ఇండ్ల నుంచే లంచ్ బాక్స్​లు...సర్కార్​ బడుల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెడ్తున్నరు

ఇండ్ల నుంచే లంచ్ బాక్స్​లు...సర్కార్​ బడుల్లో మధ్యాహ్న భోజనం బంద్ పెడ్తున్నరు
  • బకాయిలపై సమ్మె బాటలో కార్మికులు​
  • కొత్తగూడెం జిల్లాలో వందకు పైగా బడుల్లో 
  • మిడ్​ డే మీల్స్​ నిలిపివేత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సర్కారు నుంచి పెండింగ్ బిల్లులు రాకపోవడం, పెంచిన గౌరవ వేతనం అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు పలు జిల్లాల్లో సమ్మెకు దిగుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నాటికి ఏకంగా100 స్కూళ్లలో మిడ్​డే మీల్స్​ బంద్​ పెట్టారు. బకాయిలు చెల్లిస్తేనే వంట చేస్తామని  కార్మికులు భీష్మించడం, ఆఫీసర్లు కూడా పట్టించుకోపోవడంతో పిల్లలు పస్తులుంటున్నారు. చేసేది లేక చాలా మంది స్టూడెంట్లు ఇండ్ల నుంచే లంచ్​ బాక్సులు తెచ్చుకుంటున్నారు. 

కొత్తగూడెం జిల్లాలో సమ్మె ఎఫెక్ట్​.. 

రాష్ట్రవ్యాప్తంగా 26వేలకు పైగా సర్కారు బళ్లలో  54,201 మంది మధ్యాహ్నభోజన కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఒక్కో కార్మికునికి నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నారు. ఇందులో రూ.600 కేంద్రం వాటా కాగా,  రాష్ట్రం ఇస్తున్నది రూ.400 మాత్రమే. దీంతో కనీస వేతనాల కోసం కొన్నేండ్లుగా కార్మికులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ వేదికగా మిడ్​డే మీల్స్​ కార్మికుల గౌరవవేతనాన్ని రూ.2వేలకు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఏడాది గడిచినా గౌరవ వేతనాలు పెంచకపోవడం, గత విద్యాసంవత్సరానికి సంబంధించిన బిల్లులు, వేతన బకాయిలు చెల్లించకపోవడంతో మిడ్​ డే కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె బాట పడ్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు రూ. 2 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని వర్కర్స్​ అంటున్నారు.  గత  జనవరిలో  దాదాపు రూ. 94 లక్షలు సర్కారు రిలీజ్​ చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు. తీరా దాదాపు రూ. అరకోటికి పైగా ఫండ్స్​ ట్రెజరీలో రిజెక్ట్​ అయ్యాయి. దీంతో బిల్లులపై అయోమయం నెలకొంది.  ఈక్రమంలో కార్మికులు వారం రోజులుగా సమ్మె చేస్తున్నారు. శుక్రవారం వరకు ఏకంగా 100కు పైగా స్కూళ్లలో మిడ్​డే మీల్స్​ బంద్​ పెట్టారు. చాలా స్కూళ్లలో వారం రోజులుగా మధ్యాహ్న భోజనం వండకపోవడంతో పిల్లలు ఇండ్ల నుంచి బాక్సులు తెచ్చుకుంటున్నారు. 

రూ. 4 లక్షలు అప్పు చేశాం 

సర్కారు నుంచి బిల్లులు రాక అప్పు చేసి మరీ పిల్లలకు వండి పెడ్తున్నం. ఇప్పటి వరకు దాదాపు రూ. 4 లక్షల అప్పులయ్యాయి. వడ్డీలు పెరుగుతున్నాయే తప్ప బిల్లులు మాత్రం రావడం లేదు. కొత్త అప్పుల కోసం పోతే సేట్లు ఇస్తలేరు. ఏం చేయాలో అర్థం అయితలేదు.  బిల్లుల బకాయిలను ప్రభుత్వం వెంటనే రిలీజ్​ చేయకపోతే మా బతుకులు ఆగమవుతయ్​.   - రాములమ్మ, మిడ్​ డే మీల్స్​ వర్కర్​, పాత కొత్తగూడెం తెలంగాణ స్కూల్​, కొత్తగూడెం 

 ఆందోళనలు ఉధృతం చేస్తం

కోట్లలో బకాయిలున్నా సర్కారు మాత్రం బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చేస్తోంది.  కులాల వారీగా బిల్లులు ఇస్తుండడంతో ఎంత మొత్తం వస్తున్నాయో, ఎంత పోతున్నాయో అర్థం కావడం లేదు.  మిడ్​ డే మీల్స్​ వర్కర్లంతా పేద కుటుంబాలకు చెందినవారే. అప్పులు చేసి వంటలు చేస్తే సర్కారు బిల్లలు ఇవ్వక నష్టపోతున్నారు. వడ్డీలకు వడ్డీలు మీదపడ్తున్నాయి. అందుకే  వారం రోజులుగా సమ్మె చేస్తున్నాం. సర్కారు స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
- విజయలక్ష్మి, మిడ్​ డే మీల్స్​ వర్కర్స్​ యూనియన్​ జిల్లా అధ్యక్షురాలు