సర్కారు బిల్లులివ్వక ఆగిన మిడ్​ డే మీల్స్​ 

సర్కారు బిల్లులివ్వక ఆగిన మిడ్​ డే మీల్స్​ 
  • అప్పులు తెచ్చి వండి పెడ్తున్నా బిల్లులిస్తలేదని ఆవేదన
  • తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద విద్యార్థులు  
  • ఇంటి నుంచే సద్దులు తెచ్చుకుంటున్నరు
  • మధ్యాహ్నం ఇంటికెళ్లి తింటున్న ఇంకొందరు
  • మహిళా సంఘాలతో వంట చేయించాలంటూ హెచ్​ఎంలపై ఆఫీసర్ల ఒత్తిళ్లు

వెలుగు, నెట్​వర్క్​: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మిడ్​ డే మీల్స్​ కార్యక్రమం బంద్​ అవుతోంది. డ్రాపవుట్లు తగ్గించడం, నిరుపేద కుటుంబాల్లోని పిల్లలను చదివించడం కోసం తీసుకొచ్చిన ఈ పథకం.. రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం కారణంగా ఆగిపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని 800కుపైగా స్కూళ్లలో పిల్లలకు మధ్యాహ్న భోజనం పెడ్తలేదు. మెదక్​, సంగారెడ్డి, మహబూబ్​నగర్, నాగర్​కర్నూలు, నిజామాబాద్​ వంటి జిల్లాల్లో మధ్యాహ్న భోజనం ఇప్పటికే బంద్​ అయిపోయింది. అప్పులు తెచ్చి 
వండి పెట్టినా సర్కారు బిల్లులు చెల్లించట్లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచట్లేదని చెప్తున్న ఏజెన్సీలు.. ఇకపై తాము పథకంలో కొనసాగలేమని చేతులెత్తేస్తున్నాయి. దీంతో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది పిల్లలు ఇంట్ల నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో మహిళా సంఘాల గ్రూపులతో వంట చేయించాలని హెచ్​ఎంలపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కొన్ని చోట్ల చేస్తున్నా.. మరికొన్ని చోట్ల చేయలేమని మహిళా సంఘాలు చెప్పేస్తున్నాయి.

బిల్లులు ఇయ్యట్లే.. రేట్లు పెంచట్లే..

రాష్ట్రంలో 26,040 గవర్నమెంట్, లోకల్​ బాడీ స్కూళ్లలో  21.50 లక్షల మంది స్టూడెంట్లు చదువుతున్నారు. అన్ని సర్కారు బడుల్లోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిడ్​​డే మీల్స్​ను​ అమలు చేస్తున్నాయి. మధ్యాహ్న భోజనాన్ని వండి..వడ్డించే బాధ్యతను రాష్ట్ర సర్కారు.. ప్రైవేట్​ ఏజెన్సీలకు అప్పగించింది. ప్రైమరీ స్కూళ్లలో ఒక్కో స్టూడెంట్​కు రూ.4.97, హై స్కూళ్లలో రూ.7.45 చొప్పున చెల్లిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ధరలకు తగ్గట్టుగా భోజనం రేట్లను పెంచాలని సవరించాలని కొన్నేళ్లుగా ఏజెన్సీలు డిమాండ్​​ చేస్తున్నాయి.  ప్రైమరీ స్కూల్​లో ఒక్కో స్టూడెంట్​కు రూ.10, హై స్కూల్​లో రూ.13 చొప్పున చెల్లించాలని కోరుతున్నాయి. కానీ ప్రభుత్వం వీరి డిమాండ్లను పట్టించుకోవడం లేదు. నెలనెలా బిల్లులు కూడా చెల్లించట్లేదు. కరోనా తర్వాత సెప్టెంబర్​లో స్కూళ్లు స్టార్ట్​ అయినా.. ఇప్పటిదాకా 2 నెలల బిల్లులను ఏజెన్సీలకు ఇవ్వలేదు. వంటమనిషి, హెల్పర్​కు కార్మిక చట్టం ప్రకారం నెలకు రూ.10,500 చొప్పున ఇవ్వాల్సి ఉన్నా.. రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో తమ వల్ల కాదంటూ ఏజెన్సీలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి.

