన్సర్, జామర్ లాంటివి ఉంటాయి.