మహిళా సంఘాలకు అప్పగిస్తున్నా నో రిజల్ట్​

మహిళా సంఘాలకు అప్పగిస్తున్నా నో రిజల్ట్​

 

  • సద్ది కట్టుకొని బడికి..
  • సర్కారు బువ్వ పెట్టకపోవడంతో ఇండ్ల నుంచే బాక్సులు 4నెలలుగా అందని బిల్లులు
  • గిట్టుబాటు కాక తప్పుకుంటున్న ఏజెన్సీలు
  • మహిళా సంఘాలకు అప్పగిస్తున్నా నో రిజల్ట్​

వరంగల్‍, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బళ్లలో మధ్యాహ్న భోజనం నిలిచిపోతుండడంతో పిల్లలు ఇండ్ల నుంచి సద్దులు తెచ్చుకుంటున్నారు. స్కూళ్లలో వంటచేసే  ఏజెన్సీలకు ఏండ్ల తరబడి మెస్​చార్జీలు పెంచకపోవడం, నాలుగైదు నెలలుగా బిల్లులివ్వకపోవడంతో నిర్వాహకులు తప్పుకుంటున్నారు. వంట బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగిస్తున్నా పైసల్లేక వాళ్లు కూడా చేతులెత్తేస్తున్నారు. కొన్ని చోట్ల బిల్లుల  కోసం నిర్వాహకులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతో టీచర్లే వంటలు చేస్తుండగా, వీలు కాని చోట్ల పిల్లలే ఇండ్ల నుంచి టిఫిన్​బాక్సులు తెచ్చుకోవడమో, ఇండ్లకు వెళ్లి తిని రావడం చేస్తున్నారు. 

నాలుగు నెలలుగా..ఆగిన బిల్లులు 

రాష్ట్ర వ్యాప్తంగా 26,040 సర్కారు బడుల్లో 21.50 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. డ్రాపౌట్లను తగ్గించేందుకు అన్ని ప్రైమరీ, హైస్కూళ్లలో 'మిడ్‍ డే మీల్స్'  పథకం అమలుచేస్తున్నారు. ప్రైమ రీ స్కూల్స్​లో ఒక్కో విద్యార్థికి రూ.4.97 చొప్పున, హైస్కూల్స్​లో రూ.7.45 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు అనుగుణంగా మీల్స్​ రేట్లు ప్రైమరీ స్కూల్​లో ఒక్కో స్టూడెంట్​కు రూ.10, హై స్కూల్లో రూ.13 చెల్లించాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం వారి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. అదీగాక  నెలనెలా బిల్లులు చెల్లించడం లేదు. కొన్ని జిల్లాల్లో లాస్ట్ అకడమిక్‍ ఇయర్‍ జనవరి, ఫిబ్రవరితో పాటు ఈ ఏడాది మే, జూన్‍, జులై నెలల బిల్లులు.. ఇంకొన్ని జిల్లాల్లో గడిచిన మూడు నెలల బిల్లులను చెల్లించలేదు.

చాలా జిల్లాల్లో నిలిచిపోతున్న మిడ్​డే మీల్స్​ 

నాగర్​కర్నూల్, కామారెడ్డి లాంటి​ జిల్లాల్లో ఇప్పటికే 200కు పైగా స్కూళ్లలో మిడ్​డే మీల్స్​ నిలిచిపోగా, డ్వాక్రా మహిళలకు అప్పగించారు. సంగారెడ్డి జిల్లాలోని 300పైగా స్కూళ్లలో, మెదక్​ జిల్లాలోని 200కు పైగా స్కూళ్లలో మిడ్​డే మీల్స్ నిలిచిపోయాయి. దీంతో అక్కడి అధికారులు ‘అక్షయ పాత్ర’ స్వచ్ఛంద సంస్థకు ఫుడ్ సప్లై బాధ్యత అప్పగించారు. మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయక్ పల్లి హైస్కూల్​లో 17 రోజులుగా వంట బంద్ చేశారు. పాఠశాల హెచ్ఎం చొరవ తీసుకొని 13 రోజుల పా టు వంట చేయించి స్టూడెంట్స్ కు భోజనం పెట్టారు.