హెచ్​ఎంలు, సర్పంచులే కడ్తున్నరు

నాగర్​కర్నూల్​ జిల్లాలో 827 స్కూళ్లుండగా 100కుపైగా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది. మహిళా సంఘాలు ముందుకు రాకపోవడంతో విద్యార్థులు ఇండ్ల నుంచే బాక్సులు తెచ్చుకుంటున్నారు. కామారెడ్డి  జిల్లాలో1,008 స్కూల్స్​ ఉండగా 100 స్కూళ్లలో ఏజన్సీలు మిడ్​​డే మీల్స్ ​​నుంచి తప్పుకున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 325 స్కూళ్లలో మిడ్​డే మీల్స్​ నిలిచిపోగా, అధికారులు ‘అక్షయ పాత్ర’ అనే స్వచ్ఛంద సంస్థకు ఫుడ్​సప్లై అప్పగించారు. మెదక్​ జిల్లాలోని 262 స్కూళ్లలో ఏజెన్సీలు తప్పుకోగా, డీఈవో ‘అక్షయపాత్ర’ను సంప్రదించినా.. సంస్థ అభిప్రాయం చెప్పలేదు. మహబూబ్​నగర్​ జిల్లాలోని 45 స్కూళ్లలోనూ బాధ్యతల నుంచి ఏజెన్సీలు తప్పుకున్నాయి. ఖమ్మం జిల్లాలోని స్కూళ్లలోనూ ఏజెన్సీలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి.  కామేపల్లి మండలంలోని అడవి మద్దులపల్లి హైస్కూల్​లో వారం  క్రితం ఏజెన్సీ నిర్వాహకులు వంట బంద్ ​పెట్టారు. 50 రోజుల నుంచి వంట చేస్తున్నా బిల్లులు రాక చేతులెత్తేశారు. ప్రభుత్వం ఇవ్వకుంటే తాము చెల్లిస్తామని హెచ్​ఎం, సర్పంచ్​ హామీ ఇవ్వడంతో మళ్లీ స్టార్ట్​ చేశారు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనూ బిల్లులు రాకపోవడంతో స్కూళ్లలో ఏజెన్సీలు తరచూ వంట బంద్​​పెట్టి నిరసన తెలుపుతున్నాయి. ఆఫీసర్లు ఎక్కడికక్కడ రంగంలోకి దిగి నచ్చచెప్తున్నారు.

అమ్మ కూలికిపోతెనే బువ్వ

కరోనా తర్వాత ​రీ ఓపెన్​​ అయినప్పటి నుంచి స్కూల్​లో మధ్యాహ్నం భోజనం పెడ్తలేరు. కొందరు స్టూడెంట్లు ​ఇంటి నుంచి టిఫిన్​ తెచ్చుకుంటున్నరు. ఇంకొందరు మధ్యాహ్నం పోయి తిని వస్తున్నరు. మా నాన్న చనిపోయి కష్టాల్లో ఉన్నం. అమ్మ కూలీ చేస్తేనే భోజనం.. లేదంటే పస్తులే. అమ్మ తినీతినక మాకు బాక్సు కట్టి పంపిస్తున్నది. మాకు స్కూల్​లో ఎప్పటిలాగే భోజనం పెట్టాలి.- నందు, ఆరో తరగతి, ఉయ్యాలవాడ పాఠశాల

బిల్లులు పెండింగ్​లో పెట్టిన్రు

వంట ఏజెన్సీల బిల్లులు పెండింగ్​లో ఉన్న విషయం వాస్తవమే. మా దగ్గర ఎలాంటి తప్పూ లేదు. వంట ఏజెన్సీల బిల్లులను నెలనెలా రెడీ చేసి ఎంఈవోకు పంపిస్తున్నాం. కానీ, గవర్నమెంట్​ నుంచి మంజూరు కావడంలేదు. మీల్స్​ రేట్లు పెంచాలని ఏజెన్సీలు కోరుతున్నా సర్కారు నుంచి రెస్పాన్స్​ రావట్లేదు. దీంతో ఏజెన్సీలు తప్పుకుంటున్నాయి.-రవి కుమార్, హెచ్​ఎం, జడ్పీహెచ్​ఎస్, మిడ్జిల్​, మహబూబ్​నగర్​​ జిల్లా

