
మైక్రోసాప్ట్ సంస్థ అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కు సంబంధించిన ఓ కీలక ప్రాజెక్టును సొంతం చేసుకుంది. దీని విలువ 10 బిలియన్ డాలర్లు. అమెరికా మిలిటరీ వ్యవస్థలోని క్లౌడ్ కంప్యూటింగ్‌ను ఆధునికీకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీన్ని కైవసం చేసుకోవడానికి అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఐబిఎం, ఒరాకిల్, గూగుల్ సంస్థలు పోటీపడ్డాయి. మొదట ఈ ప్రాజెక్టు అమెజాన్‌కు దక్కే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకోవడంతో ప్రాజెక్టు ఎవరికి అప్పగించాలనే విషయంలో మార్పులు జరిగాయి. ఆయనకు అమెజాన్‌కు మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో JDగా పిలుస్తున్న ఈ ప్రాజెక్టు దక్కకుండా ట్రంప్ అడ్డుకున్నారని ఓ అధికారి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుని నిర్వహించేందుకు సమర్థవంతమైన సంస్థలు చాలా ఉన్నాయని ఓ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఈ ప్రాజక్టులో భాగంగా కావచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇటీవల ఈ ప్రాజెక్టు నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల సర్వర్లు, సదుపాయాలను మైక్రోసాఫ్ట్ సమకూర్చుకుంది. మరోవైపు ఈ ప్రాజెక్టుని దక్కించుకునే పోటీ నుంచి గూగుల్ ముందుగానే తప్పుకుంది.