మిత్తీలకు తెచ్చి వండుతున్నం

మిడ్జిల్​​జడ్పీహెచ్​ఎస్​లో 2019 నుంచి మిడ్​​డే మీల్స్​​వండుతున్నం. నాతో పాటు మరో ముగ్గురు వంటలు చేస్తరు. మాకు ఇప్పటివరకు నాలుగు నెలల బిల్లులు రావాలి. పిల్లలు మధ్యాహ్నం ఆకలిగొంటరని మిత్తీలకు డబ్బు తెచ్చి వండి పెడుతున్నం. గవర్నమెంటు మా గురించి కూడా ఆలోచించాలె కదా? మాకు పైసలేడికెల్లి పుట్టుకొస్తయి.- మణెమ్మ, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, మిడ్జిల్​

కాలేజీల్లోనూ అంతే!
మీల్స్​పై మూడేండ్లుగా నాన్చుతున్న సర్కార్​
కరోనా అంటూ స్కీమ్​ అమలు వాయిదా

సర్కారు జూనియర్​ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పెడ్తామని మూడేండ్ల కిందట రాష్ట్ర సర్కారు ప్రకటన చేసింది. అందుకోసం 2018లో అప్పటి విద్యా మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో సర్కారు కమిటీ వేసింది. ప్రభుత్వ ఇంటర్​, డిగ్రీ, పాలిటెక్నిక్​, ఐటీఐ, బీఈడీ, డీఈడీ, మోడల్​ జూనియర్​ కాలేజీల్లోని 4 లక్షల మందికి స్కీమ్​ అమలు చేస్తామని ప్రకటించింది. అయినా ఇప్పటిదాకా ఏ కాలేజీల్లోనూ పథకం మొదలు కాలేదు. కరోనాను సాకుగా చూపించి ఆ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో స్టూడెంట్లు ఆందోళనకు గురవుతున్నారు. 405 సర్కార్​ జూనియర్​ కాలేజీల్లో సుమారు 1.95 లక్షల స్టూడెంట్లున్నారు. 132 డిగ్రీ కాలేజీల్లో 1.40 లక్షల మంది దాకా చదువుతున్నారు. కరోనా కారణంగా నిరుడు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కొద్ది రోజులే ఫిజికల్​ క్లాసులు జరిగాయి. దీంతో సర్కారు మిడ్​ డే మీల్స్​ను అమలు చేయలేదు. 2021–22 విద్యా సంవత్సరం మొదలై మూణ్నెల్లు కావస్తున్నా.. ఇప్పటికీ స్కీమ్​ అమలు చేస్తారో లేదో స్పష్టతనివ్వలేదు. 

అడ్మిషన్లు పెరిగినై

సీఎం కేసీఆర్ హామీ మేరకు అడ్మిషన్ల ప్రచారంలో భాగంగా లెక్చరర్లు మధ్యాహ్న భోజన పథకాన్ని స్టూడెంట్లలోకి బాగా తీసుకెళ్లారు. దీంతో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్​, డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగాయి. ఇంటర్​ ఫస్టియర్లో 1.11 లక్షలు, డిగ్రీ ఫస్టియర్​లో 50 వేల దాకా చేరారు. ఈ కాలేజీల్లో చదివేది చాలావరకు పేద స్టూడెంట్లే. కేసీఆర్ మాటలతో కాలేజీల్లో మధ్యాహ్నం భోజనం దొరుకుతుందన్న భరోసా వారిలో కన్పించిందని లెక్చరర్లు చెబుతున్నారు. కానీ అదింకా అమలు కావడం లేదు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు సరిగా నడవట్లేదు. దీంతో ఉదయం కాలేజీలకు వచ్చిన స్టూడెంట్లు రాత్రి ఇంటికెళ్లేదాకా ఖాళీ కడుపుతోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

వెంటనే స్టార్ట్ చేయాలె

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ స్టార్ట్​ చేస్తామని ప్రగతిభవన్​ వేదికగా కేసీఆర్​ ప్రకటించారు. అడ్మిషన్లప్పుడు లెక్చరర్లు ఇదే విషయాన్ని పేరెంట్స్​కు చెప్పారు. అందుకే ఇంటర్​ ఫస్టియర్​ అడ్మిషన్లు లక్ష దాటాయి. పథకంపై సర్కారు ఏమీ చెప్పకపోవడంతో స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మిడ్​ డే మీల్స్​కు సీఎం కేసీఆర్​ చర్యలు తీస్కోవాలె.-మధుసూదన్​​రెడ్డి, చైర్మన్ ఇంటర్​ విద్యా జేఏసీ